మహాకవి గుర్రం జాషువా 125వ జయంతిని పురస్కరించుకుని జాషువా సాంస్క ృతిక వేదిక, అమరావతి బాలోత్సవం ఆధ్వర్యంలో విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞానకేంద్రం వేదికగా పది సాహిత్య,
సాంస్క ృతిక సంస్థల భాగస్వామ్యంతో సెప్టెంబర్ 21 నుండి 28 వరకు 'వైతాళికుల స్ఫూర్తి సంబరాలు జరిగాయి. అంతర్జాలం వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎనిమిది రోజుల పాటు ప్రధాన ప్రసంగాలు, కీలక ప్రసంగాలతో పాటు షార్ట్ ఫిలింస్, జానపద, అభ్యుదయ గేయాలు, వీడియో కవితలు, వేమన పద్యాలు, జాషువా పద్యాలు, నీతి కథలు, చిత్రలేఖనం అంశాలలో పోటీలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. మొత్తం ఎనిమిది అంశాలకు 979 వీడియోలు పోటీకి వచ్చాయి. షార్ట్‌ఫిలింస్ -212, నీతి పద్యాలు - 162, వేమన పద్యాలు - 159, చిత్రలేఖనం - 135, కవితలు - 110, జాషువా పద్యాలు - 59, జానపద గీతాలు - 105, అభ్యుదయ గీతాలు - 37 వీడియోలు పోటీకి వచ్చాయి. పోటీకి వచ్చిన వీడియోల నుండి ప్రతీ అంశం నుండి 40 వీడియోల చొప్పున ఎనిమిది రోజులకు 320 వీడియోలను ఎంపికచేసి ఆన్‌లైన్‌లో ప్రసారం చేయడం జరిగింది. ప్రతీ అంశానికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు రెండు ప్రత్యేక బహుమతులను అందజేయడం జరిగింది. పోటీలలో పాల్గొన్న అందరికీ డిజిటల్ సర్టిఫికెట్‌లను వాట్సప్‌లో పంపించడం జరిగింది. ఎనిమిది అంశాలలో గెలుపొందిన 40 మందికి 75వేల రూపాయల నగదు బహుమతిని అందజేయడం జరిగింది.
సాహితీసవ్రంతి, తెలుగు షార్ట్ ఫిలిం అసోసియేషన్, ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ, సుమధుర కళా నికేతన్, శ్రీశ్రీ సాహిత్య నిధి, నవ్యాంధ్ర రచయితల సంఘం, ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, ఫోరం ఫర్ ఆర్టిస్ట్ సంస్థలు ఈ కార్యక్రమంలో భాగం పంచుకున్నాయి.
సెప్టెంబర్ 21న గురజాడ జయంతితో ప్రారంభించి సెప్టెంబర్ 28 గుర్రం జాషువా జయంతి వరకూ ఈ కార్యక్రమం ఆన్‌లైన్‌లో విజయవంతంగా సాగింది. తొలిరోజు గురజాడ సమకాలీనతపై ప్రజాశక్తి దినపత్రిక సంపాదకులు ఎం.వి.ఎస్. శర్మ ప్రధాన ప్రసంగం చేశారు. రెండవ రోజు కందుకూరి సంస్కరణోద్యమం మీద బెంగుళూరు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కె. ఆశాజ్యోతి, మూడోరోజు గిడుగు రామ్మూర్తి - తెలుగు భాష ఔన్నత్యంపై శాసనమండలి సభ్యులు కె.ఎస్. లక్ష్మణరావు, నాలుగో రోజు వేమన స్ఫూర్తి - భౌతికవాదం పై శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మేడిపల్లి రవికుమార్, ఐదోరోజు కుసుమ ధర్మన్న సాహిత్యంపై ప్రముఖ కవి, విమర్శకులు కోయి కోటేశ్వరరావు, ఆరో రోజు శ్రీశ్రీ కవిత్వంపై సాహిత్య ప్రస్థానం ప్రధాన సంపాదకులు తెలకపల్లి రవి, ఏడో రోజు సి.వి. సాహిత్యంపై ప్రముఖ విమర్శకులు రాచపాళెం చంద్రశేఖర రెడ్డి, చివరి రోజు జాషువా ప్రాసంగికతపై శాసనమండలి సభ్యులు విఠపు బాలసుబ్రహ్మణ్యం ప్రధాన ప్రసంగం చేశారు. ప్రధాన ప్రసంగాలతో పాటు సామాజిక, సాంస్క ృతిక రంగాలలో స్ఫూర్తినిచ్చిన యోధులపై పలువురు ప్రముఖులు ప్రత్యేక ప్రసంగాలు చేశారు. ప్రతీరోజు పోటీలకు వచ్చిన వీడియోలను 5 చొప్పున ఎనిమిది అంశాలకు సంబంధించి మొత్తం 320 వీడియోలను ప్రదర్శించడం జరిగింది. షార్ట్ ఫిలింస్ అత్యధికంగా రావడంతో అదనంగా 40 షార్ట్ ఫిలింస్‌ను ప్రదర్శించారు. ఈ మొత్తం కార్యక్రమంలో యువత, బాలబాలికలు అత్యంత ఉత్సాహంగా పాల్గొనడం నిర్వాహకులకు సంతోషం కలిగించింది. ఆనాటి వైతాళికుల భావాలను, సమాజ ఉన్నతికోసం వారు చేసిన కృషిని నేటి తరానికి అందజేయడానికే ఈ కారక్రమం ఏర్పాటు చేసినట్టు ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేసిన గాదె సుబ్బారెడ్డి తెలిపారు. యు.వి. రామరాజు, నారాయణ, డి.వి.రాజు, హరిప్రసాద్, రంగారెడ్డి, నరేష్ తదితర కార్యకర్తల బృందం కార్యక్రమం విజయవంతం కావడంలో మంచి కృషి చేసారన్నారు. కార్యక్రమ సమీక్షా సమావేశంలో ఎం.బి. విజ్ఞాన కేంద్రం ట్రస్టు కార్యదర్శి పిన్నమనేని మురళి ఈ వైతాళికుల స్ఫూర్తి సంబరాలలో పాల్గొన్న అందరికీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో ఈ అనుభవంతో మరిన్ని కార్యక్రమాలకు రూపకల్పన చేస్తామని తెలిపారు.
వీడియో కవితల పోటీ విజేతలు
సాహితీస్రవంతి - జాషువా సాంస్క ృతిక వేదిక నిర్వహించిన వీడియో కవితల పోటీకి 110 వీడియో కవితలు వచ్చాయి. 40 కవితలను ఎంపిక చేసి వైతాళికుల స్ఫూర్తి సంబరాలలో ప్రతి రోజూ 5 చొప్పున వీడియో కవితలను ప్రసారం చేయడం జరిగింది. ఈ పోటీలో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసకు చెందిన కుప్పిలి వెంకట రాజారావు 'పత్తిపూల పొత్తిళ్లలో..' కవితకు ప్రథమ బహుమతి, కృష్ణా జిల్లా నూజివీడుకు చెందిన శిఖా - ఆకాష్ 'బానిసల స్వర్గం' కవితకు ద్వితీయ బహుమతి, పశ్చిమగోదావరి జిల్లా బయ్యనగూడెంకు చెందిన మెట్టా నాగేశ్వరరావు 'చాకలి పద్యం' కవితకు తృతీయ బహుమతి, విజయవాడకు చెందిన వైష్ణవిశ్రీ 'సముద్రం పోటెత్తుతోంది' కవితకు, తిరుపతికి చెందిన దారల విజయకుమారి 'సామాజిక న్యాయం' కవితలకు ప్రత్యేక బహుమతులు లభించాయి. ప్రముఖ కవులు గంటేడ గౌరునాయుడు, కె. ఆనందాచారి, డా|| రాధేయ లు ఈ వీడియో కవితల పోటీకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.