రెంటాల గోపాలకృష్ణ శతజయంతి సభ

హైద్రాబాద్‌ స్టడి సర్కిల్‌ ఆడిటోరియంలో డిసెంబర్‌ 15న ఛాయా రిసోర్సెస్‌ సెంటర్‌, రెంటాల స్వర్ణోత్సవ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో రెంటాల గోపాలకష్ణ శతజయంతి ప్రారంభ సభ జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించిన సాహిత్య ప్రస్థానం ప్రధాన సంపాదకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ రెంటాల శ్రమ శిక్షణ, క్రమ శిక్షణా కల్గిన నిర్మల, నిజాయితీ కల్గిన జర్నలిస్టు, రచయిత అని పేర్కొన్నారు. ఆయన సజించని అంశమంటూ లేదని, ఆయన రచించిన, అనువదించిన పలు గ్రంథాలను ప్రజాశక్తి ప్రచురించిందని గుర్తు చేశారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్‌ మాట్లాడుతూ రెంటాల రచనల్లో ఆవేశం, ఆలోచనా, పదునైనా భాష కన్పిస్తాయని, శివధనువు వంటి రచనల్లో అభ్యుదయ భావం ద్యోతకమవు తుందన్నారు. ప్రపంచంలోని ఉత్తమ సాహిత్యాన్ని తెలుగు వారికి అందించాలని ఉత్తమ అనువాదకుడిగా వేగంగా పలు అనువాద రచనలు చేశారని వివరించారు. బిచ్చగాళ్ల పాటలు కూడా రాసి కవితా వస్తువుకు ఏదీ అతీతం కాదని ఆయన నిరూపించారన్నారు. పాలకుల ప్రాధాన్యతలు మారుతున్న క్రమంలో రెంటాల వంటి వారిని మరో సారి గుర్తు చేసుకోవడం వల్ల సమాజ శ్రేయస్సుకు ఆయన సాహిత్యం దోహదం కాగలదన్నారు. సినీ దర్శక, నిర్మాత బి నర్సింగరావు మాట్లాడుతూ రెంటాల రచనలను తాను చదివానని, సంస్కతంలో ఉన్న పలు గ్రంథాలను ఆయన తెలుగులో అనువదించి సామాన్యులకు చేరువ చేశారని పేర్కొన్నారు. స్వర్ణోత్సవ సంఘం అధ్యక్షుడు కెపి అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ రెంటాల గోపాలకష్ణ రష్యన్‌ సాహిత్యాన్ని తెలుగులో అనుసజన చేశారని వివరించారు. అప్సర్‌, రెంటాల కల్పన, ఆదిత్య కొర్రపాటి, రెంటాల జయదేవ తదితరులు సభలో పాల్గొన్నారు.