సాహితీస్రవంతి ఆధ్వర్యంలో అద్దేపల్లి 4వ వర్ధంతి


కాకినాడ సాహితీస్రవంతి ఆధ్వర్యంలో జనవరి 11న జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రజాకవి అద్దేపల్లి రామమోహనరావు 4వ వర్ధంతి సభ జరిగింది. అద్దేపల్లి జ్యోతి అతిథులను వేదికపైకి ఆహ్వానించారు. సాహితీస్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు గనారా సభకు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ కాకినాడలో అద్దేపల్లి మానసపుత్రికగా ప్రారంభమైన సాహితీస్రవంతిని, ఆయన స్ఫూర్తితో 2016 నుండి ప్రగతిశీల, లౌకిక భావజాలంతో ముందుకు తీసుకెళ్తున్నామని అన్నారు. ముఖ్యఅతిథిగా హాజరయిన ఆచార్య మేడిపల్లి రవికుమార్‌ 'వర్తమాన కవిత్వం' అంశంపై ప్రసంగించారు. వచన కవిత్వం ఆధునికంగా ఉండమని, మనిషిగా ఉండమని ఒక డిమాండ్‌ చేస్తుందని అన్నారు. అనంతరం అద్దేపల్లికి అత్మీయులైన ఎస్‌.ఆర్‌. పృథ్వీ రచన 'అక్షర కిరణాలు' వ్యాస సంపుటిని సాహితీస్రవంతి జిల్లా అధ్యక్షులు డా|| జోశ్యుల కృష్ణబాబు ఆవిష్కరించారు. సంపుటిలోని 13 వ్యాసాలను క్లుప్తంగా ఆయన పరిచయం చేసారు. సాహితీస్రవంతి జిల్లా గౌరవ అధ్యక్షులు డా|| వుయ్యపు హనుమంతరావు, నగర అధ్యక్షులు జానకిరామ్‌ చౌదరి, గ్రంథాలయ పాలకులు సాయి సత్యనారాయణ, ఎస్‌. ఆర్‌. పృథ్వీ, అద్దేపల్లితో తమకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. పసుమర్తి పద్మజావాణి, అద్దేపల్లి ఉదయభాస్కర్‌తో పాటు ఇతర కుటుంబ సభ్యులు, ఇందిర, ఇంద్రగంటి నరసింహమూర్తి, గరికపాటి మాస్టారు శ్రీహస్త, డా|| శిరీష, వి.ఆర్‌.ఎస్‌. సోమయాజులు, సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌ సత్యమూర్తి, కె. శివ, మధునాపంతుల సత్యనారాయణ మూర్తి, తంత్రపణి శ్రీరామ్మూర్తి, కాల్నాధభ్ట శ్రీరామశాస్త్రి, అవధానుల మణిబాబు, పుప్పాల సూర్యకుమారి తదితరులు సభలో పాల్గొన్నారు.