రాసింది శ్రీశ్రీ కాదు, దాశరథి

స్పందన

'సాహిత్య ప్రస్థానం' మాస పత్రిక జనవరి,2019 సంచికలో 'ఘంట సాల గొంతులో శ్రీశ్రీ పాట' శీర్షికన అమర గాయకుడు ఘంటసాల పాడిన శ్రీశ్రీ పాటలు నేటి పాఠకులకు అందించిన రచయిత సక్కిరి భాస్కర్‌గారికి అభినందనలు.  ఆ వ్యాసంలో చోటుచేసుకున్న కొన్ని సవరణలు, వివరణలు (ముఖ్యంగా శ్రీశ్రీకి సంబంధించి) పాఠకుల కోసం..

''శ్రీశ్రీ సామాజిక ప్రయోజనం గల పాట లతో పాటు అన్ని రకాల పాటలనూ రాశారు. ఇంకా చెప్పాలంటే అవసరమైన చోట వేరే రచయితల కంటే ఉదారంగా తన 'ముద్ర' నుండి తప్పుకుని మరీ రాశారు. అలా రాసిన పాటలే ప్రేమ పాటలు. 1.'నీలోన నన్నే నిలిపేవు నేడే...( గుడి గంటలు).2.ఓ..సజీవశిల్పసుందరి..ఎవరివో నీవెవరివో(పునర్జన్మ). 3.ఆకాశవీధిలో అందాల జాబిలి (మాంగల్య బలం).4.ఎవ్వరి కోసం ఈ మందహాసం (నర్తనశాల) 5. ఎందుకో సిగ్గెందుకో (సిరి సంపదలు). 6. జోరుగా హుషారుగా (భార్యాభర్తలు) లాంటి ప్రేమ గీతాలు రాశారు''  అంటూ అమర గామరకుడు ఘంటసాల గానం చేసి ప్రాణం పోసిన  శ్రీశ్రీ అద్భుత గీతాలను ఉదహరించారు.

ఇందులో వ్యాస రచయిత ఉదహరించిన  'నీలోన నన్నే నిలిపేవు నేడే' (గుడి గంటలు) గీతం శ్రీశ్రీ రాసిన గీతం కాదు. ఈ గీత రచ యిత దాశరథి. (పూర్తిపేరు దాశరథి కృష్ణమాచార్య. ప్రముఖ చలనచిత్ర రచయిత. 'అగ్ని ధార, రుద్రవీణ'లాంటి విప్లవ చైతన్య కావ్యకర్త. తెలంగాణ రచయిత)

'గుడి గంటలు' చిత్రానికి అసలు శ్రీశ్రీ పని చేయలేదు. ఈ చిత్రంలోని ఆరు పాటలను 'దాశరథి, సి.నారె, ఆత్రేయ, ఆరుద్ర, అనిసెట్టి నార్ల చిరంజీవి' రాశారు. మాటలు ముళ్లపూడి వెంకటరమణ. ఘంటసాల ఈ చిత్ర సంగీత దర్శకుడు. దర్శకుడు వి. మధుసూదనరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  రాజలక్ష్మి ప్రొడక్షన్స్‌ బేనర్‌పై సుందర్‌లాల్‌ నహతా, డూండీ నిర్మించారు.

అదే వ్యాసంలో మరో సవరణ: 'ఈ హరికథను రుణశ్రీ రాసిన 'హృద యశ్రీ' ఉన్న కావ్యం' 'హృదయశ్రీ' కాదు      ఉదయశ్రీ. కరుణశ్రీ కావ్యాలు ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ.' 

వివరణ: 'హృదయశ్రీ' కరుణశ్రీ కావ్యం కాదు. ప్రసిద్ధులు కరుణశ్రీ(జంధ్యాల పాపయ్య శాస్త్రి)గారి కావ్యాలు 'ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ'.