మాత భాషా మాధ్యమ వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో సత్యాగ్రహం

మాత భాషా మాధ్యమ వేదిక ఆధ్వర్యంలో తెలుగు మాధ్యమాన్ని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ డిసెంబర్‌ 11న విజయవాడ ధర్నాచౌక్‌లో సత్యాగ్రహం జరిగింది. పలువురు మేధావులు, రచయితలు, ప్రజా ప్రతినిధులు జి.ఒ. 85ను తక్షణం రద్దు చేయాలని ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.  కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పిడిఎఫ్‌ శాసనమండలి పక్షనేత విఠపు బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ప్రభుత్వం దుస్సాహసం చేస్తోందన్నారు. మాధ్యమాన్ని రద్దు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో తెలుగు కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మాతభాషను ఇలా రద్దు చేయడం ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? అని ప్రశ్నించారు. తెలుగు కావాలనే వాళ్లను పేదలకు వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని, ఎదురుదాడికి దిగుతున్నారని అన్నారు.ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని గురుకులాల్లో, 165 మోడల్‌ స్కూళ్లు, కెజిబివిలు, 9656 ప్రాథమిక, 1450 ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఇప్పటికే ఆంగ్ల మాధ్యమం

ఉందని, ఇప్పుడు తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ పి రఘువర్మ మాట్లాడుతూ పుట్టిన భాషను, జాతిని మరచిన నేతను సిఎంగా ఎన్నుకున్నామన్నారు. పరిపాలించే తీరు ఆయనకు అర్థమవుతోందా? ప్రజలు ఇంతగా గగ్గోలు పెడుతుంటే ఒక సారి కూడా ఆలోచించకుండా ఎందుకున్నారు? అని ప్రశ్నించారు. ప్రజాశక్తి సంపాదకులు ఎంవిఎస్‌ శర్మ మాట్లాడుతూ మాతభాషా మాధ్యమ వేదిక ఉద్యమాన్ని ప్రజాశక్తి తన ఉద్యమంగా భావిస్తుందని, యావత్‌ శక్తిని

ఉపయోగిస్తుందని చెప్పారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ గారపాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమస్యకు ఒక శస్త్ర చికిత్స కావాలని, సమావేశాల ద్వారా సాధించుకునే పరిస్థితి లేదని అన్నారు. చదువు జన భాషలో లేనప్పుడు సమాజం నాశనమవడమే కాక పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోవాల్సి వస్తుందన్నారు. ప్రతి పరిశ్రమా భాషాధారిత పరిశ్రమేనని, అవన్నీ మూతపడతాయని తెలిపారు. స్థూల జాతీయోత్పత్తిలో 87 శాతం మాత భాషల ద్వారానే సాధ్యమవుతోందన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో 25 లక్షల మంది పనిచేస్తున్నారన్నారు. తెలుగు భాష కోసం పోరాడాల్సిన అవసరముందన్నారు. మాతభాషా మాధ్యమ వేదిక స్టీరింగ్‌ కమిటీ సభ్యులు సామల రమేష్‌బాబు, పరిమి, రమేష్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ తెలుగుజాతి విజయాలకే దెబ్బ తగులుతోందన్నారు. మాతభాషా మాధ్యమంపై సాహిత్య ప్రస్థానం వెలువరించిన డిసెంబర్‌ నెల ప్రత్యేక సంచికను పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో విద్యావేత్త డా|| ఎస్‌.ఆర్‌.పరిమి,  ప్రజాసాహితి సంపాదకులు కొత్తపల్లి రవిబాబు, అరసం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ, రమేష్‌ పట్నాయక్‌, విరసం నాయకులు సిఎస్‌ఆర్‌ ప్రసాద్‌, రుక్మిణి, ప్రజాశక్తి బుక్‌హౌస్‌ సంపాదకులు ఎస్‌ వెంకట్రావు, అబ్దుస్‌ సుభాన్‌, చలసాని రామారావు, ఉపాధ్యాయ సంఘాల నేతలు షేక్‌ సాబ్జీ, జోసఫ్‌ సుధీర్‌ బాబు, పాండురంగ వరప్రసాద్‌, పి. కష్ణయ్య,

కె. లక్ష్మయ్య, చలపాక ప్రకాష్‌, వొరప్రసాద్‌, మందరపు హైమవతి, కోపూరి పుష్పాదేవి, కోడె యామినీదేవి, తదితరులు పాల్గొన్నారు.