అక్షరాంజలి

  14 డిసెంబర్‌ 2012 నుండి 25 డిసెంబర్‌ 2012 వరకు హైదరాబాద్‌ నెక్లస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో నిర్వహించబడిన 27వ హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌లో ''అక్షరాంజలి'' స్టాల్‌ ఆకట్టుకుంది.     ''రేపటి తరానికి మన సాహిత్యం, సాహిత్యకారులు, వారి జీవిత విశేషాలు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతో వుందని'' పలువురు సందర్శకులు అన్నారు. ఈ ఛాయా చిత్రాలన్నింటిని ఓ పుస్తకంగా  ప్రచురించాలనే తమ ఆకాంక్షను తెలియజేశారు.సాహితీ స్రవంతి ప్రచురణలు, మహాప్రస్థానం, శ్రీశ్రీజయభేరి, కందుకూరి వారి హాస్య సంజీవని, చేగువేరా డైరీ, తెలుగు సామెతలు.. వంటి పుస్తకాలు ఉత్సాహంగా కొనుగోలు చేశారు.     హెరాల్డ్‌ పింటర్‌, జూలియస్‌ ఫ్యూజిక్‌, బ్రెహ్ట్‌, మైఖేల్‌ షోలూకోవ్‌, రోమోరోలా, గోర్కీ, క్రిష్టోఫర్‌ కాడ్విల్‌, ఎర్నెస్ట్‌ హెమింగ్వే, జాన్‌పాల్‌ సార్త్రే, గోగోల్‌లాంటి అంతర్జాతీయ కవులు - వారి రచనలు, వాటి దొరుకు చోటు ఆసక్తిగా అడిగారు. అలాగే మన భారతీయ కవులు, ఠాగూర్‌, ప్రేమ్‌చంద్‌, సుబ్రహ్మణ్యభారతి, కె.వి. అబ్బాస్‌, హరివంశరాయ్‌ బచ్చన్‌ లాంటి వారి చిత్రాలు, వారి రచనలు.. విద్యార్థులు ఉత్సాహంగా నోట్‌ చేసుకొన్నారు.ఇక మన తెలుగు కవుల ఫొటోలు, ఇటీవల కన్నుమూసిన ప్రముఖ సాహితీవేత్తల ఫొటోలు (సెప్టెంబర్‌ ప్రస్థానం పత్రిక ముఖచిత్రం) అడిగి తెలుసుకొని ఆ సంచికను బాగా కొనుగోలు చేశారు. కాపు రాజయ్య, సదాశివ, కొండపల్లి శేషగిరిరావుగార్ల సాహిత్యం, పెయింటింగ్స్‌ అడిగి తెలుసుకున్నారు.    కొప్పరపు కవులు, విశ్వనాథ, అజంతా, శ్రీశ్రీ, శేషేంద్రశర్మ, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి, మధునా పంతుల తిరుపతి కవుల ఫొటోలు పెద్దల్ని విశేషంగా ఆకర్షించాయి. ఫోమ్‌ ల్యామినేషన్‌లో చేసిన ఈ ఛాయాచిత్రాలు ఆకర్షణీయంగా ఉన్నాయని పలువురు అన్నారు. ఇల్లెందుల సరస్వతి, భార్గవీరావు, భానుమతి, వాసిరెడ్డి సీతాదేవి, బండారు అచ్చమాంబ, హేమలతా లవణం లాంటి మహిళా సాహితీమూర్తుల ఫొటోలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి.  ఈ స్టాల్‌ను సాహితీ స్రవంతి బాధ్యులు తంగిరాల చక్రవర్తి నిర్వహించారు.సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో కవి సమ్మేళనం    డిసెంబర్‌ 23న సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల దాకా ''అక్షరం'' శీర్షికన హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ వేదికపై కవి సమ్మేళనం జరిగింది. హైదరాబాద్‌ నగర సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శి జి. యాదగిరిరావు స్వాగతం పలికారు. నగర కమిటీ సభ్యురాలు శాంతిశ్రీ అధ్యక్షత వహించారు. ప్రముఖ కవి యాకూబ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. యువ కవులతో పాటు సీనియర్‌  కవులు, ప్రముఖులతో మరింత పెద్ద స్థాయిలో ఈ జనకవనం నిర్వహించాలని, యువ కవులు బాగా అధ్యయనం చేసి మంచి కవిత్వం రాయాలని యాకూబ్‌ తన ప్రసంగంలో పేర్కొన్నారు. 'అక్షరం'పై స్వీయకవిత చదివారు. కవి సమ్మేళనాన్ని తంగిరాల చక్రవర్తి నిర్వహించారు. 23 మంది కవులు స్వీయ కవితాగానం చేశారు.