రాజమహేంద్రవరంలోని ఆనం కళాకేంద్రంలో మే 27న జరిగిన కందుకూరి శతవర్ధంతి సభలో ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజాశక్తి ఎడిటర్ ఎంవిఎస్ శర్మ ప్రధాన ప్రసంగం చేశారు. దారి లేనప్పుడు కొత్తదారిని చూపిన గొప్ప వ్యక్తి కందుకూరి అని, అందుకే ఆయనను వైతాళికుడిగా కొనియాడుతున్నామన్నారు. ఎన్నికలు, అప్పులు, రాజకీయ పార్టీలు లేని సమయంలో కందుకూరి మహిళా హక్కుల కోసం, స్త్రీ విద్య కోసం, వితంతు పునర్వివాహం కోసం అనేక పోరాటాలు చేశారని కొనియాడారు. అశాస్త్రీయ భావాలు ప్రస్తుతం రాజ్యమేలుతున్నాయని, ఆవుమూత్రం తాగితే కేన్సర్ పోతుందని చెప్పిన వ్యక్తి ఎంపి అయ్యారని, ఉపగ్రహాలను నింగికి పంపిస్తున్న శాస్త్రవేత్తలు తిరుపతి వెళ్లి పూజలు చేయడం అలవాటుగా మారిందన్నారు. బ్రిటీష్ కాలంలో మూఢాచారాలపై కందుకూరి యుద్ధం చేస్తున్నప్పుడు బ్రిటీష్ ప్రభుత్వం ఆయనకు పోలీస్ రక్షణ కల్పించిందన్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఛాందసవాదం, మూఢనమ్మకాలపై ప్రచారం చేస్తే ఈ ప్రభుత్వాలు మనకు ఎలాంటి రక్షణ కల్పించవని, పైగా అరెస్ట్‌లు చేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. కందుకూరి స్ఫూర్తి ఇప్పుడు అవసరమన్నారు. తెలుగు భాష వ్యవహారిక భాష పట్ల చిన్నచూపు తగదన్నారు. సభను ప్రారంభించిన శాసనమండలి సభ్యులు ఐ.వెంకటేశ్వరరావు (ఐ.వి) మాట్లాడుతూ సంఘ సంస్కరణల ఉద్యమాలు నడిపిన వీరేశలింగం వారసుడిగా నేటితరం తయారవ్వాలన్నారు. కందుకూరి తన కాలం కంటే ముందున్నారని, మన కాలం కంటే కూడా ముందున్నారని చెప్పారు. కందుకూరి రాజమహేంద్రవరం కేంద్రంగా చేసుకుని అనేక ఉద్యమాలు నడిపారన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన ఎంఎల్‌సి రాము సూర్యారావు మాట్లాడుతూ ఆశయాలు ఆదర్శంగా ఉండాలన్నారు. కందుకూరి పుట్టిన గడ్డలో ఆయన ఆశయాలను అందరూ ఆచరణలో చూపాలని కోరారు. తాను ముహూర్తం చూసుకుని నామినేషన్ వేయలేదని, ముహూర్తం చూసుకుని నామినేషన్ వేసినవారు ఓడిపోయారని చెప్పారు. రాజమహేంద్రవరం సిటీ ఎంఎల్‌ఎ ఆదిరెడ్డి భవాని మాట్లాడుతూ కందుకూరి పుట్టిన గడ్డపై పుట్టినవారంతా కందుకూరి ఆశయాల సాధనకు కృషి చేయాలన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారంటే దానికి కందుకూరి వేసిన బాటే కారణమన్నారు. అంతకు ముందు కందుకూరి చిత్రపటానికి ఎంఎల్‌సిలు ఐ.వెంకటేశ్వరరావు, రాము సూర్యారావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సభకు అధ్యక్షత వహించిన యుటిఎఫ్ నాయకురాలు అరుణకుమారి మాట్లాడుతూ కందుకూరి రాజమహేంద్రవరంలో జన్మించడం దేశానికే గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి మిడియం బాబూరావు, ప్రజా సాంస్కృతిక వేదిక రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు టి.అరుణ్, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.తులసి, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షులు బాషా, ప్రధాన కార్యదర్శి అనిల్, రాష్ట్ర నాయకులు సురేష్ నిఖిలం, ఎల్‌ఐసి నాయకుడు పి.సతీష్, జెవివి జిల్లా అధ్యక్షుడు చైతన్య శేఖర్, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు బి.పవన్, డివైఎఫ్‌ఐ నాయకులు బి.రాజులోవ, ప్రజాశక్తి మేనేజర్ టిఎస్ ప్రకాష్, కెవిపిఎస్ నాయకులు రూపస్‌రావు, మెడికల్ రిప్ నాయకులు ఎన్.సత్తిరాజు, మురళీకృష్ణ, ఎన్‌వి రావు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గన్నారు. ఈ సందర్భంగా ప్రజాశక్తి ముద్రించిన ఆరు పుస్తకాలను ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు.
రాజమహేంద్రవరంలో మే 27న జరిగిన కందుకూరి శతవర్ధంతి సమాలోచనలో కందుకూరి మాస్కలతో కళారూపం ప్రదర్శన