శాంతినారాయణ పుస్తకావిష్కరణ సభ - నవ్యాంధ్ర రచయితల సంఘం తొలి వార్షికోత్సవ సభ

అనంతపురంలోని వాల్మీకి భవనంలో సెప్టెంబర్‌ 15న ప్రముఖ రచయిత డా|| శాంతినారాయణ రచించిన 'నాలుగు అస్తిత్వాలు - నాలుగు నవలికలు', 'నాగలకట్ట సుద్దులు' రెండవ భాగం పుస్తకాల ఆవిష్కరణ సభ జరిగింది. వాల్మీకి భవన వ్యవస్థాపక అధ్యక్షులు వి.పి. ఆదినారాయణ వాల్మీకి భవన ప్రాంగణంలో ఒకొక్క రచయితతో ఒక మొక్కను నాటించి దాదాపు 45 మంది రచయితల పేర్లతో పాటు, మొక్కలను గురించి వాళ్లు పంపిన క్యాప్షన్స్‌తో తయారు చేయించిన ట్రీగార్డులను పాతించిన తర్వాత అతిథులను సభకు ఆహ్వానించారు. 'జలస్వప్న' కవి మల్లెల స్వాగత వచనాలూ తిప్పేస్వామి 'దేశమును ప్రేమించుమన్నా' ప్రారంభ గీతమూ ముగిసిన తర్వాత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి అధ్యక్షతన సభ ప్రారంభమయ్యింది. ముఖ్య అతిథులు తలారి రంగయ్య, డా|| దీర్ఘాసి విజయభాస్కర్‌ లు పుస్తకాలను ఆవిష్కరించారు. ముఖ్య అతిథి తలారి రంగయ్య మాట్లాడుతూ మంచి పుస్తకాలు సమాజాన్ని చైతన్యపరుస్తాయని, శాంతినారాయణ రచనలన్నీ ఆ కోవకు చెందినవని, అనంతపురం నుంచి గొప్ప సాహిత్యం వస్తుండడం గర్వించదగిన విషయమని అన్నారు. సాహిత్యం ద్వారానే మంచి సమాజం ఏర్పడుతుందని అన్నారు. మరొక ముఖ్యఅతిథి డా|| దీర్ఘాసి విజయభాస్కర్‌ మాట్లాడుతూ, మంచి రచయితల సాహిత్యం సమాజానికి అద్దంలాంటిదని, శాంతినారాయణ రచనలన్నీ అట్టడుగు వర్గాల, రైతుల జీవనగతులన్నింటినీ చిత్రించిన కళాఖండాలని కొనియాడారు. రాచపాళెం చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ శాంతినారాయణ మాండలిక రచనలు రెండు తెలుగు రాష్ట్రాల సాహిత్యలోకంలో వొక ప్రత్యేకతను సంతరించుకున్నాయని అన్నారు. విశిష్ట అతిథిగా పాల్గొన్న వి.పి. ఆదినారాయణ మాట్లాడుతూ శాంతినారాయణ తమ వూరివాడు కావడం తనకే కాదు తమ ప్రాంతానికే గర్వకారణమని, ఆయన నాగలకట్ట సుద్దులు సమాజచైతన్యదీపికలని అన్నారు. ఆచార్య మేడిపల్లి రవికుమార్‌, కె.పి. అశోక్‌కుమార్‌ రెండు పుస్తకాలనూ సమీక్షించారు. నవలికలలోని వస్తుశిల్పాలను, రచయిత తాత్విక దృక్పథాన్ని రవికుమార్‌ ఆవిష్కరించగా, నాగల కట్ట సుద్దులలోని అధిక్షేపాన్ని, ప్రాసంగికతనూ, సంఘటలన పట్ల, సమకాలీన సమస్యల పట్ల, ప్రభుత్వాల పట్ల రచయితకున్న దృక్పథాన్నీ అశోక్‌కుమార్‌ విశ్లేషించారు. ప్రజాపక్షం వహించిన మహాసాహస రచయిత శాంతినారాయణ అని ప్రశంసించారు. ఆత్మీయ అతిథి బండి నారాయణస్వామి, సడ్లపల్లి చిదంబరరెడ్డి, ఉప్పరపాటి వెంకటేశులు రచయితతో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. మధ్యాహ్న భోజనానంతరం, సూతరంగస్థలి, అస్తిత్వ సాహిత్య ప్రాముఖ్యత అనే అంశాలపైన రెండుగంటల పాటు ఆలోచనాత్మకమైన చర్చ జరిగింది. ప్రసిద్ధ సాహిత్య విశ్లేషకుడు తూముచెర్ల రాజారాం అనుసంధాన కర్తగా వ్యవహరించారు. దీర్ఘాసి విజయభాస్కర్‌, సూతరంగస్థలి రూపాన్నీ, ఆవశ్యకతనూ వివరించారు. ఈ చర్చా గోష్టిలో సాహితీస్రవంతి జిల్లా కన్వీనర్‌ కుమారస్వామి, కంబదూరి షేక్‌నబి రసూల్‌, జూటూరు షరీఫ్‌, దాదా ఖలందర్‌, ఆవుల వెంకటేశులు, కోగిర తదితరులు పాల్గొన్నారు.  - డా|| జూటూరి షరీఫ్‌

 

 

 

 

నవ్యాంధ్ర రచయితల సంఘం  తొలి వార్షికోత్సవ సభ

విజయవాడలోని ఠాగూర్‌ స్మారక గ్రంథాలయంలో సెప్టెంబర్‌ 8న నవ్యాంధ్ర రచయితల సంఘం తొలి వార్షికోత్సవ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి కొలకలూరి ఇనాక్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ చీకటి గుహల్లోకి సైతం కవిత్వాన్ని నవ్యాంధ్ర రచయితల సంఘం పంపిస్తున్నదని అభినందించారు. ఆత్మీయ అతిథిగా వచ్చిన రాచపాళెం చంద్రశేఖర రెడ్డి మాట్లాడుతూ కవులు వస్తువును చేయడం నేర్చుకోవాలని అన్నారు. సాహితీస్రవంతి గౌరవ అధ్యక్షులు తెలకపల్లి రవి మాట్లాడుతూ ఆర్థిక సరళీకరణలు కాదు భాషా సరళీకరణలు కావాలన్నారు. భావ ప్రకటనా స్వేచ్ఛ మీద, మీడియా మీద, రచయితల మీద ఆంక్షలు విధించటాన్ని భారత రాజ్యాంగం ఒప్పుకోదన్నారు. పెరుమాళ్‌ మురగన్‌ నాలో రచయిత మరణించాడని పోస్టు పెట్టిన సందర్భంలో రచయిత మరణించడానికి వీల్లేదని శాసించిన న్యాయవ్యవస్థకు జేజేలు అర్పిస్తున్నానని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఆకుల వెంకట శేషసాయి మాట్లాడుతూ సాహిత్యం సమాజాభివృద్ధికి సూచికగా వుండాలన్నారు. సభకు నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు బిక్కి కృష్ణ అధ్యక్షత వహించారు. సభలో నవమల్లెతీగ సాహిత్య మాసపత్రిక సెప్టెంబర్‌ సంచికను, నీలిరాగం కవితా సంపుటిని జస్టిస్‌ ఆకుల వెంకటశేషసాయి ఆవిష్కరించారు. బిక్కి కృష్ణ రాసిన కొత్తకోణం విమర్శా గ్రంథాన్ని ఆచార్య కొలకలూరి ఇనాక్‌ ఆవిష్కరించారు. సభలో లయన్‌ డా. ఎ. విజయకుమార్‌, శ్రీరామకవచం సాగర్‌ మాట్లాడారు. తొలుత నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ వార్షికోత్సవ నివేదికను చదివి వినిపించారు. కోశాధికారి చొప్పా రాఘవేంద్రశేఖర్‌ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. మధ్యాహ్నం సభలో సాహితీ విమర్శకులు విహారి ఆధునిక సాహిత్యం - తెలుగు భాషా పరిరక్షణ అంశంపై ప్రసంగించారు. అనంతరం మహా కవిసమ్మేళనంలో వివిధ ప్రాంతాలకు చెందిన వందమంది కవులు తమ కవితల్ని వినిపించారు.