కేంద్ర కార్మిక సంఘాలు తలపెట్టిన దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మెజనం బాధల ఘోష అనీ, అది కార్మికుల సమస్యలపైనే కాదు, దేశ పరిరక్షణ కోసం జరుగుతున్న చారిత్రాత్మక సమ్మెగా చూడాలనీ సాహితీవేత్త ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రాశ్చ్య కళాశాల మాజీ ప్రిన్స్‌పాల్, ఉపాధ్యాయ సంఘం నేత మోతుకూరి నరహరి అన్నారు. ఫిబ్రవరి 18న సాహితీ స్రవంతి హైదరాబాద్ నగర కమిటి ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయాబుల్లాఖాన్ హాలులో జి. నరేష్ అధ్యక్షతన జరిగిన సదస్సులో నరహరి మాట్లాడారు. ప్రజాస్వామిక ప్రేమికులు, పురోగామి సెక్యులర్ శక్తులు, బుద్ధిజీవులుగా ఉన్న కవులు, రచయితలు కళాకారులు, పాలక వర్గ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనను, కవిత, పాట, కథ, నిరసనగళం, తమ కలాల ద్వారా బలమైన అభివ్యక్తితో వినిపించాలని నరహరి అన్నారు. ప్రాచీన కవులైన వ్యాస వాల్మీకుల దగ్గర నుండి గురజాడ, శ్రీశ్రీ, వేమన, దాశరధి, కాళోజి, సుబ్రహ్మణ్య భారతి లాంటి కవులు ప్రజాపక్షం వహించి, అద్భుతమైన కవిత్వం రాసారని, 24 నెలల్లో 18 సార్లు పెట్రోలు, డీజిల్ ఛార్జీలు పెంచిన పాలకులపై ధర్మాగ్రహాన్ని ''కవులు'' ప్రకటించేందుకు ఈ జనఘోష'' జనకవనం ఏర్పాటు అని మోతుకూరి నరహరి తన ప్రసంగంలో పేర్కొన్నారు. నాటి కవుల స్పందనలు, ప్రజాస్వామిక భావజాలంతో పాలక వర్గాల్ని ఎలా పద్యాల్లో, కవితల్లో ఎండ కట్టారో సాహితీ స్రవంతి నగర ఉపాధ్యక్షులు గేరా సారధ్యంలో జరిగిన జనకవనంలో 20 మందికి పైగా కవులు కవితలు వినిపించారు. పి.వి. సుబ్రహ్మణ్యశాస్త్రి దేశభక్తి గీతంతో (మాతెలుగుతల్లికి మల్లెపూదండ) ఆరంభమైన జనకవనంలో తంగెళ్ళపల్లి కనకాచారి, మోపిదేవి రాధాకృష్ణ, ఆచార్య నరేంద్ర, డి. సైదులు, వెంకటి, జి. నరసింహమూర్తి, శిష్ట్లా మాధవి, శాంతిశ్రీ, గేరా, వొరప్రసాద్, తంగిరాల చక్రవర్తి, జి. యాదగిరిరావు, నరేష్, మొదలైనవారు స్వీయకవితలు వినిపించారు. ప్రజాశక్తి బుక్‌హౌస్ మేనేజర్ కె. లక్ష్మయ్య పాల్గొన్న ఈ సభలో సాహితీస్రవంతి హైదరాబాద్ నగరకమిటి కార్యదర్శి జి. యాదగిరి రావు ఈ సభకు స్వాగతం పలుకగా, సంయుక్త కార్యదర్శి తంగిరాల చక్రవర్తి వందన సమర్పణతో సభ ముగిసింది.