సాహితీ స్రవంతి నగర కమిటీ అధ్వర్యంలో నగరంలోని పింగళిసూరన తెలుగుతోటలో అక్టోబర్ 20న గుంటూరు శేషేంద్రశర్మ 92వ జయంతి సందర్భంగా 'గుంటూరు శేషేంద్ర శర్మ కవితా వైభవం' అన్న సదస్సు జరిగింది. ఈ సదస్సుకు సాహితీ స్రవంతి జిల్లా గౌరవాధ్యక్షులు గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సభలో సాహితీస్రవంతి జిల్లా ప్రధాన కార్యదర్శి కెంగార మోహన్ మాట్లాడుతూ శేషేంద్ర సమాజం పట్ల బాధ్యతున్న కవి అని, కొడవలి కర్షకుడికి ఆయుధం, సుత్తి కార్మికుడికి ఆయుధం, కత్తి సైనికుడికి అయుధం, నినాదం రాజకీయ నాయకుడికి ఆయుధం అలాగే కవికి కవిత్వమే ఆయుధం..కవే దేశానికి అసలైన ఆయుధం అని శేషేంద్ర కవిని నిర్వచించాడన్నారు. ఆయన రాసిన ఆధునిక భారతమైనా చదివితే కనీసం కవిత్వం ఇలా వుండాలన్న భావన కలుగుతుందన్నారు. కవిత్వ పరిణామక్రమాన్ని, వస్తువును, శిల్పాన్ని, ఇతివృత్తాల్ని, ఎత్తుగడల్ని, భావావేశాల్ని, భావ శబ్ధచిత్రాల్ని, పద చిత్రాల్ని, ప్రతీకల్ని, వెంటాడే వాక్యాల్ని గమనించగలిగి నాడి పట్టుకున్నప్పుడు మాత్రమే కవిత్వం బాగా రాయగలమని, కవిత్వం ఇలాగే వుండాలని అని ఎవ్వరూ చెప్పకపోయినా కవిత్వం మాత్రం హృదయం నుండి హృదయం దాకా ప్రవహించాలన్నారు. సాహితీసవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, నగర కార్యదర్శి పెరికల రంగస్వామిలు సందేశం ఇచ్చారు. సభలో కవులు, కళాకారులతో పాటు నగరకమిటీ నాయకులు యస్ మహేశ్వరయ్య, డి.అయ్యన్న తదితరులు పాల్గొన్నారు.
'విచ్చుకోవాలి' ఆవిష్కరణ సభ
నూతన సాహిత్య ధోరణులను, నూతన ఆవిష్కరణలనూ కవనలోకమంతా ఆహ్వానించవలసిన అవసరం వుందని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి విమర్శకులు డా|| పాపినేని శివశంకర్ అన్నారు. సెప్టెంబర్ 29న గుంటూరు నగరంలోని యస్‌హెచ్‌డి సమావేశ మందిరంలో జరిగిన సభలో నవ్యాంధ్ర రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షులు వై.హెచ్.కె. మోహన్ రావు కవితా సంపుటి 'విచ్చుకోవాలి' ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ ఆవిష్కరణ సభకు ప్రముఖ కవి, చిటిప్రోలు వెంకటరత్నం అధ్యక్షత వహించారు. 'కరువు కురిసిన మేఘం' లో కవిత్వమై మన ముందుకు వచ్చిన మోహన్‌రావు ఇప్పుడు 'విచ్చుకోవాలి' అంటూ కవన రూపమవడం అభినందనీయమని పాపినేని అన్నారు. ప్రపంచ సాహిత్యం, చరిత్ర నిర్మాణం, రాజులను, రాజ్యాలను ఆశ్రయించి అభివృద్ధి చెందిన కాలం నుండి ఈనాడు
విస్మ ృత, ఉపేక్షిత మూలాల నుంచి వచ్చే సాహిత్యాన్ని ఆదరించే కాలానికి వచ్చామని ఆయన అన్నారు. సమాజం ఇవాళ కిరీటాలను మినహా, తలగుడ్డలను దర్శించలేకపోతుందని, రైతులను, వారి బాధలను కవిత్వీకరించాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాల నుండి వస్తున్న కవిత్వాన్ని ఆదరించాలన్నారు. ప్రముఖ కవి అనిల్ డ్యాని 'విచ్చుకోవాలి' పుస్తకాన్ని విశ్లేషిస్తూ పుస్తకం ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదన్నారు. విస్మ ృత చూపుతో రచించిన కవిత్వం అన్నారు. మోహన్‌రావు కవిత్వంలో చరిత్రలో నలిగిన పేజీల మధ్య విస్మ ృత పాత్రలను వెలికి తీయాలనే తపన కనిపిస్తుందని అన్నారు.చరిత్ర అనేక కోణాలను మన ముందుంచుతూ పల్నాటి చరిత్ర నూతన పార్శ్వాన్ని ఉంచిన కవి మోహన్‌రావు అని డ్యానీ అన్నారు. సభలో రంగిశెట్టి ఫౌండేషన్ స్థాపకులు రంగిశెట్టి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రధాన కార్యదర్శి బండికల్లు జమదగ్ని అతిథులకు ఆహ్వానం పలికి సభను సమన్వయం చేశారు. సభలో మన్నం వెంకటగురువు, పింగళి భాగ్యలక్ష్మి, దుబ్బల దాసు, యనమల సుందర్, రోటికోలి పద్మావతి, ఆళ్ళ నాగేశ్వరరావు, సుశంతరావు, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రజానాట్యమండలి బాధ్యులు కాళిదాసు, కట్టమూరి శంకరరావు, జివియన్ మునేశ్వరరావు, చౌడారెడ్డి, చంద్రగిరి నారాయణరావు, పోగుల విజయశ్రీ, కనగాల జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. కవి బుర్రి కుమార్ రాజు నిర్వహించిన కవన పున్నమిలో ఎం. విజయకుమార్ ప్రథమ, చిలక అనిత ద్వితీయ, బి. జనార్థన రెడ్డి తృతీయ బహుమతులు అందుకున్నారు.