ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జి.వో.నె. 81ను వ్యతిరేకిస్తూ మేధావులు, రచయితలు, వివిధ సాహిత్య సంస్థల నిరసన
మాతృభాషా మాధ్యమ వేదిక ఆధ్వర్యంలో నవంబర్ 17న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలుగుతల్లి విగ్రహం వద్ద మేధావులు, రచయితలు, తెలుగు భాష, సాహిత్య, సాంస్క ృతిక సంఘాల ప్రతినిధులు, తెలుగు భాషాభిమానులు నిరసన ప్రదర్శన జరిపారు. ఇంగ్లీషు భాషను బోధించడానికి తెలుగు మాధ్యమాన్ని మొత్తంగా తీసేయటం ఏ విధంగానూ సమర్థనీయం కాదని అన్నారు. ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాలు రెండింటిలోనూ బోధన జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రాథమిక విద్య మాతృభాషలో జరగాలనేది అంతర్జాతీయంగా వివిధ ప్రామాణిక అధ్యయనాలు రుజువు పరిచాయని ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రవేటు పాఠశాలల్లో కూడా ప్రాథమిక విద్యలో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలని కోరారు. తెలుగు భాష వికాసానికి గొడ్డలిపెట్టు లాంటి జి.వో.నెం. 81ని తక్షణం రద్దుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాతృభాషా మాధ్యమం ప్రజాస్వామిక హక్కు అని నినదించారు.
ఈ నిరసన కార్యక్రమంలో మాతృభాషా మాధ్యమ వేదిక నాయకులు సామల రమేష్‌బాబు, డా|| పరిమి, పెనుగొండ లక్ష్మీనారాయణ, దివికుమార్, రమేష్‌పట్నాయక్, వొరప్రసాద్‌లు పాల్గొన్నారు. అలాగే శాసనమండలి సభ్యులు రాము సూర్యారావు, విజయవాడ పూర్వ శాసన సభ్యులు సుబ్బరాజు, కార్మిక నాయకులు ఓబులేషు, విజయవాడ బుక్‌ఫెయిర్ సొసైటీ అధ్యక్షులు కె. లక్ష్మయ్య, ప్రజాసాహితి మాసపత్రిక సంపాదకులు కొత్తపల్లి రవిబాబు, విరసం ప్రతినిధి నల్లూరి రుక్మిణి, తెలుగు భాషా సమాఖ్య ప్రధాన కార్యదర్శి సింగారావు, ఎపిటిఎఫ్ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాద్, యుటిఎఫ్ నాయకులు వెంకటేశ్వర్లు, డిటిఎఫ్ నాయకులు నరహరి, సుబ్బారావు, అరసం బాధ్యులు వల్లూరి శివప్రసాద్, కొండపల్లి మాధవరావు, శరత్, హేతువాద సంఘం నాయకులు నార్నె వెంకటసుబ్బయ్య, ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి చలపాక ప్రకాష్, నవ్యాంధ్ర రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి కలిమిశ్రీ, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షులు గోళ్ళ నారాయణరావు, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నాయకులు శాంతిశ్రీ, మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం బాధ్యులు బోస్, జాషువా సాంస్క ృతిక వేదిక బాధ్యులు గుండు నారాయణ, రాజు, ఇంకా వివిధ సాహిత్య, సామాజిక,
సాంస్క ృతిక, ప్రజా సంఘాల ప్రతినిధులు, ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, తెలుగు భాషాభిమానులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. జి.వో. నెం. 81 రద్దు చేయాలని, ప్రాథమిక విద్యలో మాతృభాషా మాధ్యమాన్ని ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలల్లో తప్పనిసరి చేయాలని, తదితర నిర్ధిష్టమైన డిమాండ్లతో మాతృభాషా మాధ్యమ వేదిక త్వరలోనే సమావేశమై కార్యాచరణ ప్రకటించడం జరుగుతుందని సామల రమేష్‌బాబు తెలిపారు. ఈ యొక్క కార్యాచరణ ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాలలో వివిధ సంస్థలు, మేధావులు కలిసి ఐక్యంగా మాతృభాషా మాధ్యమ వేదిక నేతృత్వంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.