అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సాహితీస్రవంతి విశాఖ శాఖ మహిళల అంశాలపై విశాఖపట్నంలోని పౌరగ్రంథాలయంలో మార్చి 7న 'కవి సమ్మేళనం నిర్వహించింది. ఇందులో 10 మంది కవయిత్రులతో సహా 29 మంది కవులు తమ కవితలను చదివారు. ఈ కవితలలో మహిళలు నేడు సమాజంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ప్రస్తావించడం జరిగింది. కార్యక్రమానికి ఎ.వి.యన్. కళాశాల తెలుగు శాఖాధిపతి ప్రొ|| అయ్యగారి సీతారత్నం ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమాజంలో స్త్రీలు నేడు అనేక విషమ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, వాటిని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్ళాలని, వామపక్షాలు, వారి ప్రజాసంఘాలు నిస్వార్థంగా మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నాయని, ఆ కృషికి అందరూ తోడ్పాటునివ్వాలని కోరారు. సాహితీస్రవంతి ప్రత్యేకంగా మహిళా అంశాలపై కవి సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీలో సభ్యురాలిగా నియమితులైన సాహితీవేత్త శ్రీమతి జగద్ధాత్రి గారిని సత్కరించారు. శ్రీమతి జగద్ధాత్రి తనకు జరిగిన సత్కారానికి ధన్యవాదాలు తెలుపుతూ, కవులు తమ కవితలలో వస్తువు, శిల్పం మరింత మెరుగుపరుచుకోవాలని కోరారు. కార్యక్రమానికి సాహితీస్రవంతి విశాఖ శాఖ అధ్యక్షులు ఎ.వి. రమణారావు అధ్యక్షత వహించగా, కార్యదర్శి నూనెల శ్రీనివాసరావు, సభ్యులు శివకోటి నాగరాజు, సుజాతామూర్తి, కృష్ణవేణి తదితరులు సభాకార్యక్రమాన్ని సమన్వయం చేశారు.