'ఏడవ రుతువు' కవితాసంపుటి ఆవిష్కరణ

విజయవాడలో ఎం.బి. విజ్ఞానకేంద్రంలో జనవరి 19న కవయిత్రి వైష్ణవిశ్రీ కవితా సంపుటి 'ఏడవ రుతువు ఆవిష్కరణ సభ జరిగింది. సాహితీస్రవంతి అమరావతి కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు శాంతిశ్రీ అధ్యక్షత వహించారు. సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షులు వొరప్రసాద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ వైష్ణవిశ్రీ కవిత్వం సామాజిక దృష్టిని కలిగి వుంటుందని అన్నారు. ఆవేదన కలిగించిన సామాజిక సమస్యల్ని కవిత్వంగా మలిచారని అన్నారు. నేడు సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై వైష్ణవిశ్రీ తన కవితల ద్వారా స్పందించారన్నారు. తొలిప్రతిని వైష్ణవిశ్రీ మాతృమూర్తి మోతి గారికి వొరప్రసాద్‌ అందించారు. పుస్తక సమీక్ష చేసిన ప్రముఖ కవయిత్రి మందరపు హైమవతి మాట్లాడుతూ తొలికవితా సంపుటితోనే మంచి కవయిత్రిగా వైష్ణవిశ్రీని గుర్తించవచ్చని అన్నారు. ఏడవ రుతువు పేరుతో ఈ సంపుటిలో కవిత లేదని, అయితే ప్రకృతిలో ఆరు రుతువులతో సమానంగా స్త్రీని ఏడో రుతువుగా వైష్ణవిశ్రీ ఊహించడం అభినందించదగిన విషయం అన్నారు. ఈనాటి సమాజం ఎదుర్కొంటున్న పలు అంశాలను కవితా వస్తువులగా తీసుకుని కవిత్వాన్ని పండించారని, ముందు ముందు మరింత శక్తివంతమైన కవిత్వం రాయడానికి ఈ ఏడవ రుతువు కవితా సంపుటి ప్రాతిపదిక అవుతుందని హైమవతి అన్నారు.సభలో సత్యాజీ, అనిల్‌డ్యాని ప్రసంగించారు. చివరగా కవయిత్రి వైష్ణవిశ్రీ స్పందిస్తూ చిన్నప్పటి నుండీ ప్రశ్నించే మనస్తత్వం తనదని తెలిపారు. ఆ క్రమంలోనే కవయిత్రిగా మారానని అన్నారు. సమాజంలోని కులం, మతం, వివక్ష వంటివి తనని అసహనానికి గురిచేస్తాయని అన్నారు. సాహితీస్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సత్యరంజన్‌, అమరావతి సాహితీస్రవంతి కమిటీ బాధ్యులు డా|| రావెళ్ళ, గంగాధర్‌ వీర్ల, గుండు నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.