కర్నూల్లో 'కర్రోడు పట్టిన త్రిశూలం' ఆవిష్కరణ

సాహితీస్రవంతి కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  కేంద్రసాహిత్య ఆకాడమీ అవార్డు గ్రహీత కుం.వీరభద్రప్ప రాసిన 'కర్రోడు త్రిశూలం పట్టిన కథ' పుస్తకావిష్కరణ సభ  పింగళిసూరన తెలుగు తోటలో మార్చి 31న జరిగింది. గాడిచర్ల ఫౌండేషన్‌ అధ్యక్షులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మెన్‌ చంద్రశేఖర కల్కూర పుస్తకాన్ని ఆవిష్కరించారు. సాహితీస్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి కెంగార మోహన్‌ ఆధ్యక్షతన జరిగిన ఈ సభలో కుం.వీరభద్రప్ప మాట్లాడుతూ నలబైఏళ్ళుగా సాహిత్యలోకంలో ఉన్నానని సీమలోని కన్నీటి చుక్కలే కథలకు, నవలలకు వస్తువులయ్యాయన్నారు. దాదాపు 24 ఏళ్ళు కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయులుగా సేవలందించాలన్నారు. రాయలసీమ ప్రాంతమే నాతో కథలు రాయించిందన్నారు. రాయలసీమలో వాస్తవజీవితాలు కథలుగా రాశానన్నారు.  రాయలసీమలో వాస్తవజీవితాలు కథలుగా రాశానన్నారు. అన్నీ సజీవపాత్రలతో పురుడుబోసుకున్నవేనన్నారు. సామాజిక జీవితాల్లో మార్పు వచ్చినరోజు కవి జీవితానికి సార్థకత లభిస్తుందన్నారు. ఒకే తరహా జీవితాలను రాయడం కూడా సరికాదని సమాజంలో సంభవించిన మార్పును రాయాలన్నారు. దు:ఖాన్నే కాదు ఆనందాన్ని కూడా రాయాలన్నారు. సీమ అస్తిత్వం జీవవాయువుగా కన్నడ సాహిత్యంలో కొనసాగుతున్న తన సాహిత్యజీవితమంతా కర్నూలులోనే సాగిందన్నారు. పుస్తకావిష్కరణ చేసిన కల్కూర మాట్లాడుతూ సాహిత్యం మనుషుల్ని కలిపే వాహకమన్నారు. కుం.వీరభద్రప్ప తెలుగు-కన్నడ భాషలకు వారధిగా కృషి చేస్తున్నారన్నారు. కథల్ని సమీక్షించిన పాణి మాట్లాడుతూ కు.వీ రాసిన ఈ 12 కథల అనువాదం చేసిన రంగనాథ రామచంద్రరావు మంచి అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందించారన్నారు.  కుం.వీరభద్రప్ప కేంద్రం తనకిచ్చిన అవార్డును ప్రభుత్వ తీరుకు, అకాడమీ తీరుకు నిరసనగా వాపస్‌ ఇచ్చి సరికొత్త అధ్యాయానికి నాంది పలికాడన్నారు. ఈ కథల్ని అనువదించిన రంగనాథ రామచంద్రరావు మాట్లాడుతూ కు.వీ రాసిన కథల్ని దాదాపు అనువదిస్తున్నానని అన్నారు. కుం.వీ రాసిన అరమనె తెలుగు అనువాదం త్వరలో వస్తుందన్నారు. అరమనె రాయలసీమ జనజీవన ముఖచిత్రమన్నారు. సభలో రచయిత ఇనాయతుల్లా సాహితీ స్రవంతి రాష్ట్రకార్యదర్శి జంధ్యాల రఘుబాబు ప్రసంగించారు. సభను గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి ప్రారంభించగా రచయితల పరిచయం ఆచార్య దండెబోయిన పార్వతి, పెరికల రంగస్వామి చేశారు.