తెలుగును మాధ్యమంగా తొలగించిన జిఓ 81, 85లను రద్దుచేసిన హైకోర్టు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం గత సంవత్సరం నవంబర్‌ నెలలో జారీచేసిన జిఓలు 81, 85లను హైకోర్టు కొట్టివేసింది. ఏలూరుకు చెందిన గుంటుపల్లి శ్రీనివాస్‌, న్యాయవాది ఇంద్రనీల్‌, సుధీర్‌ రాంభొట్ల వేరువేరుగా దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు ఏప్రిల్‌ 15న తీర్పు వెలువరించింది. ఇంగ్లీషు మీడియంలోనే విద్యాబోధన చేయాలంటూ పాఠశాల పేరెంట్స్‌ కమిటీలు కూడా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేసాయి. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జీకే మహేశ్వరి, జస్టిస్‌ ఎస్‌. జయసూర్యలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ 92 పేజీల కీలక తీర్పును వెలువరించారు.
హైకోర్టు కీలకవ్యాఖ్యలు
''ప్రపంచీకరణ నేపథ్యంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇంగ్లీషు మీడియంలో బోధన చేసితీరాలన్న ప్రభుత్వ వాదన చెల్లదు. ప్రభుత్వం జారీ చేసిన జిఓ 85కు చట్టబద్ధత లేదు. ఇంగ్లీషు మీడియాన్ని తప్పనిసరి చేస్తూ జారీ అయిన ఆ జిఓ రాజ్యాంగ విరుద్దం. సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో వెలువరించిన తీర్పులకు భిన్నం. విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకం. ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వరకూ మాతృభాషలోనే విద్యాబోధన ఉండాలి. సర్వేపల్లి రాధాకృష్ణ, బాలగంగాధర్‌ తిలక్‌, గోపాలకృష్ణ గోఖలే, మహాత్మాగాంధీ, స్వామి వివేకానంద, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ లాంటి ఎందరో మహనీయులు మాతృభాషలోనే చదువుకుని అత్యంత ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. ఆంగ్లంలో చదివితేనే ఉన్నత స్థాయికి చేరగలరనే వాదన ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేదు. మాతృభాషలో చెప్పే విషయం హృదయాల్ని హత్తుకుంటుంది. బోధనా విషయాల్ని పిల్లలు త్వరగా అర్థం చేసుకునేందుకు, ఆత్మవిశ్వాసంతో ఎదిగేందుకు అమ్మభాషలోనే విద్యాబోధన సాగాలి'' అన్ని హైకోర్టు వ్యాఖ్యానించింది.
హైకోర్టు వెలువరించిన తీర్పును ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేయాలని మాతృభాషా మాధ్యమ వేదిక తరపున శాసనమండలి సభ్యులు విఠపు బాలసుబ్రహ్మణ్యం, సామల రమేష్‌బాబు, రమేష్‌పట్నాయక్‌; పెనుగొండ లక్ష్మీనారయణ, దివికుమార్‌, వొరప్రసాద్‌లు ఒక ప్రకటనలో కోరారు.