విజయవాడలో సివి సంస్మరణ సభ

సాంస్క తిక విప్లవ మహాకవి సివి (చిత్తజల్లు వరహాలరావు) అని, ఆయన రచనలు ఎప్పటికీ ఆదర్శనీయమని పలువురు వక్తలు కొనియాడారు. ప్రగతి సాహితీ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో సివి ప్రథమ సంస్మరణ సభ అక్టోబర్‌ 8న జరిగింది. ప్రజాసాహితి ప్రధాన సంపాదకులు కొత్తపల్లి రవిబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో సివి చివరి రచనల సంపుటి ' వర్తమాన భారతం' ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన భార్య స్వతంత్ర భారతి మాట్లాడుతూ ఆయన జీవిత చివరి దశలో ఒంటరిగా కూర్చుని ఎవో రాసుకునే వారని, అప్పట్లో వాటిని పట్టించుకోలేదని, ఆయన మరణించిన తర్వాత వాటిని సంపుటిగా ప్రచురించామన్నారు. సాహితీ విమర్శకులు కడియాల రామ్మోహన్‌రాయ్‌ మాట్లాడుతూ తన రచనల ద్వారా ప్రతి అంశాన్ని వివరణాత్మకంగా అందించిన ఘనత సివికే దక్కుతుందన్నారు. విషాద భారతం, నరబలి, ఊళ్లోకి స్వాములోరు విచ్చేశారు, కారు చీకట్లో కాంతి రేఖ, పారీస్‌ కమ్యూన్‌ తదితర రచనలల్లోని అంశాలను ఆయన ప్రస్తావించారు. మానవ వికాస వేదిక వ్యవస్థాపకులు వి సాంబశివరావు మాట్లాడుతూ సివి రచించిన ' సత్యకామ జాబాలి' చదివి ఎంతోమంది ప్రేరణ పొందారన్నారు. ఈ తరం యువత ఆయన రచనలు చదవాలని సూచించారు. యువ కవి అనిల్‌ డ్యానీ మాట్లాడుతూ మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలకు వ్యతిరేకంగా సి.వి. గొప్ప రచనలు చేశారన్నారు.    సింగంపల్లి అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ మార్క్సిస్టు దక్పథంలో ప్రగతిశీల రచనలు చేసిన అభ్యుదయ సాహితీ వేత్త సివి అన్నారు. జనసాహితి అధ్యక్షులు దివికుమార్‌ మాట్లాడుతూ జీవితాంతం మార్క్సిస్టు భావాలకు నిబద్ధుడుగా నిలిచిన అరుదైన వ్యక్తి సివి అని అన్నారు. సాహితీ స్రవంతి అధ్యక్షులు వొరప్రసాద్‌ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో సివి రచనల అవసరం ఎంతైనా ఉందన్నారు. సాహితీ విమర్శకులు జివి భద్రం సివితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారత నాస్తిక సమాజం సభ్యులు నరేష్‌, నూకరాజు, చార్వాక పత్రిక సంపాదకులు టి కోటేశ్వరరావు, ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ సంపాదకులు ఉషారాణి, శాంతిశ్రీ, సివి కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.