కందుకూరి శతవర్దంతి సభ

విజయవాడ 30వ పుస్తక ప్రదర్శన ప్రాంగణంలోని యద్ధనపూడి సులోచనారాణి వేదికపై సాహితీస్రవంతి ఆధ్వర్యంలో జనవరి 5న కందుకూరి శతవర్దంతి సభ జరిగింది. సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షులు వొరప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన ఈ సభలో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్‌, శాసనమండలి సభ్యులు విఠపు బాలసుబ్రహ్మణ్యం, రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, కనుపర్తి విజయబక్ష్‌, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథి జాస్తి చలమేశ్వర్‌ మాట్లాడుతూ గత ఏభై

ఏళ్ళుగా దేశంలో కందుకూరి, గురజాడలాగా ప్రజల్ని ఉత్తేజపరిచే వాళ్ళు కనపడట్లేదని అన్నారు. ఈ రోజు దేశం గురించి, సమాజం గురించి మాట్లాడేవాళ్ళు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రానంతరం నేడు దేశాన్ని పట్టించుకోవలిసిన అవసరం అత్యంత తీవ్రంగా ఉందని అన్నారు. శాసనమండలి సభ్యులు విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గోదావరి వంతెనకు కందుకూరి పేరు పెట్టాలని ఉపాధ్యాయ సంఘాలు తీర్మానం చేసి ప్రభుత్వాన్ని కోరాయని, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని, దీన్నిబట్టి కందుకూరి భావాల వ్యాప్తికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో కృషిచేస్తాయని భావించలేమని అన్నారు. కందుకూరి రచనలు ప్రజలందరికీ చేరాలే ప్రభుత్వం కృషిచేసేలా ఒత్తిడి తీసుకురావలసిన బాధ్యత రచయితలు, మేధావులపై ఉందని అన్నారు. కందుకూరి సంఘసంస్కరణ ఉద్యమాల గురించి కనుపర్తి విజయబక్ష్‌, కందుకూరి సాహిత్య కృషిపై రాచపాళెం సమగ్ర ప్రసంగం చేశారు.