గుంటూరు బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం నుంచి ఆన్‌లైన్ ద్వారా జాషువా 125వ జయంతి సభ సెప్టెంబర్ 27న జరిగింది. ఈ సందర్భంగా జాషువా కవితా పురస్కారాన్ని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి ఓల్గా, సినీ గేయ రచయిత చంద్రబోస్‌కు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సాహిత్య ప్రస్థానం ప్రధాన సంపాదకులు తెలకపల్లి రవి మాట్లాడుతూ శ్రమ చేసేది ఒకరు, దాన్ని అనుభవించేది మరొకరనే సామ్యవాద సత్యాన్ని జాషువా చాటి చెప్పారన్నారు. తన ప్రతి రచనలో దోపిడీని ప్రశ్నించారని, అణగారిన వర్గాల చైతన్యం కోసం కషి చేశారన్నారు. కరోనా నేపథ్యంలో
ఉపాధి కోల్పోయిన ప్రజలను, కార్మికులను ఆదుకోవడానికి చేతులు రాని కేంద్ర ప్రభుత్వం... కార్పొరేట్లకు, టెలికం కంపెనీలకు రూ.లక్షల కోట్లు రాయితీలు ఇచ్చిందన్నారు. రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను హుటాహుటిన పార్లమెంట్‌లో బలప్రయోగంతో ఆమోదించుకుందని పేర్కొన్నారు.చంద్రబోస్ మాట్లాడుతూ తన రచనల్లో జాషువా సాహిత్య స్ఫూర్తి అంతర్లీనంగా ఎప్పుడూ ఉంటుందని పాటలు పాడి వివరించారు. ఓల్గా మాట్లాడుతూ నేడు సమాజంలో జరుగుతున్న కులవివక్షతను గుర్రం జాషువా స్ఫూర్తితో ఎదుర్కోవాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు మాట్లాడుతూ కోవిడ్ విపత్తులో సభను ఆన్‌లైన్‌లో నిర్వహించామని, అయినా వందల మంది సభలో పాల్గనడం జాషువా సాహిత్యానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియచేస్తోందని అన్నారు. సభలో ఎఎస్‌ఎస్‌ఎన్ కళాశాల తెలుగు విభాగ అసోసియేట్ ప్రొఫెసర్ కాకాని సుధాకర్, జాషువా విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ పాశం రామారావు, కార్యదర్శి ఎన్.కాళిదాసు, సినీనటులు కష్ణేశ్వరరావు మాట్లాడారు.