సమకాలీన సంఘర్షణ 'వికసిత'

   సమకాలీన ప్రపంచీకరణ సంక్షుభిత సమయపు భావ సంఘర్షణలను ప్రతిబింబించిన నవలే వియస్సార్‌ రచించిన నవల 'వికసిత' అని సాహితీస్రవంతి రాష్ట్ర అధ్యక్షులు తెలకపల్లి రవి అన్నారు. సాహితీస్రవంతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ ప్రాంగణంలో డిసెంబర్‌ 22న పుస్తకావిష్కరణ జరిగింది. విశాలాంధ్ర బుక్‌హౌస్‌ మేనేజర్‌ బి. ఈశ్వర్‌రెడ్డి అధ్యక్షత వహించిన ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయిన తెలకపల్లి రవి పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. సాహిత్య ప్రాముఖ్యతను తెలుపుతూ, అది ప్రస్తుత పరిస్థితులకు ఎలా అవసరమో వివరించారు. సమాజం వికారంగా ఉన్నప్పుడు వికాసం కోసం రచయితలు బాధ్యతగా కృషిచేయాలన్నారు. విఎస్సార్‌ కాలమిస్టుగా, జర్నలిస్టుగా సమకాలీన ప్రపంచంలో సంక్షుభిత సమయంలో బాధితుల బాధల్ని కళ్లకు కట్టినట్టు చూపారన్నారు.    దేశ రాజధాని నగరంలో జరిగిన రాక్షసకాండకు వ్యతిరేకంగా అక్కడ నిరసన వెల్లువెత్తుతోంది. ఆ నిరసన గళానికి బలం చేకూరుస్తూ, సామాజిక మార్పునకు సాహిత్యం దోహదం చేసే ప్రక్రియగా ఉంటుందన్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగం విస్తరిస్తోందని, సమాజం మాత్రం సాఫ్ట్‌గా లేదని, అది హార్డ్‌గానే ఉందని అన్నారు. చదువు, సీటు, ఉద్యోగం, ప్రమోషన్‌, స్థిరత్వం, కుటంబం తదితర సమస్యలతో మానసిక వేదనలకు గురై సామాజిక సంక్షోభాల మధ్య, ఇంజనీరింగ్‌ విద్యార్థుల, అధ్యాపకుల మధ్య జరుగుతున్న సంభాషణను వస్తువుగా తీసుకొని సామాజిక పరిస్థితుల గుండా సాగిన కథే ఈ నవల సారమని చెప్పారు. ఇది మరిన్ని నవలలకు స్ఫూర్తిగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ లినిత మాట్లాడుతూ ఈ నవలలోని ఎక్కువ అంశాలు స్వీయానుభవంగా అనిపిస్తాయని అన్నారు. ప్రొఫెసర్‌ ప్రతాప్‌ మాట్లాడుతూ యువతరానికి ఎదురవుతున్న సంఘర్షణలు, ఇందులో నుంచి పుట్టుకొస్తున్న కొత్త ఆలోచనలను ప్రతిబింబించేలా నవల సాగిందన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీస్రవంతి రాష్ట్ర కార్యదర్శి వొరప్రసాద్‌, ప్రజాశక్తి బుక్‌హౌస్‌ మేనేజర్‌ కె. లక్ష్మయ్య, కిరణ్‌ చంద్ర, భువన్‌, సిద్ధార్థ, నవీన్‌, అరుణ, ఆశ తదితరులు పాల్గొన్నారు.