సామాన్యుల చైతన్యానికి చోదకశక్తి

 

సామాన్యుల చైతన్యానికి చోదకశక్తిగా మువ్వా శ్రీనివాసరావు కవిత్వం ఉపయోగపడుతుందని సాహితీ వేత్తలు అభిప్రాయపడ్డారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో ఫిబ్రవరి 6న కవి సీతారాం అధ్యక్షతన మువ్వా శ్రీనివాసరావు రాసిన సమాంతర ఛాయలు పుస్తకావిష్కరణ సభ జరిగింది. స్థానిక ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ-పుస్తకాన్ని మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం ఆవిష్కరించారు. అనంతరం మువ్వా శ్రీనివాసరావు తన తల్లిదండ్రులైన మువ్వా శ్రీ రంగయ్య, పద్మావతిలకు తొలి ప్రతులను అందజేశారు. పద్యాలు రాయించిన గురువులు గంగాధర్‌రావు, ప్రసాద్‌రావు పులిచర్ల వసంతంను ఈ సందర్భంగా సన్మానించారు. సభలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు తెలకపల్లి రవి మాట్లాడుతూ ఎక్కడ బలమైన ఉద్యమాలుంటాయో అక్కడే బలమైన కవిత్వం కూడా వస్తుందన్నారు. భౌగోళికంగా, రాజకీయంగా ఖమ్మజిల్లా ఉద్యమాల జిల్లా కావడంతో ఈ గడ్డపై బలమైన కవులు, కవిత్వం నిరంతరంగా వస్తుందన్నారు. శ్రీనులో మొదటి నుండి కవిత్వం సమాంతరపాయగా అంతర్లీనంగా వచ్చిందని, అది ఇప్పుడు బయట పడిందని అన్నారు. మున్ముందు మరింత ప్రజా కవిత్వాన్ని తీసుకురావాల్సిన అవసరముందన్నారు. శ్రీశ్రీ ప్రేరణతో కవి కావాలని ఆకాంక్షించిన వ్యక్తి మువ్వా శ్రీనివాసరావు అని తెలుగు విశ్వ విద్యాలయం ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ అన్నారు. కవులను మరిచిపోతున్న కాలంలో, సాహిత్యం అంటే సినిమా పాటలే అనుకునే ఈ రోజుల్లో ఇలాంటి కవిత్వం రావడం గర్వించదగిందన్నారు.మానవ సంబంధాలను కాపాడుకునే ప్రయత్నమే సమాంతర ఛాయలు అన్నారు. రచయిత రావులపాటి సీతారామరావు మాట్లాడుతూ క్రాంతి నుండి కవితలు జాతి జనులు పాడుకునే విధంగా రావాలని ఆకాంక్షించారు. ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ జాతి సిగ్గుపడే విధంగా తయారైన మృగాల గురించి ప్రశ్నించారని, తన అనుభవాలకు అనుభూతులకు అక్షర రూపం ఇచ్చారని అన్నారు. కవి, గాయకుడు జయరాజు మనస్సు పడుతున్న ఇబ్బందులను తన పాట ద్వారా వినిపించారు. గొరటి వెంకన్న మాట్లాడుతూ ఎర్రజెండాను నమ్మిన శ్రీను తన కవిత్వాన్ని అనుభూతితో రాశాడన్నారు. ఎం.ఎల్‌.ఏ తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ మువ్వా శ్రీనివాసరావు ఏ రంగంలో ఉన్నా తనదైన పద్ధతిలో ఆ రంగాలను అధిరోహించారన్నారు. నష్టాలను, కష్టాలను ఎదుర్కొని కవులు ముందుకు పోవాలన్నారు. మాజీ ఎంపీ తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కమ్యూనిస్టు అయిన ప్రతివాడూ మానవతావాది అయి తీరాలన్నారు. ఖమ్మం ఉద్యమాల గడ్డ అని, అందుకే శ్రీను ఉద్యమ సంద్రాయలను తన కవితల ద్వారా చెప్పాడని అన్నారు. ఈ కార్యక్రమంలో లోక్‌సత్తా రాష్ట్ర కార్యదర్శి రవిమారుత్‌, కవులు ఖాదర్‌ మొహియుద్దీన్‌, 10 టీవి సిఇవో అరుణ్‌సాగర్‌, కె. ఆనందాచారి, జి ప్రసేన్‌, యాకూబ్‌, బివివి ప్రసాద్‌, చేకూరి కాశయ్య, తదితరులు పాల్గొన్నారు.