శ్రీకాకుళంలోని గరిమెళ్ళ విజ్ఞాన కేంద్రం డిసెంబర్ 22 ఆదివారం నాడు స్వాతంత్య్ర సమరయోధుడు, రాజకీయ కవి గరిమెళ్ళ సత్యనారాయణ సంస్మరణోత్సవం 2019 ఘనంగా నిర్వహించింది. ఉదయం పది గంటలకు గరిమెళ్ళ సాహిత్యంఫై కేంద్ర సాహిత్య అకాడెమి తో సంయుక్తం గా ఒక లిటరరీ ఫోరమ్ నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు లో ప్రధాన వక్త గా హైదరాబాద్ కి చెందిన సాహితీవేత్త డా.కె ముత్యం పాల్గొని ప్రధాన ప్రసంగం చేశారు. డా.సుంకిరెడ్డి నారాయణరెడ్డి (నల్గొండ), అకాడెమి తెలుగు విభాగం సలహా సంఘ సభ్యులు అట్టాడ అప్పలనాయుడు (శ్రీకాకుళం), స్నేహాకళాసాహితి (పార్వతీపురం) అధ్యక్షులు గంటేడ గౌరినాయుడు, ప్రముఖ జర్నలిస్ట్ నల్లి ధర్మారావు (శ్రీకాకుళం) తదితరులు గరిమెళ్ళ సాహిత్యం ఫై వివిధ కోణాల్లో విశ్లేషణాత్మక ప్రసంగాలు చేశారు. అధ్యక్షత వహించిన గరిమెళ్ళ విజ్ఞాన కేంద్రం అధ్యక్షులు వి జి కే మూర్తి మాట్లాడుతూ తమ సంస్థ లక్ష్యాలు కార్యక్రమాలను క్లుప్తంగా వివరించారు. స్వతంత్ర పోరాటం లో గరిమెళ్ళ నిర్వహించిన ధీరోదాత్తమైన పాత్ర నేటి తరానికి, ప్రత్యేకించి యువత కూ గుర్తు చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు.
ముఖ్య వక్త గా పాల్గొన్న డా. కె ముత్యం కొత్త తరానికి గరిమెళ్ళ ని పరిచయం చేయడం ఎంతైనా అవసరం అని అన్నారు. కులాల పట్ల మతాల పట్ల వీరాభిమానం లేని ఈ ఉత్తరాంధ్రంటే తనకెంతో ఇష్టమని, ఈ ప్రాంతం నుండీ అనేక అభ్యుదయ ఉద్యమాలు పుట్టాయని అన్నారు. గరిమెళ్ళ అలభ్య రచనలను ఆయన సేకరించి సంకలనపర్చగా గరిమెళ్ళ విజ్ఞాన కేంద్రం ప్రచురించిన ''స్వాతంత్రోద్యమం - గరిమెళ్ళ '' అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు.
డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక అభ్యుదయ ఉద్యమాలు, విప్లవ సాహిత్యోద్యమాలు ఉత్తరాంధ్ర నుండి ఆవిర్భవించాయని అన్నారు. నాడు గరిమెళ్ళ సామ్రాజ్యవాద బ్రిటిష్ శక్తులకు వ్యతిరేకంగా పోరాడాడని కానీ నేడు అమెరికా సామ్రాజ్యవాదానికి దాసోహమై భారత్ నడుస్తున్నదని అంటూ నేటి సాహితీ ప్రపంచం దీన్ని ధీటుగా ఎదుర్కొనాలని పిలుపునిచ్చారు.
ప్రముఖ కధా రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగ సలహా సంఘ సభ్యుడు అట్టాడ అప్పలనాయుడు తన ప్రసంగం లో ప్రజా సమస్యలను ప్రతిబింబించే రాజకీయాల నుండి కవులు కథావస్తువులను ఎంచుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి శాశ్వత ప్రతిపక్షం గా కవి నిలుస్తాడని తన రచనల ద్వారా గరిమెళ్ళ నిరూపించారని అన్నారు. గరిమెళ్ళ రచనల్లో అత్యంత ప్రజాదరణ పొందిన '' మాకొద్దీ తెల్లదొర తనమూ '' గీతాన్ని సోదాహరణం గా విశ్లేషిస్తూ పార్వతీపురానికి చెందిన గంటేడ గౌరు నాయుడు ప్రసంగించారు. 46 పాదాలున్న ఆ గేయం 46 తూటాలున్న తుపాకీ లాగ గరిమెళ్ళ గళం ద్వారా బ్రిటిష్ పాలన ఫై సమరభేరి మ్రోగించిందని అన్నారు. సీనియర్ పాత్రికేయులు, రచయిత నల్లి ధర్మారావు స్వాతంత్య్ర పోరాటంలో గరిమెళ్ళ జర్నలిస్ట్ గా చేసిన కషి సోదాహరణం గా వివరించారు. ఆయన బ్రతుకు తెరువు కోసం ఎన్ని కష్టాలు అనుభవించినా, ప్రజల కోసం, దేశం కోసం ఆలోచన చేయడంలో ఏనాడూ రాజీ పడలేదని అన్నారు. తొలుత గరిమెళ్ళ చిత్రపటానికి పూలమాలలు వేసి సభికులంతా నివాళులర్పించారు. గరిమెళ్ళ రచనలను, గరిమెళ్ళ ఫై రచనలను ప్రాంగణం లో ప్రత్యేకంగా ప్రదర్శించడం విశేషం.
మధ్యాహ్నం సభకు సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు చింతాడ రామారావు అధ్యక్షత వహించారు.'' ఆనాటి స్వాతంత్ర పోరాటం - నేటి సామాజిక స్థితిగతులు '' అనే అంశం ఫై వచ్చిన కవితలపై ఒక సంపుటిని ప్రచురించగా స్థానిక శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు ఆవిష్కరించారు. కవితలు పంపిన కవులను, హాజరైన యువతను ధర్మాన అభినందించారు. గరిమెళ్ళ స్మారక ట్రస్ట్ అధ్యక్షులు, మాజీ శాసన సభ్యులు కే ఏ ఎన్ భుక్త తాను గరిమెళ్ళ స్వగ్రామమైన ప్రియాగ్రహారం వాసిని అయినందుకు గర్వపడు తున్నానన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్ మాట్లాడుతూ భావి పౌరులకు ఎటువంటి సమాజాన్ని అందించాలో ప్రజా కవులు, కళాకారులు రచయితలు ఆలోచన చేసి ప్రస్తుత పరిస్థితులపట్ల యువతని చైతన్యపరచవలసిందిగా పిలుపునిచ్చారు. సాహిత్యమే ఆయుధం గా బ్రిటిష్ వారిని ఎదిరించిన గరిమెళ్ళ ను మనం మరచి పోలేమని అంబెడ్కర్ విశ్వవిద్యాలయం విశ్రాంత ఉపకులపతి హనుమంతు లజపతిరారు అన్నారు. జిల్లా లోని డిగ్రీ కాలేజీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజీ విద్యార్థులకు '' స్వాతంత్రోద్యమ '' అంశం పట్ల క్విజ్, వక్త త్వం, వ్యాసరచన పోటీలు జిల్లాలోని పది కేంద్రాలలో నిర్వహించగా సుమారు ఐదు వందలమంది పాల్గొన్నారు. అందులో గెల్చిన వందమందికి మెమెంటోలు, ప్రశంసా పత్రాలతో పాటు విలువైన పుస్తకాలను బహుమతులుగా అందజేశారు. చింతాడ రామారావు, నల్లి ధర్మారావు సంయుక్తంగా రచించిన '' గరిమెళ్ళ గర్జన '' నాటికను శ్రీకాకుళ రంగస్థల కళాకారుల సమాఖ్య వారు ప్రదర్శించారు. సుమారు మూడు వందలమంది సాహిత్యాభిమానులు, విద్యాధికులు, విద్యార్థులు ఉదయం నుండి సాయంత్రం వరకూ సభలో పాల్గొనడం పట్ల అతిధులు నిర్వాహకులను అభినందించారు.