విశాఖలో శ్రామిక జనకవనం

కవులు, రచయితలు ఉద్యమాలతో మమేకమవ్వాలని ప్రముఖ కవి, సాహితీవేత్త, రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి కోరారు. ప్రజల బాధలు పట్టని రచనలతో సమాజానికి ఉపయోగం ఉండదన్నారు. ఐదేళ్లలో భారతదేశంలో అసహనం పెరిగిపోయిందని, దాన్ని సహించే కవిత్వానికి అర్థం లేదన్నారు. విశాఖలోని శివాజీ పార్కు దరి వైజాగ్‌ ఫెస్ట్‌, సాహితీ స్రవంతి ఆధ్వర్యాన శ్రీశ్రీ 109వ జయంతి ఉత్సవాలు, మే డేను పురస్కరించుకుని ఏప్రిల్‌28న నిర్వహించిన శ్రామిక జనకవనంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.  కవిత్వాన్ని రాచరికపు కోటల నుంచి రచ్చబండల వద్దకు తీసుకొచ్చినట్లు నేటి సమస్యలపై ఈ తరం కవులు ప్రశ్నలు సంధించాలన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ సభ్యులు, రాష్ట్ర అకాడమీ వైస్‌ఛైర్మన్‌ అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ కష్టజీవుల తరపున నిలబడని కవిత్యం అనవసరమని అభిప్రాయపడ్డారు. సామాజిక దష్టి కోణం కవికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణమన్నారు. ప్రముఖ కవి రామతీర్థ మాట్లాడుతూ శ్రీశ్రీ రచనా శైలిని ఈనాటి సమస్యలకు అద్దం పట్టేలా నేటి కవుల రచనలు చేయాలని కోరారు. వైజాగ్‌ ఫెస్ట్‌ కార్యదర్శి అజశర్మ మాట్లాడుతూ కవులు సామాజిక లక్ష్యంతో ముందుకు కదలాల్సిన అవసరముందని, దాన్ని మరింత పెంచేందుకు ఈ శ్రామిక జనకవనం మరింత దోహదపడుతుందని పేర్కొన్నారు. సాహితీ స్రవంతి విశాఖ జిల్లా అధ్యక్షులు ఎవి.రమణారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గంటేడ గౌరినాయుడు, రామసూరి, డిఆర్‌కె నాయుడు, సుదీప్‌ కవితలు చదివి వినిపించారు. రాష్ట్ర సాహితీ అకాడమీ సభ్యులు జగద్ధాత్రి, సిఐటియు విశాఖ నగర ప్రధాన కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్‌ పాల్గొన్నారు.