కర్నూల్లో కందుకూరి శతవర్ధంతి సభ

కందుకూరి శతవర్దంతి కర్నూలు జిల్లా ఆహ్వానసంఘం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న కర్నూలులోని లలితకళాసమితి లో కందుకూరి శతవర్ధంతి వేడుకలు జరిగాయి.  ఆహ్వాన సంఘం అధ్యక్షులు పత్తిఒబులయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో సాహితీస్రవంతి గౌరవ అధ్యక్షులు తెలకపల్లి రవి మాట్లాడారు. కందుకూరి అధ్యయనం వల్లనే చరిత్రలో నిలిచిపోయారని దాదాపు 130 పుస్తకాలు రచించారని అన్నారు. ఈ దేశంలో నేటికి బాల్యవివాహాలు ఉండటం సిగ్గుచేటన్నారు. మూఢాచారాలను, దురాచారాలను ఆయన ఆనాడే ఖండించి జాతికి శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచారన్నారు.  వాస్తును వ్యతిరేకించి, వాస్తవానికి బాటలు వేశాడన్నారు. మోది గంగా హారతిని చూసి నేతలందరూ నదులకు హరతులు పట్టడం విడ్డూరమన్నారు. హిమాచల్‌ శాసన సభలో యజ్ఞంచేయడం మూర్ఖత్వం కాక మరేమవుతుందన్నారు.  రాజ్యాంగంలో రాసుకున్న నిబంధనలు  పాటించని వారు మనల్నేలే పాలకుని ఇది పురోగమనమా? తిరోగమనమా అని ప్రశ్నించారు. ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షులు జి.పుల్లయ్య మాట్లాడుతూ కందుకూరి ఆశయాల సాధనకు పునరంకితం కావాలన్నారు. ఆహ్వాన సంఘం కన్వీనర్‌ యస్‌యండి ఇనాయతుల్లా మాట్లాడుతూ కందుకూరి శత వర్ధంతి ఉత్సవాలను జిల్లాలో 18 చోట్ల జరిపామని, నేటి ఆధునిక తరానికి కందుకూరిని పరిచయం చేసే అవకాశం కల్గిందన్నారు. ఈ సభలో కందుకూరిపై జంధ్యాల రఘుబాబు రాసిన పాటని యంపి బసవరాజు పాడి వినిపించారు. ఈ సభలో ప్రగతి విజ్ఞాన కేంద్రం కన్వీనర్‌ జెయన్‌ శేషయ్య, ఐద్వా రాష్ట్ర నాయకులు నిర్మల, అలివేలమ్మ తదితరులు ప్రసంగించారు. అంతకు ముందు కందుకూరి చిత్రపటానికి పూలమాల వేసి సభ ప్రారంభించారు. కందుకూరి శత వర్థంతి సభల నిర్వహణలోనూ, వక్తలుగా పాల్గొన్న గౌరెడ్డి హరిశ్చంద్రా రెడ్డి, యస్‌ బాలాజీరావ్‌, కళ్యాణదుర్గం స్వర్ణలత, ఎన్‌.నాగమణి తదితరులను ఆహ్వన సంఘం సభ్యులు  సత్కరించారు. ఈ సభకు వాఖ్యాతగా ఆహ్వన సంఘం సమన్వయ కర్త,  సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి కెంగార మోహన్‌ వ్యవహరించారు.