భిన్నంగా..వైవిధ్యంగా.. కర్నూలు పుస్తక సంబరాలు

నివేదిక

- జంధ్యాల రఘుబాబు

నవ్యాంధ్ర పుస్తక సంబరాలు కర్నూలు నగరంలోని ఎగ్జిబిషన్‌ మైదానంలో నవంబర్‌ 3 నుండి 11 వరకు విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌, ఆంధ్రప్రదేశ్‌ భాషా సాంస్కృతిక శాఖ, ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ సంయుక్తంగా నిర్వహించింది. ప్రాంగణానికి స్వాతంత్ర సమరయోధులు గాడిచర్ల హరిసర్వోత్తమ రావు పేరును, సాహిత్య సాంస్కృతిక వేదికకు దళిత సాహిత్య చేగువేరా నాగప్పగారి సుందర్రాజు పేరుతో ఏర్పాటు చేశారు. 42 స్టాళ్ళు 500 పబ్లిషర్స్‌తో ఏర్పాటు చేశారు. ప్రారంభ సభకు ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ, పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, నగర కమీషనర్‌ డా.హరినాథరెడ్డి, డిఇఓ తాహెరా సుల్తానాతో పాటు సిపియం పార్టీ కార్యదర్శి కె.ప్రభాకర్‌ రెడ్డి, బియస్‌పి మోజెస్‌, ఆప్‌ సుబ్బయ్య, రవీంధ్ర విద్యాసంస్థల అధినేత పుల్లయ్యలు పాల్గొన్నారు. పుస్తక విశిష్టతతో పాటు నన్ను ప్రనావితం చేసిన పుస్తకం గూర్చి మాట్లాడారు. అనంతరం గాడిచర్ల హరిసర్వోత్తమ రావు పై సదస్సు నిర్వహించారు. 4వతేది కర్నూలు కథ-కవిత -అస్తిత్వ ఉద్యమాలు  అంశంపై జి.వెంకటకృష్ణ సభాధ్య్షతన సభ జరిగింది. వక్తలు కథా సాహిత్యంలో లోతైన అనుభవాలను విరించారు. అనంతరం నాగప్ప గారి సుందర్రాజు సాహిత్యంపై సదస్సు జరిగింది. సవ్వప్ప గారి ఈరన్న, రచయిత, అధ్యక్షులు, కమలా కళానికేతన్‌, పత్తికొండ, డా.దేవవరప్రసాద్‌, డీన్‌, థిóయోలాజికల్‌ ఇనిస్టిట్యూట్‌, కర్నూలు, డా.ఆంజనేయుడు, కొత్తూరు సత్యనారాయణ గుప్త, ప్రధాన సంపాదకులు, గణేష్‌ దినపత్రిక, కర్నూలుఅసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ తెలుగుశాఖ, రాయలసీమ విశ్వవిద్యాలయం, కర్నూలు., డా.కల్లూరి ఆనందరావు, రిటైర్డ్‌ ప్రిన్సిపల్‌, మహానంది, గుంపుల వెంకటేశ్వర్లు, కవి, కోయిలకుంట్ల తదితరులు దళిత కవిత్వంతో పాటు నాగప్పగారి సుందర్రాజు సాహిత్య జీవితంలోని అనేక విషయాలను చర్చించారు. అభ్యదయ గీతాలాపనతో పాటు ప్రముఖ కవి తెలకపల్లి రవి రచించిన ప్రజాకవి వేమన సంగీత నృత్య రూపకం, ప్రజానాట్యమండలి వారు అద్భుతంగా ప్రదర్శించారు. 5వ తేది జిరిగిన తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం-విశిష్టత అంశంపై జరిగిన సభకు రచయిత్రి, ఎమ్మిగనూరుకు చెందిన ఎన్‌.నాగమణి, అధ్యక్షత వహించారు. కళ్యాణదుర్గం స్వర్ణలత, రచయిత్రి, కర్నూలు, డా.సుభాషిణి రచయిత్రి, కర్నూలు, డా.దండెబోయిన పార్వతి, తెలుగు శాఖాధిపతి, సిల్వర్‌ జూబ్లి కళాశాల, కర్నూలు, డా.యం.వెంకట లక్ష్మమ్మ, అధ్యాపకురాలు, డిగ్రీ కళాశాల, కోయిలకుంట్ల, వింధ్యావాసిని దేవి, తెలుగు ఆధ్యాపకురాలు, కేవిఆర్‌ కళాశాల, కర్నూలు, సీతామహాలక్ష్మి, రచయిత్రి, కర్నూలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

స్త్రీలకు స్వాతంత్య్రం వొకరిచ్చేది కాదని అది సహజంగా వుండాలని, బేటీ బచావో బేటీ బడావో అన్న నినాదం ఇవ్వడంలో అర్థం లేదని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి సాహితీ స్రవంతి ఈ సభలో ముఖ్య వక్తగా హాజరైన ప్రముఖ రచయిత్రి డా.సుభాషిణి మాట్లాడుతూ పుస్తకం లేని ఇల్లు గాలి వెలుతురు లేని ఇల్లువంటిదన్నారు. అనుభవించిన బాధలు పుస్తకాల్లో వుంటుందన్నారు. సాహిత్యంలో మనిషి వర్గం, కులం, ప్రాంతం జెండర్‌తో పాటు సంతోషాలు దు:ఖాలు వుంటాయన్నారు. స్త్రీలకు రెక్కలంటే ఆలోచనలన్నారు. సమానహక్కులకై పోరాడాలన్నారు. రచయిత్రీ కళ్యాణదుర్గం స్వర్ణలత మాట్లాడుతూ స్త్రీలను విలువల చట్రంలో బంధించారని ఆ బంధనాలను తెంపుకుని రావాలన్నారు. స్త్రీలకు సహజంగా హక్కులుండాల్సీందేనని వాటికి అడ్డుపడొద్దన్నారు. స్త్రీలు  ఆలోచల పరిధిని పెంచుకోవాలన్నారు. ఆలోచనల విస్త తి పెరిగిందన్నారు. సాహిత్యం ద్వారా సమాజాన్ని మార్చొచ్చన్నారు. కరమైన అణచివేతకు గురౌతున్న భావన కలుగుతుందన్నారు. ఫెమినిజంలో రాడికల్‌ ఫెమినిజం, లిబరల్‌ ఫెమినిజం, మార్క్సిస్ట్‌ ఫెమినిజమన్న భాగాలున్నాయన్నారు. అనంతరం డా.దండెబోయిన పార్వతి మాట్లాడుతూ సాహిత్యంలో స్త్రీలు గొప్పగా రాణిస్తున్నారని ఈ వొరవడి పెరగాలన్నారు. స్త్రీల సాహిత్యం ప్రపంచమంతా గుర్తిస్తుందన్నారు. రచయిత్రి వింధ్యావాసినీ దేవి మాట్లాడుతూ స్త్రీవాద సాహిత్యంలో నానీలు, కవితల ధోరణి వివరించారు. సభలో సీతామహాలక్ష్మీ, వెంకట లక్ష్మి తదితరులు స్త్రీ సమస్యలపై చర్చించారు.. సభలో ఆయా పాఠశాలల విధ్యార్థుల సాంస్కతిక ప్రదర్శనలు అలరించాయి. సాంస్కతిక ప్రదర్శనల్లో భాగంగా బతకన్న పాట సభికులను అలరించింది. 6న పోతులూరి వీరబ్రహ్మ్రం- సామాజికత సదస్సు జరిగింది. సభాధ్యక్షులుగా డా.వి.పోతన్న జానపద కవి, రచయిత కర్నూలు, ముఖ్యఅతిథిగా ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌ రెడ్డి, కేంద్ర సాహిత్య అకాడమి గ్రహీత, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సుప్రసిద్ధ జర్నలిస్ట్‌ తెలకపల్లి రవి పాల్గొని సాహిత్యంలో వీరబ్రహ్మం మొదలు వర్తమాన సాహిత్యాంశాలు వివరించారు. గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి, కవి, కర్నూలు.ఈమని రామకృష్ణ ప్రసాద్‌, రచయిత, కర్నూలు సందేశమిచ్చారు. ప్రస్తుత మతోన్మాద సందర్భంలో పోతులూరి వీరబ్రహ్మం సామాజిక కృషి ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని కాంక్షించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా అభ్యదయ గీతాలాపన, ప్రతిభమోడల్‌ స్కూల్‌ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 7న తెలుగు భాషా వికాసం సదస్సుకు సభాధ్యక్షులుగా డా.మండి అన్వర్‌ హుసేన్‌ తెలుగు శాఖాథిపతి, ఉస్మానియా కళాశాల, కర్నూలు, ముఖ్యఅతిథిగా జెయస్సార్కె శర్మ, రాష్ట్ర కార్యదర్శి, తెలుగు భాషా వికాస ఉద్యమం, కర్నూలు, డా.గోపవరం రామచంద్రన్‌, ప్రిన్సిపల్‌, ప్రభుత్వ శారద సంగీత నృత్య కళాశాల, గన్నమరాజు సాయిబాబా,  అధ్యక్షులు, కర్నూలు జిల్లా తెలుగు రచయితల సంఘం వారు భాషా వికాసానికి చేయాల్సిన కృషిని వివరించారు. సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఏకపాత్రాభినయం, లలితకళాసమితి వారి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 8న జరిగిన ప్రపంచీకరణ- సంస్కృతి సభాధ్యక్షులుగా కవి, సాహిత్య ప్రస్థానం సంపాదక వర్గ సభ్యులు కెంగార మోహన్‌, ముఖ్యఅతిథిగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రజాశక్తి పూర్వ సంపాదకులు తెలకపల్లి రవి పాల్గొన్నారు. సభలో ఆయన మాట్ల్లాడుతూ పంచభూతాలపై ఆధిపత్యాన్ని సంపాదించి వాటిని కబళించే భూతంలా మారిన విషబీజమే ప్రపంచీకరణ అన్నారు. సంపన్నదేశాల ఆర్థిక సాంస్కృతిక రాజకీయ సైనిక ఆధిపత్యానికి సంకేతమన్నారు. ప్రపంచీకరణలో సామాన్యులకు చోటు లేదన్నారు. మార్కెట్‌-మతం ప్రపంచీకరణకు బొమ్మా-బొరుసు లాంటివన్నారు. నీరు, భూమి, ఆకాశం, ప్రపంచీకరణ గుప్పెట్లోకి వెళ్ళాయన్నారు. మీడియాను కూడా శాసిస్తోందన్నారు. రక్షణరంగంలో కూడా విదేశీపెట్టుబడులొస్తే రక్షణేముంటుందన్నారు. స్త్రీలను కించపరిచి, స్త్రీలను వస్తువుగా చూసే సంస్కృతి ప్రపంచీకరణలో భాగమైందన్నారు. దేశభక్తి అన్నది భారతీయ జీవన విధానమని, అదినినాదం కాదన్నారు. విషసంస్కృతి - విశ్వసంస్కృతి వేర్వేరన్నారు. ప్రముఖ రచయిత ఇనాయతుల్లా, పీఓపి నాయకులు పి.భార్గవ, తెలుగు శాఖాధిపతి, బాలశివ డిగ్రీ కళాశాల,  డా.భీమా మోహన్‌ రావులు ప్రసంగించారు.  శ్రీలక్ష్మి హైస్కూల్‌ సాంస్కృతిక కార్యక్రమాలు రవీంధ్ర మోడల్‌ స్కూల్‌ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.9న స్వాతంత్రోద్యమంలో కర్నూలు పాత్ర సభాధ్యక్షులుగా డా.బడేసాహెబ్‌, చరిత్ర అధ్యాపకులు, డిగ్రీ కళాశాల, నందికొట్కూరు, డా.ఎం.అన్వర్‌ హుసేన్‌, అధ్యాపకులు, తెలుగు శాఖ, ఉస్మానియా కళాశాల, కర్నూలు, యస్‌డివి అజీజ్‌, నవలా రచయిత, కర్నూలు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, గురజాడ సంగీత నృత్య రూపకం యస్‌. స్వర్ణలత అన్నమయ్య కీర్తనలు అలరించాయి.10న కర్నూలు నవల -నాటకం సదస్సుకు సభాధ్యక్షులుగా రాష్ట్ర కార్యదర్శి, సాహితీస్రవంతి, జంధ్యాల రఘుబాబు,  ముఖ్యఅతిథిగా  పత్తి ఓబులయ్య, నాటకకర్త, నంది అవార్డు గ్రహీత, కెఎన్‌ఎస్‌ రాజు, రచయిత కర్నూలు, బి.దస్తగిరి నంది అవార్డు గ్రహీత, కర్నూలు, రంగనాథరామచంద్ర, అనువాద రచయితలు మాట్లాడారు. వందేళ్ళ ఘనచరిత్ర కలిగిన తెలుగు నాటకరంగం తిరోగమనదిశలో ఉందని, ప్రభుత్వ ప్రోతాహమున్నా నాటకరంగంపై ఆసక్తి కనబరచడం లేదని ప్రముఖ నాటకకర్త, రచయిత, నంది అవార్డు గ్రహీత పత్తి ఓబులయ్య అన్నారు. ఎన్నో ఒడుదుడుకులను ఎదర్కొంటున్న నాటకరంగం తన వైభవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉందన్నారు. నాటక అకాడమీ పునరుద్దరించి ప్రభుత్వం చేయూత నిస్తూనే ఉందని, గుమ్మడి గోపాలకృష్ణ సారథ్యంలోని నాటక అకాడమి ఆంధ్రదేశంలో ప్రతిపల్లెకు విస్తరించే ప్రయత్నం చేస్తూనే ఉందన్నారు. గతంలో యక్షగానాలు, బుర్రకథలు, పరిణామక్రమంలో తెలుగు నాటకం విస్తరించిందన్నారు.  గ్రామీణ స్థాయిలో కళాకారులు రావాల్సి ఉందని, సమాజాన్ని చైతన్య పరిచే ఆయుధాలు నాటకాలన్నారు. నటులు కళాకారులు సాంస్కృతిక పునజ్జీవనానికి కృషి చేస్తున్నారని ఆ ఒరవడి కొనసాగాలన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధులు ఉయ్యాల వాడ నరసింహరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సైరా నరసింహరెడ్డి నాటకాన్ని ప్రదర్శించారు. అద్భుతమైన నటనతో నటులు ఆకట్టుకున్నారు. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి పాత్రలో జి.వి.శ్రీనివాస్‌ రెడ్డి, తహసీల్ధార్‌గా రాఘవాచారి, వాట్సన్‌ దొరగా లక్ష్మీకాంతరావు, నార్టన్‌ దొరగా భాస్కర్‌ సీతన్నగా ఆంజనేయులు నటించగా ఈ నాటకానికి దర్శకత్వం పత్తి ఓబులయ్య వ్యవహరించి వ్యాఖ్యానం చేశారు. కర్నూలు చిల్డ్రన్స్‌ క్లబ్‌ వారి ఆధ్వర్యంలో దేశభక్తి గేయాలు, బాలిక వివక్ష గేయాలు అలరించారు. అల్‌ ఇన్‌ వన్‌ కోలా పాటకు విద్యార్థుల ప్రదర్శన అలరించింది. జోహరాపురం చిన్నారుల నటనకు ప్రేక్షకులు కరతాళధ్వనులు చేశారు. సాహిత్య సభ ప్రారంభానికి ముందు కవి మాధన్న, టీచర్‌ సునీతాబాయి కవితగానం కొనసాగింది.

నవ్యాంద్ర పుస్తక సంబరాలలో ఒక రోజు ''వాక్‌ ఫర్‌ బుక్స్‌ ''అనే కార్యక్రమాన్ని రచయిత జి .వెంకటక ష్ణ జిలా పరిషత్‌ దగ్గర జెండా ఊపి ప్రారంభించారు.  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వెంకటకష్ణ మాట్లాడుతూ పుస్తక కోసం నడక తప్పని సరి జరగాలని యవత ఇందులో పాల్గొనడం అభినందనీయమన్నారు. చిరిగిన చొక్కా నైనా తొడుక్కో మంచి పుస్తకం కొనుక్కో, అన్న కందుకూరిని స్మరించాలన్నారు.

పుస్తకం మంచి నేస్తం అంటూ మున్సిపల్‌ ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ వరకు ఈ పాదయాత్ర జరిగింది. సోషల్‌ వీడియో నాయకులు ఎల్లాగువేరా, ప్రజాశక్తి బుక్‌ హౌస్‌ ఇన్‌ ఛార్జి జి.మధు మరియు శ్రీ చైతన్యం కాలేజి విద్యార్థులు పాల్గొన్నారు.