స్ఫూర్తి నింపిన కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి సమాలోచన సభ

- వొరప్రసాద్‌ - 9490099059

 

విజయవాడలో మే 26 ఆదివారం రోజు సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో జరిగిన 'కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి సమాలోచన' సభ సభికుల్లో ఉత్తేజం నింపింది. కందుకూరి వీరేశలింగం జీవితం, సంఘసంస్కరణ ఉద్యమ, సాహిత్య కృషిపై అవగాహనను పరిపుష్టం చేసింది. కందుకూరి తన జీవితకాలంలో చేసిన కృషిని భిన్న కోణాల్లో వక్తలు విశ్లేషించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన సెమినార్లు, రూపకం, హాజరయిన వారిలో సామాజిక స్ఫూర్తిని రగిలించాయి. 

తెలుగునాట అధ్యయనపరులుగా, మేధావులుగా, సామాజిక కార్యకర్తలుగా కృషిచేస్తున్న వారు ఈ సదస్సులో వక్తలుగా పాల్గొని ప్రసంగించారు. సంఘ సంస్కరణ

ఉద్యమంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న గోరా కుటుంబానికి చెందిన డా|| విజయం, డా|| సమరం, అలాగే విద్యారంగంలో ముఖ్యంగా చరిత్ర అధ్యాపకులుగా, శాసనమండలి సభ్యులుగా ఉన్న కె.ఎస్‌. లక్ష్మణరావు, సామాజిక, రాజకీయ విశ్లేషకులుగా ఉన్న తెలకపల్లి రవి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు డా|| రాచపాళెం చంద్రశేఖర రెడ్డి,

డా|| పాపినేని శివశంకర్‌, సీనియర్‌ సాహిత్య వేత్తలు కడియాల రామమోహన్‌రాయ్‌, కొత్తపల్లి రవిబాబు, పెనుగొండ లక్ష్మీనారాయణ, బహుజన సాహిత్య వేత్త గుంటూరు లక్ష్మీనరసయ్య, దళిత కవి, విమర్శకులు శిఖామణి, సాహిత్య విమర్శకులు మేడిపల్లి రవికుమార్‌, చూపు కాత్యాయని, డా|| కె. ఆశాజ్యోతి, ప్రజాశక్తి దినపత్రిక సంపాదకులు ఎం.వి.ఎస్‌. శర్మ, ఐద్వా నాయకురాలు పుణ్యవతి, మనసు ఫౌండేషన్‌ రాయుడు, మంజులూరి కృష్ణకుమారి, డా|| హేమాపరిమి, తూమాటి సంజీవరావు వంటి ఉద్ధండులు విలువైన ప్రసంగాలు చేశారు. వీరి ప్రసంగాలన్నీ ఈక్షణం యూట్యూబ్‌ ఛానల్లో నిర్వాహకులు అందుబాటులో ఉంచారు.  వినదగ్గ

ఉపన్యాసాలు వీరందరివీ. వాటి సారాంశాన్నీ, సభ అందించిన స్ఫూర్తిని చెప్పటానికి చేసే చిన్న ప్రయత్నమిది.

అభివృద్ధి చెందిన మీడియా ప్రజలను తప్పుదారి పట్టించే భావాలను, మౌఢ్యాన్ని, మరింతగా ప్రచారం చేస్తున్నది. సమకాలీన సమాజంలో సరికొత్త రూపాల్లో పెచ్చరిల్లుతున్న మూఢనమ్మకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు నష్టం కలిగించే మూఢనమ్మకాలు, దురాచారాలపై 100 ఏళ్ళ కింద పోరాడిన కందుకూరి వీరేశలింగం కృషిని తిరిగి గుర్తుచేసుకోవడం ఒక మంచి ప్రయత్నం. కందుకూరి తన కాలంలో ఆనాటి మూఢనమ్మకాలపై, ఛాందస భావాలపై తిరగబడ్డ తీరును గుర్తుచేసి ఈనాటి మనం చేయాల్సిన కర్తవ్యాన్ని ఈ సభ గుర్తుచేసింది. ఈనాటికీ బ్రాహ్మణ భావజాలం సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో లోతుగా వక్తలు విశ్లేషించారు. కందుకూరి వీరేశలింగం కృషిని బ్రాహ్మణ కులానికో, లేదా కొన్ని అగ్రవర్ణాలకే పరిమితం చేసిన వాదనలను ఈ సభ పూర్వపక్షం చేసింది. బ్రాహ్మణ మతతత్వం దేశంలోని అన్ని కులాలకూ వ్యాపించి ఈనాటి ఆధునిక కాలంలోనూ ఎట్లా తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నదో వక్తలు వివరించారు. వివక్షతలతో, అంటరానితనం వంటి దుర్మార్గాలతో అల్లాడిపోయిన దళితులు, స్త్రీలూ ఇంకా ఆ బ్రాహ్మణ మత భావజాలంతో కొనసాగడాన్ని గుర్తించాలన్నారు. దేశంలోని అన్ని కులాల్లోకీ వివాహం, కర్మకాండ వంటి క్రతువుల ద్వారా బ్రాహ్మణ మతతత్వం ఎట్లా వ్యాపించిపోయి తన ప్రభావాన్ని చూపిస్తున్నదో ఈ సభలో ఉపన్యాసకులు విశ్లేషించారు.

కందుకూరి వీరేశలింగం కాలంనాటికి ఆయన తనున్న సమాజంలోని మౌఢ్యాన్ని ఎదుర్కొన్న తీరును వక్తలు అభినందించారు. ఆయనను అసాధారణమైన ప్రతిభాశాలిగా వక్తలు కొనియాడారు. తన సంస్కరణోద్యమ కృషికి సాహిత్యాన్ని ఆధారం చేసుకున్న తీరును అభినందించారు. ఆనాటి వ్యవస్థలో వేళ్ళూనికుని పోయిన మూఢనమ్మకాలను, దురాచారాలను ప్రహాసనాల వంటి హాస్యప్రక్రియ ద్వారా చీల్చి చెండాడిన తీరును వక్తలు గుర్తుచేశారు. రాజశేఖర చరిత్ర వంటి నవల ద్వారా ఆనాటి సామాజిక వ్యవస్థను కందుకూరి రికార్డు చేశారన్నారు. పలు సాహిత్య ప్రక్రియలలో ఆద్యుడుగా పేరు గడించిన కందుకూరి తన స్వీయ జీవిత చరిత్రను తెలుగు ప్రజల కందించి చిరస్మరణీయుడిగా మిగిలిపోయాడన్నారు. ఈనాటికీ సమాజంలో సింహభాగం కందుకూరి భావాలను అందుకోలేక వెనకబడిపోయిందన్నారు.

కందుకూరి వీరేశలింగం తన జీవితకాలంలో చేసిన కృషిని ఈనాటి తరానికి గుర్తుచేయాల్సిన అవసరం ఉందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఆ రోజు కందుకూరి చేసిన కృషి తన వ్యక్తిగత సౌఖ్యాల కోసం, కీర్తి కోసం కాదని, వ్యవస్థ బాగుకోసం ఆయన శ్రమించారన్నారు. రచన, ఆచరణ రెండింటి మేలుకలయికగా వీరేశలింగం ఈనాడు రచయితలందరికీ ఆదర్శనీయం అన్నారు. అభివృద్ధి పేరుతో ఎంతగా ప్రచారం సాగుతున్నా, వ్యవస్థలో మానవీయ విలువలకు స్థానం లేకుండా పోయిందని, అందుకు కారణం కందుకూరి వంటివారు సాగించిన సాంఘిక సంస్కరణ కృషి కొనసాగకపోవడమే నని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ రోజుకీ కొనసాగుతున్న మూఢనమ్మకాలు, మహిళా వివక్షత, దళితుల పట్ల దౌర్జన్యాలు వంటివి నేటి అభివృద్ధిని అపహాస్యం చేస్తున్నాయని అన్నారు.

సుమారు 750 మంది హాజరయిన సభ ఆద్యంతం ఆలోచనాత్మకంగా సాగింది. వర్తమాన సమాజంలో అందరం కలిసి కందుకూరి వీరేశలింగం వంటి వారి కృషి నుండి స్ఫూర్తి పొంది కర్తవ్యబద్ధులం కావాలని విజ్ఞప్తి చేశారు. కందుకూరి వీరేశలింగం మరణించి 100 ఏళ్ళయిన సందర్భంగా ఆయన స్మరించుకోవడమంటే వర్తమానంలో కూడా ఆయన భావాలు మనకు ఉత్తేజం కలిగించడమే కారణమని అన్నారు. మారువేషాల్లో సాగుతున్న మౌఢ్యాన్ని, వెనుకబాటు తనాన్ని కందుకూరి భావాలతో ఈ రోజు ఎదుర్కోవలసిన అవసరం ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి రావటం, ఆయనను స్మరించుకోవటం అనివార్యమని అన్నారు. ఆయన భావాలను ఈనాటికీ అందుకోని సామాజిక వ్యవస్థ పట్ల సందేహాలు రావడం సరైందేనని వక్తలు అభిప్రాయ పడ్డారు.

కందుకూరి వీరేశలింగం కృషిని, ఆయనలోని కొన్ని లోపాలను పేర్కొంటూ కొందరు ఆయనను విమర్శించడం పట్ల కూడా సభలో చర్చ జరిగింది. కందుకూరి వీరేశలింగం పరిమితుల్ని, ఆయన కాలంనాటి సామాజిక పరిస్థితుల్ని అన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కందుకూరి వీరేశలింగాన్ని అంచనా వేయాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈనాటికి అభివృద్ధి చెందిన భావాలతో ఆనాటి కందుకూరిని చూసి ఆయన భావాలు పనికిరానివని, ఆయన అందరివాడు కాదని కందుకూరిని విమర్శించడం చారిత్రక దృష్టి, స్థలకాలాల దృష్టి లేకపోవడమేనని వక్తలు అభిప్రాయపడ్డారు. కందుకూరి వీరేశలింగం భావాల్లోకాని, ఆయన చేసిన సంఘసంస్కరణ ఉద్యమ కృషిలో కానీ ఈనాటి సమాజానికి పనికివచ్చే అంశాలను తీసుకుని, ఆయన స్ఫూర్తితో పనిచేయడం ఈనాటి అందరి కర్తవ్యమని అన్నారు. సామాజిక నిబద్ధత కలిగిన వారు కందుకూరిని వీరాధనతో చూడరని, వర్తమాన సమాజానికి జాగృతం చేయడానికి కందుకూరి నుండి స్ఫూర్తి పొందడమే వారి లక్ష్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల కందుకూరి, గురజాడ, శ్రీశ్రీ వంటి వారిపై అంతర్జాలంలోనూ, పత్రికల్లోనూ జరుగుతున్న చర్చల్లోని అంశాలు ఈ సభలోనూ ప్రస్తావనకు వచ్చాయి. వివిధ కోణాల్లో సాగిన ఈ చర్చ ఒక శాస్త్రీయమైన అవగాహనను సభికులకు అందించింది. ముఖ్యంగా దళిత, బహుజన దృక్కోణంలోంచి వచ్చిన పలు ప్రశ్నలకు ఈ సదస్సు సంతృప్తికరమైన జవాబులిచ్చింది. ప్రగతిశీలవాదులూ, మార్క్సిస్టులూ, దళిత బహుజనులూ పరస్పరం ఒక మిత్రస్ఫూర్తితో ముందుకు సాగాల్సిన అవసరాన్ని సభ నొక్కి చెప్పింది.

నిజానికి నేడు ఒక పక్క ప్రపంచీకరణ విధానాలు, మరోపక్క ఫాసిస్టు ధోరణులూ పేట్రేగిపోతూ దళితులనూ, మైనారిటీలనూ, పేదలనూ అష్టకష్టాలకు గురిచేస్తున్న సందర్భంలో భావసారూప్యం కలవాళ్ళు కలిసిపనిచేసే వాతావరణం కోసం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. ప్రగతిశీలవాదులూ, కమ్యూనిస్టులూ, అభ్యుదయవాదులూ ఒక శిబిరంగానూ, దళిత బహుజన వాదులూ మరో శిబిరంగానూ వేరుపడే ధోరణులను ప్రోత్సహించేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. అటువంటి ధోరణులు అంతిమంగా నష్టానికే దారితీస్తాయి. ఈ సదస్సులో జరిగిన ఇటువంటి చర్చలు ఒక లోతైన, వాస్తవికమైన అవగాహన అందించే ప్రయత్నం చేశాయి.

విజయవాడ నగరంలోని సాహిత్య, సామాజిక, కళా, సాంస్క ృతిక రంగాలకు చెందిన 108 సంస్థల భాగస్వామ్యంతో ఏర్పడిన 'కందుకూరి వీరేశలింగం శతవర్ధంతి సమాలోచన' నిర్వాహణ కమిటీ ఆధ్వర్యంలో ఈ సభ జరిగింది. శతవర్ధంతి అవడంతో 100 సంస్థల కలిసి చేయాలన్న నిర్వాహకుల సంకల్పం అందరి ప్రశంసలందుకుంది. ప్రముఖ రచయిత దేవేంద్ర రాసిన 'సంస్కరణోద్యమ ఖడ్గధారి - కందుకూరి వీరేశలింగం' రూపకం ద్వారా ప్రజానాట్యమండలి కళాకారులు కందుకూరి జీవితం, సంఘసంస్కరణోద్యమ కృషి, సాహిత్య పరిశ్రమ కళ్ళకు కట్టినట్టుగా ప్రదర్శించారు.

కందుకూరిపై ప్రత్యేకంగా వెలువరించిన పుస్తకాలు ఈ సభలో ఆవిష్కరించారు. 1970 ప్రాంతాల్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆవుల సాంబశివరావు, నార్ల వెంకటేశ్వర రావు వంటి వారు సంకలనం చేసిన కందుకూరి వీరేశలింగం స్మారకసంచిక యుగపురుషుడు పుస్తకాన్ని తెలకపల్లి రవి సంపాదకత్వంలో ప్రజాశక్తి బుక్‌హౌస్‌ పునర్ముద్రించింది. ఈ సంకలనం చాలా విలువైనది. నార్ల వెంకటేశ్వరరావు, నాళం సుశీలమ్మ, తాపీ ధర్మారావు వంటి వారి వ్యాసాలు కందుకూరిపై మన అవగాహనను పరిపుష్టం చేస్తాయి. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి సంపాదకత్వంలో కొత్త వ్యాసాలను ఆహ్వానించి మరో పుస్తకం ప్రజాశక్తి ప్రచురించింది.  1970లలో నేషనల్‌ బుక్‌ట్రస్ట్‌ వారు కొడవటిగంటి కుటుంబరావు గారి చేత కందుకూరి ఆత్మకథను సంక్షిప్తం చేయించి ఆయన ముందుమాటతో ప్రచురించారు. ఆ పుస్తకాన్ని ప్రజాశక్తి బుక్‌హౌస్‌ వారు ప్రచురించి ఈ సభలో ఆవిష్కరించారు. అలాగే కందుకూరి ప్రసిద్ధ రచన రాజశేఖర చరిత్ర కూడా ప్రజాశక్తి బుక్‌హౌస్‌ ప్రచురించి ఈ సభలో ఆవిష్కరించింది. ఐద్వా ప్రచురించిన కందుకూరిపై వ్యాస సంకలనం, తూమాటి సంజీవరావు పుస్తకం, కవిసంధ్య, వీరేశలింగంపై వెలువరించిన ప్రత్యేక సంచిక ఈ సభలో ఆవిష్కరించడం జరిగింది.

సభ అనేక అంశాల సమాహారంగా కొనసాగి ఫలవంతంగా జరిగింది. ప్రముఖ సినీ దర్శకులు అంకురం ఉమామహేశ్వరరావు ఈ నిర్వాహణ కమిటీకి సారథ్యం వహించడంతో పాటు, సభా సమన్వయం కూడా చేసి సభను జయప్రదం చేశారు.

కందుకూరి జీవితాన్ని తిరిగి ఆయన శతవర్ధంతి సంవత్సరంలో తెలుగు ప్రజలు గుర్తుచేసుకోవటం, స్ఫూర్తిపొందటం ఒక గొప్ప నివాళిగా మిగిలిపోతుంది. గత సంవత్సరం శతవర్ధంతి ప్రారంభ కార్యక్రమం రాజమహేంద్రవరంలో జరిగింది. ఆనాటి నుండి రాష్ట్రవ్యాప్తంగా వివిధ సంస్థలు శతవర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాయి. ముగింపుగా విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, అనంతపురం, కాకినాడ వంటి పలుప్రాంతాల్లో వందల సంస్థలు భాగస్వామ్యంతో సదస్సులు నిర్వహించాయి. ముఖ్యంగా సాహిత్య, సాంస్క ృతిక రంగాలు వ్యక్తుల కీర్తిప్రతిష్టల చుట్టూ, సంకుచిత పరిధుల మధ్య సంచరిస్తున్న సమయంలో సామాజిక స్ఫూర్తిని చాటే ఇటువంటి సభలు కొంత ఊరట నిస్తాయనడంలో సందేహం లేదు. సమాజాన్ని, సమిష్టి తత్వాన్ని కేంద్రంగా చేసుకునే సామాజిక, సాహిత్య, సాంస్క ృతిక ఉద్యమాలు నేటి అవసరం. కందుకూరి శతవర్ధంతి సమాలోచన సభ ఆ దిశగా ఒక అడుగు వేసేందుకు దోహదం చేస్తుందని ఆశిద్ధాం.

చివరగా అయినా కీలకమైన అంశం- ఇంత భారీ కార్యక్రమాన్ని ఫలవంతం చేయడంలో తెరవెనక ఉండి కృషిచేసిన వారిని ప్రస్తావించాలి. నిర్వాహణ కమిటీలోని 108 సంస్థల బాధ్యులతో పాటు ఎం.బి. విజ్ఞానకేంద్రం కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ, ఐద్వా కార్యదర్శి బి. రమాదేవి, ప్రజాశక్తి బుక్‌హౌస్‌ లక్ష్మయ్య, కెవిపిఎస్‌ ఆండ్ర మాల్యాద్రి, ఎం.బి.విజ్ఞానకేంద్రం రామరాజు, జాషువా సాంస్క ృతిక వేదిక నారాయణ, గోళ్ళ నారాయణరావు, ఈమని శివనాగిరెడ్డి, గుమ్మా సాంబశివరావు, నాస్తికకేంద్రం హరిసుబ్రహ్మణ్యం వంటివారు, మరికొందరు నేరుగా ఈ కార్యక్రమానికి భుజం కాశారు. వారికి ప్రత్యేక అభినందనలు.