విమలాశాంతి సాహిత్య సాంఘిక సాంస్క ృతిక సేవా సమితి ఆధ్వర్యంలో జనవరి 5న అనంతపురంలోని జిల్లా పరిషత్ మీటింగ్ హాలులో శాంతి రజనీకాంత్ స్మారక కథా పురస్కారం సభ జరిగింది. డా|| ఎం. ప్రగతి అధ్యక్షత వహించిన ఈ సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన 'సాహిత్య ప్రస్థానం' మాసపత్రిక ప్రధాన సంపాదకులు తెలకపల్లి రవి ప్రసంగిస్తూ అద్దేపల్లి ప్రభు రాసిన కథల్లో జీవన విధ్వంసం కనిపిస్తుందన్నారు. 'సీమేన్' కథల్లో మానవీయ స్ప ృహ
ఉందన్నారు. ప్రస్తుతం కవిత్వం కంటే కథలే ఎక్కువ మంది చదువుతున్నారన్నారు. జీవితాన్ని మధించే సాహిత్యం రావాలన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ప్రసంగిస్తూ డా|| శాంతినారాయణ హేతుబద్ధంగా పురస్కారాలు ఇస్తారని, ఇప్పటి వరకూ పురస్కారాలు పొందిన రచయితలంతా పీడిత ప్రజల పక్షం వహించిన వారే అన్నారు. అభివృద్ధి చెందిన ప్రాంతంలో కూడా అభివృద్ధి చెందని వాళ్ళ గురించి రాయడం ముఖ్యమన్నారు. మరో విశిష్ట అతిథి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకోబోతున్న ప్రసిద్ధ కవి, నవలా రచయిత బండి నారాయణస్వామి మాట్లాడుతూ అద్దేపల్లి ప్రభు సాహిత్యం నిండా ధ్వంసమవుతున్న జీవితాలే కన్పిస్తాయన్నారు.