అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 21న సాహితీస్రవంతి విజయనగరం ఆధ్వర్యంలో గురజాడ నిలయంలో సాహిత్యసభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు సాహితీస్రవంతి కన్వీనర్ చీకటి దివాకర్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ మానవ సమాజంలో సమూహాలుగా జీవించిన తరుణంలో సామూహిక శ్రమనుండి భావ ప్రకటనా మాధ్యమంగా భాష ఉద్భవించిందని అన్నారు. ప్రతీ భాష ఇతర భాషల నుండి నానుడుల్ని, జాతీయాల్ని, నుడికారాన్ని గ్రహించి నిరంతరం అభివృద్ధి చెందుతుందని అన్నారు. అన్ని భాషలకు సమాన హోదా ప్రభుత్వాలు కల్పించాలని అన్నారు. ప్రపంచ రాజకీయాల ఫలితంగా కొన్ని భాషలు ఆధిపత్య ధోరణి వహించడం జరిగిందని, ఆంగ్లభాష ఆ కోవకు చెందిందని అన్నారు. ఈ సందర్భంగా బాలాజీరావు తెలుగుభాష ఔన్నత్యాన్ని పద్యరూపంలో ఆలపించారు. బద్రి కూర్మారావు తెలుగుభాష చరిత్రను, లిపిలేని భాషల ప్రాధాన్యతను వివరించారు. సాహితీస్రవంతి కార్యకర్త ఎస్.వి.ఆర్. కృష్ణారావు మాట్లాడుతూ తెలుగుభాష ప్రాభవం కోల్పోతున్నదానికి నిదర్శనమైన గణాంకాలను వివరించారు. అనురాధ, మొయిద శ్రీనివాస్, చెళ్ళపల్లి శ్యామల, మానాపురం చంద్రశేఖర్, రెడ్డి శంకరరావు, విజయేశ్వరరావు, ఇల్ల ప్రసన్నలక్ష్మి తదితరులు మాతృభాష ప్రాధాన్యతను చర్చించి, తమ స్వీయ కవితల్ని వినిపించారు. చీకటి చంద్రికారాణి 'అక్షరాలు ఈ అచ్చతెలుగుభాషకు/అఆఇఈలు తొలి నక్షత్రాలు' అంటూ గానం ఆలపించారు. హృషీకేశం, బొంతలకోటి లలిత, ఇనుగంటి జానకి తదితరులు చర్చలో పాల్గొని, తమ కవితలు వినిపించారు.