ప్రభుత్వ ఆలోచనలు అశాస్త్రీయం

తెలుగు వారిగా మాతృభాష ఉనికిని కాపాడుకోవడం మన కర్తవ్యమని, ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు అశాస్త్రీయమని ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత, వార్తా విశ్లేషకులు తెలకపల్లి రవి పేర్కొన్నారు. నవంబర్‌ 21న అనంతపురంలోని స్థానిక ఎన్జీవో హోంలో సాహితీ స్రవంతి, విద్వాన్‌ విశ్వం విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో 'ప్రాథమిక విద్య- బోధనా మాధ్యమం' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. విశ్వం విజ్ఞాన కేంద్రం కో- కన్వీనర్‌ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్య, బోధన ఇంగ్లీష్‌ మాధ్యమంలో తీసుకొస్తున్న సమీకరణాలు తెలుగు ప్రజల గుండెచప్పుడును సంక్లిష్టంలోకి నెట్టిందని అన్నారు. తెలుగును పటిష్ట పరచాల్సిన ప్రభుత్వం విచిత్ర ఆలోచనలు చేస్తోందన్నారు. మాతృభాష లోని పట్టు పరభాషలో రాదన్నారు. ప్రాథమిక విద్య మాతభాషలో ఉండాలని  ప్రపంచ దేశాలు కూడా చెబుతున్నాయని అన్నారు. ఈ అంశం వ్యక్తిగతం కాదని, వ్యక్తిగత దూషణలు కూడా సరికాదన్నారు. పరభాషపై పట్టుకు అనేక మార్గాలు ఉన్నాయని, కానీ ప్రాథమిక విద్యకు అంటగట్టడం దారుణమన్నారు. ఇంగ్లీష్‌ మీడియం వద్దని ఎవ్వరూ చెప్పటం లేదని, అయితే ప్రభుత్వం తెలుగు మీడియం తీసి వేయవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 32 శాతం తెలుగు భాష ప్రాచుర్యం తగ్గితే ప్రమాదమని అన్నారు. భవిష్యత్తులో తెలుగు అకాడమీ కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. నిరక్షరాస్యతకు అశాస్త్రీయ ఆలోచనలు కారణమని, ఆంగ్లం వచ్చి 40 ఏళ్లు అయినా మరి ఎందుకు అభివ ద్ధి జరగలేదని అన్నారు. ఆంగ్లం మత్తులో మాతృభాషను అశ్రద్ధ చేయటం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వం విజ్ఞాన కేంద్రం కో కన్వీనర్‌ శ్రీనివాసరావు, రచయిత పొత్తూరి హరిక ష్ణ, సిపిఎం ఉత్తర ప్రాంత జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, ఐద్వా రాష్ట్ర నాయకులు సావిత్రి, జిల్లా కార్యదర్శి యమున, ప్రజాసంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

కర్నూల్‌లో...

కర్నూల్‌లోని ఎంపిపి హాలులో ఎపిడబ్ల్యుజెఎఫ్‌ ఆధ్వర్యంలో నవంబర్‌ 22న జరిగిన ఇష్టాగోష్టిలో తెలకపల్లి రవి మాట్లాడుతూ ప్రాథమిక విద్యలో మాతృభాష ఉండాలన్నారు. భాషను ప్రజాస్వామీకరించాలని, ఆంగ్ల మాధ్యమాన్ని పెట్టినంత మాత్రాన ఆంగ్లం రాదన్నారు. ఆంగ్ల భాషలో నైపుణ్యాలను విధిగా నేర్పించాలన్నారు. ఆంగ్ల మాధ్యమానికి ఆంగ్లం పట్టుబడడానికి సంబంధం లేదన్నారు. భాషావేత్తలు మాతృభాషలో ప్రాథమిక విద్యాబోధన ఉండాలని చెబుతుంటే విస్మరించడం సరైనది కాదన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీస్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, ప్రస్థానం సంపాదకవర్గ సభ్యులు కెంగార మోహన్‌, గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి, ఎస్‌.డి.వి. అజీజ్‌, గుంపుల వెంకటేశ్వర్లు, పెరికల రంగస్వామి, సయ్యద్‌ జహీర్‌ అహ్మద్‌ తదితరులు పాల్గొన్నారు.