సామాజిక తత్వవేత్త పోతులూరి వీరబ్రహ్మం రాష్ట్రస్థాయి సాహిత్య, సాంస్క ృతిక సమ్మేళనం అక్టోబర్ 12న కర్నూలులో నిర్వహించనున్న నేపథ్యంలో జూలై 28న కర్నూలులోని ఎంపిపి సమావేశ హాలులో ఆహ్వాన సంఘం ఏర్పాటయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన కర్నూలు పార్లమెంటు సభ్యులు సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ ఆధునిక సమాజంలోనూ కులం మానవ ప్రగతికి ప్రతిబంధకమవుతుందని, కుల రహిత సమాజాన్ని నిర్మించి అంతరాలు చెరిపేద్దామని, నవీన సమాజ ఆవిర్భావానికి పునాదులు వేద్దామని అన్నారు. పోతులూరి వీరబ్రహ్మం వంటి సంఘసంస్కర్తలను ఆదర్శంగా తీసుకుని సామాజిక మార్పుకు ప్రయత్నిస్తే కనీసం భవిష్యత్తు తరాలకైనా మంచి జరుగుతుందని అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం కృషి చేసిన వేమన, పోతులూరి వీరబ్రహ్మం వంటి వారి భావాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు. పోతులూరి సామాజిక కోణం మానవ వికాసానికి మార్గం చూపిస్తుందని పేర్కొన్నారు. సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షులు వొరప్రసాద్ మాట్లాడుతూ పోతులూరి వీరబ్రహ్మం ఆనాడే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రచారం చేశారని, నేటి సమాజం ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. ప్రజాశక్తి బుక్‌హౌస్ ఈ సందర్భంగా పోతులూరి వీరబ్రహ్మం జీవితం, బోధనలపై పలు పుస్తకాలను ప్రచురిస్తుందని తెలిపారు. సాహితీస్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు అధ్యక్షత వహించిన ఈ సభలో ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షులుగా ఎన్నికయిన విద్యా సంస్థల అధిపతి పుల్లయ్య, లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, కె.వి. సుబ్బారెడ్డి, సాహితీ స్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి కెంగార మోహన్, శేషయ్య, బసవరాజు, జిల్లాలోని వివిధ సాహిత్య, సాంస్క ృతిక సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.