ప్రకటన వీరబ్రహ్మంగారి అశయాలను వివాదం చేయడం తగదు - ప్రజాశక్తి బుక్‌హౌస్‌

తెలుగు ప్రజలు గర్వించదగిన గొప్ప సామాజిక తత్త్వవేత్త పోతులూరి వీరబ్రహ్మంగారు. ఆయన తన సమకాలీన సమాజంలోని అనేక రుగ్మతలను ఎత్తి చూపి, పరిష్కారం చెప్పటమే కాక ఆచరించారు. అవి ఈ నాటికీ ఎంతో విలువైనవి. ఆయన సమాజంలో పాతుకుపోయిన కుల తత్త్వాన్ని వ్యతిరేకించారు. మతం మనుషులను కలపాలిగాని విడదీయరాదన్నారు. మనుషులను విభజించే మతాన్ని ఆచరించవద్దన్నారు. విగ్రహారాధనను వ్యతిరేకించారు, దేవుడు మనిషిలోనే ఉంటాడు గనుక దేవునికీ మనిషికీ మధ్య మధ్యవర్తుల అవసరం లేదన్నారు. ఆచరణలో ఆయన  తన శిష్యులుగా మాదిగ కులం నుంచి కక్కయ్యని, ముస్లిం మతం నుండి సిద్దయ్యను తీసుకొన్నారు. ఆచారాల పేరుతో స్త్రీలపై వివక్షను వ్యతిరేకించారు. 

వీరబ్రహ్మంగారు ప్రవచించి, ఆచరించిన ఈ ఉన్నతమైన ఆలోచనలు, ఆచరణలను సమాజం ఇంతకాలం నిర్లక్ష్యం చేసింది. వీటిపై చర్చించేందుకు సాహితీ స్రవంతితో సహా100 సాహిత్య, సమాజిక సంఘాల ఆధ్వర్యంలో అక్టోబర్‌ 12వ తేదీ కర్నూలులో వీరబ్రహ్మం తాత్త్విక, సమాజిక అంశాలపై సభ జరిగింది.  20 మంది ప్రముఖలు, వీరబ్రహ్మంగారి జీవితం, రచనలపై పరిశోధన చేసిన మేధావులు ఉపన్యసించారు.

ఈ సందర్భంగా గత రెండు సంవత్సరాల నుంచి బ్రహ్మంగారి మీద పరిశోధనలు చేసిన ప్రముఖుల  రచనలు, ఆయన గురించి రాసిన వ్యాసాలతో  ప్రజాశక్తి బుక్‌హౌస్‌ ప్రచురించిన 11 పుస్తకాలను  ఆవిష్కరించారు. పుస్తకాలకు ప్రముఖ సాహిత్య విమర్శకులు, ప్రజాశక్తి బుక్‌హౌస్‌ గౌరవ సంపాదకులు  చాపాళెం చంద్రశేఖరరెడ్డిగారు సంపాదకత్వం వహించారు. ఇంత శ్రమ తీసుకుని వీరబ్రహ్మంగారి ఆశయాల ప్రచారం కోసం ప్రచురించిన పుస్తకాలను సాహిత్య, సాంస్కృతిక, తాత్త్విక రంగ ప్రముఖులు అభినందిసున్న సందర్భంలో కొంత మంది వీటిని వివాదాస్పదంగా మార్చడానికి ప్రయత్నించడం విచారకరం. పోతులూరి వీరబ్రహ్మంగారి మీద డాక్టర్‌ ఎంఎం వినోదినిగారు రాసిన పుస్తకంలో ఆయన కృషిని, ఔన్నత్యాన్ని ఆమె ఎంతగానో ప్రశంసించారు. ఆమె వెలిబుచ్చిన కొన్ని అభిప్రాయాలపై భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు. భిన్నాభిప్రాయాలను మేం గౌరవిస్తాం. కానీ వాటిని వివాదాలుగా మార్చి రచయితను బెదిరించడం, దూషించడం తగదు. ఈ పుస్తకాలపై వివాదాలు సృష్టించడం అంటే వీరబ్రహ్మంగారిని అగౌరవపరచడమే. ఇప్పటికైనా ఆయన ఆలోచనలకు వ్యతిరేకంగా జరుగుతున్న  ప్రచారాన్ని అపి ఆయన అశయాలను ఆచరించటం ఈనాడు అవసరం.

- ఎస్‌. వెంకట్రావు

ఎడిటర్‌

- కె. లక్ష్మయ్య,

జనరల్‌ మేనేజర్‌