స్పందన - ఉరేనియం ఫై కవి సమ్మేళనం

యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా జనకవనం..

 

యురేనియం  తవ్వకాలకు  వ్యతిరేకంగా నల్లమలను కాదు.. నల్లధనాన్ని తవ్వు .. పేరుతో  సాహితీ స్రవంతి కర్నూలు జిల్లా కమిటీ నగరంలోని పింగళిసూరన తెలుగుతోటలో సెప్టెంబర్‌ 30 న జనకవనం నిర్వహించింది. ఈ కవిసమ్మేళనానికి సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు జంధ్యాల రఘుబాబు అధ్యక్షత వహించారు. అధ్యక్షోపన్యాసం చేస్తూ యూరేనియం తెలుగురాష్ట్రాల పాలిట పంజా విసిరిందని దీన్ని అడ్డుకోవలసిందేనన్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సందేశమిచ్చిన ప్రముఖకవి జి.వెంకటకృష్ణ మాట్లాడుతూ మానవజాతి నాశనానికి కుట్రజరుగుతుందని దీనివెనుక వేలకోట్ల కార్పోరేట్‌ వ్యాపారం జరుగుతుందన్నారు. యూరేనియం తవ్వి మనదేశానికి ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు కాదని, అణ్వాయుధాలు, అణ్వస్త్రాలు తయారు చేసి ఇతర దేశాలకు అమ్మి ప్రపంచశాంతికి విఘాతం కల్పించడమే అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన రచయిత, నంది అవార్డు గ్రహీత పత్తిఓబులయ్య మాట్లాడుతూ యురేనియం తవ్వకాలు మానవుల పాలిట ఉరేనని అది ఉరేనియం అన్నారు. సభలో యూరేనియం త్వకాలకు వ్యతిరేకంగా పద్యాన్ని ఆలపించారు. సాహితీ స్రవంతి జిల్లా ప్రధానకార్యదర్శి కెంగార మోహన్‌ మాట్లాడుతూ యూరేనియం తవ్వకాల వల్ల జరిగే ప్రమాదాలు నష్టాలు, ప్రాణాంతక వ్యాధులు అన్నింటినీ కవులు అధ్యయనం చేయాలని అన్నారు. కార్పోరేట్‌ వ్యాపారాలకు ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్నాయన్నారు. జనకవనంలో కవులు కల్యాణదుర్గం స్వర్ణలత, గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి,  పెరికల రంగస్వామి, సయ్యద్‌ జహీర్‌ అహ్మద్‌, ఆవుల చక్రపాణి యాదవ్‌, చౌశా, కవిత వెంకటేశ్వర్లు, సక్కిరి భాస్కర్‌, గద్వాల సోమన్న, ఏ.నాగేశ్వరరావు, పులిచేరి మహేష్‌కుమార్‌, డా.దండెబోయిన పార్వతి, కొప్పుల ప్రసాద్‌, యు.సుబ్బన్న, జి.నరేంద్ర,  కురుకుంద రవిప్రకాష్‌లు కవితా నిరసనలు వినిపించారు. సభలో పెరికల రంగస్వామి రాసిన యూరేనియం వ్యతిరేకగీతాన్ని ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు యం.పి బసవరాజు ఆలపించారు.

 

సాహిత్య ప్రస్థానం అక్టోబర్‌ సంచికలో ప్రచురితమైన కాశీవరపు వెంకట సుబ్బయ్య గారి 'మల్లక్క కయ్య' కథ పై నా చిన్న రెవ్యు......

కథలు సహజంగా నిజ జీవితానికి అద్దం పట్టేలా ఉండాలి. పాఠకుల నాడిని పట్టి ఉంచాలి అన్నది నా ఆలోచన. అలాంటి కోవకి చెందిన కదే 'మల్లక్క కయ్య' కాశీవరపు వెంకట సుబ్బయ్య గారి కథ. ప్రారంభం నుండి చివరి వరకూ ఊపిరి పట్టి చదివించిన శైలి. ఎంచుకన్న కథనం కూడా గొప్ప సామాజిక పరమైనది. కథ రాయటంలో ఎక్కడా తొందర పడకుండా, ఒక్కో అంశాన్ని నింపాదిగా సాగించారు రచయిత. సూరన్న పుల్లారెడ్డి జీతగాడు. అతని భార్య మల్లక్క. మల్లక్క గొప్ప ఆత్మాభిమానం ఉన్న మనిషి. పుల్లారెడ్డి అందరి ముందు అవమానంగా మాట్లడిన వైనాన్ని తట్టు కోలేని మల్లక్క అందరూ పనిచేస్తున్న వరి చేనులో దిగకుండా ఒక్కతే పక్కనే ఉన్న ఎకరా దొంపులో దిగి ఏకధాటిగా పనిచేసుకుంటూ సూర్యాస్తమయాన్ని కూడా లెక్కచేయలేదు.ఎందరు చెబుతున్నా వినకుండా తనపని తను తలదించుకొని చేసింది. తనలోని చివరి ఊపిరి వరకూ పనిచేసి గర్వంగా తుదిశ్వాస విడిచి పెట్టింది. పుల్లారెడ్డికి మల్లక్క తత్వం తెలుసు. నోరు జారినందుకు ఎంతో బాధపడి వారించాడు. ఆత్మాభిమానం దెబ్బతిన్నాక ఎవరి మాట వినలేనిస్థితి మల్లక్కది కూడా. అయితే ఇక్కడ పుల్లారెడ్డి తన తప్పు తెలుసుకొని ప్రాదేయ పడటం, మంచి మనసుతో ఆ ఎకరం పొలాన్ని మల్లక్క పేరున సూరన్న కివ్వటం గొప్ప మార్పు. కథలో గొప్ప నీతి అందించారు రచయిత.   తొందరపడి నోరుజారితే ఒక జీవితం, ఒక కుటుంబం నాశనమైపోవటమే కాదు జీవితంలో తీరని శోకాన్ని సొంతం చేసుకున్నాడు పుల్లారెడ్డి. ఎంత చేసినా తిరిగి ఇవ్వలేడు మల్లక్కని. మల్లక్క  పౌరుషంతో తీసుకున్న నిర్ణయం వల్ల తన పిల్లల్ని భర్తని అనాధల్ని చేసే నిర్ణయం బాధాకరం బాధ్యతా రాహిత్యం. అయితే చాలా సార్లు మనసుకు తగిలే గాయం అలాంటి స్థితికి గురిచేస్తోంది. సహజంగా జీవిత సన్నివేశాలు ఇలానే ఉంటాయి. ఎవరినీ తప్పు పట్టలేం. జీవితం అలాంటి సన్నివేశాల సమూహమే...అయినా కాసేపు స్థిమితంగా ఆలోచించాలి ..ఏదిఏమైనా కథ చాలా ఉద్విగ్నతకు, బాధకు గురిచేసింది.

- సర్వమంగళ, కలకత్తా - 918240497942