కాలానికి కంటే ముందు పయనించిన వ్యక్తి గురజాడ అని వక్తలు కొనియాడారు. సాహితీ స్రవంతి హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో నవంబరు 30న సుదరయ్య విజ్ఞాన కేంద్రంలో 'తెలుగు సాహిత్యం గురజాడ' అనే అంశంపై సదస్సు జనకవనం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న యాళ్ల అచ్యుతరామయ్య మాట్లాడుతూ సమాజం చీదరించుకున్న వ్యక్తులను ఆదరించి, అక్కున చేర్చుకున్న మహాభావుడు గురజాడ అని కొనియాడారు. 150 ఏళ్ల అనంతరమూ ఆయన వాక్యాలను నిత్యజీవితంలో నానుడిగా వాడుతున్నామని ప్రశంసించారు. ప్రముఖ రచయిత చేకూరి రామారావు మాట్లాడుతూ సామాజిక దురాగతాలపై పోరాటమే సాహిత్య లక్ష్యమని, అభ్యుదయ సాహిత్యాన్ని సృజించిన వారు గురజాడ అని వివరించారు. ఈ సందస్సుకు అధ్యక్షత వహించిన సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి వొరప్రసాద్ మాట్లాడుతూ ఆయన ప్రతి రచనలోనూ సామాజిక ప్రయోజనం పుష్కలంగా ఉంటుందన్నారు. నేటి ప్రపంచీకరణ ప్రాబల్యం పెరిగే కొద్దీ ఆయన సందేశాల అవసరమూ పెరుగుతోందని చెప్పారు. అనంతరం జరిగిన జనకవనంలో ప్రజావ్యతిరేక ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై, సామాజిక అంశాలపై వినిపించిన కవితలు సభికులను ఎంతగానో ఆకుటుకున్నాయి. జనకవనాన్ని తంగిరాల చక్రవర్తి నిర్వహించగా సాహితీ స్రవంతి నగర కార్యదర్శి జి. యాదగిరిరావు, ప్రముఖ రచయిత మోతుకూరి నరహరి, శాంతిశ్రీ, వెంకట్, నరేష్, రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.