గజల్‌ ఆదినారాయణ సంస్మరణ సభ

జల్స్‌ ద్వారా సామాన్యులను సైతం చైతన్యం చేసిన ప్రముఖ గజల్‌ కళాకారుడు ప్రదాన ఆదినారాయణ లేనిలోటు సాహితీ జగత్తుకు తీరని లోటు అని వక్తలు పేర్కొన్నారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్‌లో ప్రముఖ గజల్‌ కళాకారుడు, సాహితీవేత్త ప్రదాన ఆదినారాయణ సంస్మరణ సభను సాహితీస్రవంతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 24న నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ తుదిశ్వాస విడిచేవరకు పాటనే ఊపిరిగా చేసుకొని జీవించారన్నారు. సమాజంలోని రుగ్మతలను స్వీకరించి తన గానంతో ప్రజలకు సందేశాన్ని అందించేవారని కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కపారాణి మాట్లాడుతూ సాహిత్యానికి, సంగీతానికి సుపరిచితులైన వ్యక్తి ప్రదాన ఆదినారాయణ అని అన్నారు. పలువురు సాహితీవేత్తలు మాట్లాడుతూ కళారంగానికి ఆదినారాయణ చేసిన సేవలను ప్రభుత్వం గుర్తించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదినారాయణతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం ప్రదాన ఆదినారాయణ పాడిన గజల్స్‌ సిడిని ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో సాహితీస్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతాడ రామారావు, రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్‌, కేతవరపు శ్రీనివాస్‌, డి.ఆర్‌.కె. నాయుడు తదితరులు పాల్గొన్నారు.