అక్షరం కొందరి సొంతం కాదని, అందరి సొంతమని తన పద్య రచనల ద్వారా సమాజంలో పేరుకుపోయిన కుల, వర్ణ వివక్షతను ఎండగట్టిన అక్షర శిల్పి కొండవీటి వేంకటకవి అని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.రజని కొనియాడారు. కళాప్రపూర్ణ కొండవీటి వేంకటకవి శతజయంతి సభ గుంటూరులోని కొమ్మినేని గార్డెన్స్‌లో ఏప్రిల్ 3న నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కెఎస్.లక్షణరావు అధ్యక్షత వహించారు. జస్టిస్ రజని మాట్లాడుతూ వేంకటకవి సాహిత్యంలో తానునమ్మిన వాదాన్ని పద్య రచనల ద్వారా బహిర్గతం చేయగలిగారని, వర్ణ వ్యవస్థను ఎండగట్టారని కొనియాడారు. చిరు ప్రాయంలోనే అశుకవిగా, అవధానిగా, వక్తగా, ఉపాధ్యాయునిగా, కవిగా, భాష్యకర్తగా, సినీగేయ రచయితగా, పత్రికా వ్యాసకర్తగా, సంఘ సంస్కర్తగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణించారని అన్నారు. పద్యాన్ని గుత్తాధిపత్యంగా భావించిన వారిని సవాల్ చేస్తూ ఆయన పద్యాలు రాశారని పేర్కొన్నారు. ఆర్థిక సమానత్వం రానిదే హింస పోదని వేంకటకవి నెహ్రూ చరిత్రలో పేర్కొన్నారని, ద్రావిడ ద క్పథం ఆయన రచనల్లో ప్రస్పుటమైందని విశదీకరించారు. కులమతాల్లేని సమాజం కొండవీటి స్వప్నమన్నారు. దళిత ఉద్యమకారుడు, కవి డాక్టర్ కత్తి పద్మారావు మాట్లాడుతూ కులం దాటిన వాడే ప్రపంచ మానవుడవుతాడని, కులాంతర వివాహాలను ప్రోత్సహించి సమసమాజ స్థాపన కోసం కొండవీటి వెంకటకవి పాటుపడ్డారని కొనియాడారు. వ్యవసాయ విప్లవం నుండి సాహితీ విప్లవం తెచ్చి 'కర్షక' అనే ఖండకావ్యాన్ని చిరుప్రాయంలో రాశారని తెలిపారు.
సాయంత్రం జరిగిన రెండో సెషన్‌కు పిడిఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పాపినేని శివశంకర్ 'వేంకటకవి తాత్వికత'పై, తిరుపతి మహిళా విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ దావులూరి క ష్ణకుమారి, పొన్నూరు సంస్క త కళాశాల విశ్రాంత ప్రొఫెసర్ వి.వి.సీతారామాచార్యులు 'వేంకటకవి అధ్యాపనం'పై ప్రసంగించారు. సాహితీవేత్త కొత్తపల్లి రవిబాబు, కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి సాహితీ సమితికి చెందిన ప్రొఫెసర్ రావెల సాంబశివరావు 'వేంకట కవి హేతువాదం'పై, సాహితీ విశ్లేషకులు ముత్తేవి రవీంద్రనాథ్ 'వేంకటకవి సినీ రచనలు'పై మాట్లాడారు. తొలుత వేంకటకవి చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం 'వేంకట కవి కావ్య చరిత్ర' పుస్తకాన్ని జస్టిస్ టి.రజని ఆవిష్కరించారు. 'నెహ్రూ జీవిత చరిత్ర' పుస్తకాన్ని ప్రముఖ కవి, దళిత నాయకులు డాక్టర్ కత్తి పద్మారావు ఆవిష్కరించారు. కొండవీటి డాట్ ఇన్ వెబ్‌సైట్‌ను సాహితీవేత్త రావి రంగారావు ఆవిష్కరించారు. వేంకటకవి జీవిత విశేషాలను, సాహిత్య నేపథ్యాన్ని హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చిన్నయసూరి విశదీకరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ప్రొఫెసర్ రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి వేంకటకవి సాహితీ పరిచయం చేశారు. కార్యక్రమంలో సాహితీ వేత్తలు కొండవీటి రామారావు, డాక్టర్ తూమాటి సంజీవరావుతో ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులురెడ్డి, కవులు, కళాకారులు, వేంకటకవి శిష్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.