కర్నూలు పట్టణంలోని పింగళిసూరన తెలుగుతోట (ఫంక్షన్ హల్)లో ఫిబ్రవరి 3న జంధ్యాల రఘుబాబు పాటల పుస్తకం 'సైరా మా బళ్లారి' ఆవిష్కరణ సభ జరిగింది. విశ్రాంత ఉపాధ్యాయులు కోటేశ్వరప్ప పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు ఎంపి బసవరాజు అధ్యక్షతన జరిగిన సభలో సాహిత్య ప్రస్థానం సంపాదకవర్గ సభ్యులు కెంగార మోహన్ మాట్లాడుతూ ఏ పాటకైనా సాహిత్యమే జీవం, అది సమాజంలో ప్రజల్ని చైతన్య పరుస్తుందని అన్నారు. ఈ పాటల్లో రచయిత పర్యావరణ ప్రేమికుడుగా, మార్క్సిస్ట్‌గా, అంబేడ్కరిస్టుగా కనిపిస్తాడన్నారు. ఆకాశవాణి కర్నూలు స్టేషన్ సంచాలకులు రొక్కం కామేశ్వరరావు మాట్లాడుతూ పాటకు సరైన బాణీ ప్రధానమన్నారు. అనంతరం లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య మాట్లాడారు. రఘుబాబు రాసిన పాటల్ని గాయకులు పాడి వినిపించారు. రచయిత జంధ్యాల రఘుబాబు స్పందిస్తూ సమాజంలోని అసమానతల్ని కవితలు, కథలతోనే కాక పాటలతో అందించాలన్న సంకల్పంతో ఈ ప్రయత్నం చేశానన్నారు. ఈ సభలో సాహితీస్రవంతి జిల్లా నాయకులు గౌరెడ్డి హరిశ్చంద్రా రెడ్డి, సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.