విజయవాడలోని పిడిఎఫ్ కార్యాలయంలో నవంబర్ 19న మాతృభాషా మాధ్యమ వేదిక స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం ఓ ప్రకటన విడుదల చేసారు. స్టీరింగ్ కమిటీ సమావేశం అన్ని జిల్లాల్లోనూ మాతృభాష మాధ్యమ వేదికలు ఏర్పాటు చేయాలని, డిసెంబర్ 11న విజయవాడలో ధర్నాచౌక్ దగ్గర మేధావులు, రచయితలు, విద్యారంగ ప్రముఖులతో పెద్ద ఎత్తున ఒకరోజు సత్యాగ్రహం నిర్వహించాలని తీర్మానించింది. పాఠశాల స్థాయి వరకు శాస్త్రీయ విద్యావిధానంపై ప్రచారం నిర్వహిస్తామని, దీర్ఘకాలిక విస్తృత ఉద్యమానికి సిద్ధం కానున్నామని ప్రకటించింది. జి.వో 81కి వ్యతిరేకంగా విద్యావేత్తలు, సాహితీప్రముఖులు, సామాజిక కార్యకర్తలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారని, పలు కోణాల్లో విస్తృతంగా చర్చలు జరగడం హర్షణీయమని పేర్కొన్నారు. స్టీరింగ్ కమిటీ సభ్యులుగా విఠపు బాలసుబ్రహ్మణ్యం, సామల రమేష్‌బాబు, రమేష్ పట్నాయక్, యస్.ఆర్. పరిమి, పెనుగొండ లక్ష్మీనారాయణ, దివికుమార్, వొరప్రసాద్ ఉన్నారు.