కాకినాడ సాహితీస్రవంతి ఆధ్వర్యంలో విద్యార్థులకు కార్యశాల

గురజాడ వర్థంతి రోజు నవంబర్‌ 30న సాహితీ స్రవంతి కాకినాడ శాఖ విద్యార్థులకు ఒక రోజు కార్యశాల నిర్వహించింది. పిఠాపురం రాజా డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న మహిళా కళాశాల, ఐడియల్‌, ఆదిత్య, పిఆర్‌ జూనియర్‌ అండ్‌ పిఆర్‌ డిగ్రీ కళాశాలల నుంచి సుమారు వంద మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పిఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చప్పిడి కష్ణ అధ్యక్షత వహించారు. సాహితి స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు గనారా మాట్లాడుతూ.. ''ఇప్పుడు వేమన, గురజాడ, కందుకూరి, శ్రీశ్రీ, అద్దేపల్లి వంటి కవులూ రచయితలూ కావాలి. మెరుగైన సమాజం కోసం యువత పెద్దఎత్తున సాహిత్యం వైపు రావాలి. అందుకోసమే మా ఈ ప్రయత్నం.'' అని అన్నారు. జిల్లా అధ్యక్షులు జోస్యుల

క ష్ణబాబు... కవితా ప్రక్రియల గురించి పిల్లలకు వివరించారు. కవి బొల్లోజు బాబా కవిత్వ నిర్మాణ పద్ధతులు, కవిత్వ భాషపై బోధించారు. ఆధునిక కవిత్వంలో అలంకారాలు, వస్తువు గురించి వివరించారు. పిఆర్‌ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షుడు, కవి సుంకర గోపాలయ్య... కవిత్వం అంటే ఏమిటి? కవిత్వం ఎందుకు? అంశాలపై మాట్లాడారు. సాహితి స్రవంతి నగర బాధ్యులు మార్ని జానకిరామ్‌ విద్యార్థులు రాసిన కవితలను విశ్లేషించారు. మధ్యాహ్నం ఓ గంట పాటు కథపై అద్దేపల్లి ప్రభు పిల్లలకు రచనా మెలకువలు వివరించారు.

ఈ కార్యశాలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు ఎల్లప్పుడూ వస్తామని సంతోషంగా చెప్పారు. ప్రయత్నం చేయాలి గాని నవతరం సాహిత్యం వైపు మళ్లటం పెద్ద పని కాదు అనిపించింది. ఆసక్తి కలిగిన వారిని ఎంచుకుని చేసిన ఈ కార్యక్రమంలో ఒకరోజులోనే కవిత్వం, కథ నేర్పించలేకపోవచ్చు. కానీ ఇదొక ఆరంభం. ప్రేరణకు దోహదపడే ప్రయత్నం. అందులో సాహితీ స్రవంతి బందం విజయవంతం అయిందనడం అతిశయోక్తి కాదు.

- సుంకర గోపాలయ్య