మాతృభాషా మాధ్యమ వేదిక ఏర్పాటు

విజయవాడలో మేధావులు, విద్యావేత్తల, రచయితల రౌండ్‌టేబుల్‌ సమావేశం

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాద్యమాన్ని కొనసాగించాలని, మాతభాషను పరిరక్షించాలని వివిధ విద్యార్థి, ఉపాధ్యాయ, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశాయి. 'మాతభాష మాధ్యమాన్ని కొనసాగించాలి' అనే అంశం పై నవంబర్‌ 12న విజయవాడ ఎంబి. విజ్ఞాన కేంద్రంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. జిఒ 81 రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ 17న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాలని సమావేశం తీర్మానించింది. మాత భాష ప్రాధాన్యతపై అన్ని జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని, ప్రముఖ సాహితీ, సాంస్క తిక సంస్థల మేథావులతో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టాలని తీర్మానించింది. అన్ని సంఘాలనూ కలుపుకొని 'మాత భాషా మాద్యమ వేదిక' పేరుతో ఉద్యమించాలని తీర్మానించింది. అందులో భాగంగా పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, అరసం నుంచి పెనుగొండ లక్ష్మీనారాయణ, ప్రముఖ విద్యావేత్త డా|| ఎస్‌.ఆర్‌. పరిమి, తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు రమేష్‌ బాబు వంటి ప్రముఖులతో స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సమావేశానికి అధ్యక్షత వహించిన పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాత భాష పరిరక్షణకు దీర్ఘకాల పోరాటం చేయాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే అది మొదలు కావాలని, ప్రజలకు తెలుగు మాధ్యమంలో విద్యపై అవగాహన కల్పించాలన్నారు. ఆంగ్లమాద్యమం పై విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలుసుకొని, వాటిపై విస్తత చర్చ జరగాలన్నారు. ప్రముఖ విద్యావేత్త డాక్టర్‌ పరిమి మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో చిన్నారులకు తెలియని భాష రుద్దితే వారు చదువుకు దూరమవు తారని అన్నారు. తెలుగు భాషా ఉద్యమ సమితి నాయకులు సామల రమేష్‌ బాబు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉద్యోగం కోసం మాత భాష ఆవశ్యకత ఉందన్నారు. విద్యా పరిరక్షణ వేదిక అధ్యక్షులు రమేష్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ జిఒ 81ని ప్రభుత్వం రద్దు చేయడంతోపాటు ప్రభుత్వం సరైన విద్యా విధానాన్ని తీసుకురావాలన్నారు. ప్రయివేటు పాఠశాలల్లోనూ ప్రాథమికంగా తెలుగు మాధ్యమంలోనే బోధన తప్పనిసరి చేయాలన్నారు. యుటిఎఫ్‌ నాయకులు సాబ్జి మాట్లాడుతూ జిఒ 81ని రద్దు చేసేవరకు అన్ని సంఘాలు కలసి ఐక్య పోరాటం చేయాలన్నారు. ఏ మాధ్యమం తీసుకోవాలనే అంశంపై విద్యార్థుల అభిప్రాయాన్ని ఓటింగ్‌ ద్వారా తెలుసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు సూచించారు. ప్రజాశక్తి బుక్‌హౌస్‌ ఎడిటర్‌ ఎస్‌. వెంకట్రావు మాట్లాడుతూ ప్రయివేటుతోపాటు, ఎయిడెడ్‌, ప్రభుత్వ పాఠశాలలన్నింటిలో ప్రాథమిక విద్య అంతా మాతభాషలోనే ఉండాల న్నారు. ఎపిటిఎఫ్‌ నాయకులు పాండురంగవరప్రసాద్‌ మాట్లాడుతూ అందరికీ ఒకేతరహాలో విద్యా బోధన ఉండే పాఠశాల వ్యవస్థను (కామన్‌ స్కూల్స్‌) తీసుకురావాలని సూచించారు. జన సాహితీ సంస్థ అధ్యక్షులు దివి కుమార్‌ మాట్లాడుతూ ప్రపంచ బ్యాంకు విధానాలు, ప్రయివేటీకరణలో భాగంగానే ఆంగ్ల విద్యను నిర్బంధంగా రుద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మెల్‌బోర్న్‌ యూనివర్శిటీ ప్రొఫెసర్‌ కాట్రగడ్డ అజయ్‌ మాట్లాడుతూ తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలన్నారు. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలుగు మాద్యమంలో చదివితే ఇతర భాషలు రావనే అపోహను తల్లిదండ్రుల్లో పోగొట్టాలని అన్నారు. ఆంధ్ర ఆర్ట్స్‌ అకాడమీ ప్రధాన కార్యదర్శి గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న ఆంగ్లమాధ్యమ బోధన నిర్ణయం పై న్యాయపరంగా పోరాడాలని, ప్రజావ్యాజ్యం వేయాలని సూచించారు. వికీపిడియా ప్రతినిధి రెహ్మాన్‌ మాట్లాడుతూ ఇంగ్లీష్‌ పై ఆధారపడితే భవిష్యత్తులో మానవ వనరుల స్థానంలో యంత్రాలతోనే పని చేయించుకునే పరిస్థితి వస్తుందన్నారు. ఎమ్మెల్సీ కెఎస్‌. లక్ష్మణరావు, యుటిఎఫ్‌ నాయకులు పి. బాబురెడ్డి, ఎంబి విజ్ఞాన కేంద్రాల కార్యదర్శి పి. మురళీకష్ణ, సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షులు వొరప్రసాద్‌, వివిధ విద్యార్థి, ఉపాధ్యాయ, ప్రయివేటు స్కూల్స్‌, సాహితీ, ప్రజా తదితర 39 సంఘాల ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు.