సాహిత్య ప్రస్థానంలోని విశేష రచనకు ప్రతీ సంవత్సరం డాక్టర్‌ ఎద్దుల సిద్ధారెడ్డి స్మారక పురస్కారం

అనంతపురం జిల్లా, కదిరికి చెందిన ఎద్దుల మహాలక్ష్మి తన భర్త పేరుతో ప్రతీ సంవత్సరం సాహిత్య ప్రస్థానం మాసపత్రిక సహకారంతో డాక్టర్‌ ఎద్దుల సిద్ధారెడ్డి స్మారక పురస్కారం అందించనున్నారు. అందుకోసం సాహిత్య ప్రస్థానం మాసపత్రికకు ఒక లక్షాయాభైవేల రూపాయలను అందజేసారు. ఆ మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి వడ్డీగా వచ్చిన మొత్తంతో ప్రతీ సంవత్సరం జనవరిలో ఈ పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. సాహిత్య ప్రస్థానంలో జనవరి నుండి డిసెంబర్‌ వరకూ ప్రచురించిన కథ, కవిత, వ్యాస ప్రక్రియలలో ఉత్తమమైన ఒకటి లేదా రెండు రచనలకు నగదు పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. ఎద్దుల మహాలక్ష్మి  తన భర్త డా|| ఎద్దుల సిద్ధారెడ్డి ప్రగతిశీల భావాలను, సాహిత్య అభిమానాన్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతపురం జిల్లా కదిరిలో సాహితీస్రవంతి రాష్ట్ర కమిటీ సభ్యులు పి. కుమారస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న సాహిత్య కార్యక్రమాలకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. తెలుగు భాషా సాహిత్య కృషికి ఎద్దుల మహాలక్ష్మి అందిస్తున్న తోడ్పాటుకు సాహిత్య ప్రస్థానం అభినందనలు తెలియజేస్తున్నది.