విజయనగరం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21న మాతృభాషా దినోత్సవం జరిగింది. విజయనగరంలోని గురజాడ నిలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాహితీస్రవంతి రాష్ట్ర కమిటీ సభ్యులు చీకటి దివాకర్ మాట్లాడారు. మానవ సమాజంలో సమూహాలుగా జీవించిన తరుణంలో సామూహికత నుండి భాష ప్రకటనా మాధ్యమంగా భాష ఉద్భవించిందని అన్నారు. ఇతర భాషల సాంగత్యాన్ని తనలో ఇముడ్చుకొని భాష అభివృద్ధి చెందుతుందని, అన్ని భావలకూ సమానహోదా ప్రభుత్వం కల్పించాలని అన్నారు. ప్రపంచ రాజకీయాల ఫలితంగా కొన్ని భాషలు ఆధిపత్య ధోరణి వహించాయని, ఉర్దూ, ఆంగ్ల భాషలు ఆ కోవకు చెందినట్టివని అన్నారు. ఈ సమావేశంలో బాలాజీ మాష్టారు తెలుగు భాష ఔన్నత్యాన్ని పద్యరూపంలో ఆలపించారు. బద్రి కూర్మారావు తెలుగు భాష చరిత్రను మిగిలిన లిపిలేని భాషల ప్రాధాన్యతను వివరించారు. ఎస్.వి.ఆర్. కృష్ణారావు ప్రాభవం కోల్పోతున్న తెలుగుభాష స్థితిని గణాంకాలతో వివరించారు. శ్రీమతి అనురాధ, మొయిద శ్రీనివాసరావు, చెళ్ళపిళ్ళ శ్యామల, ఇనుగంటి జానకి, మానాపురం రాజాచంద్రశేఖర్, రెడ్డి శంకర్రావు, విజయేశ్వరరావు తదితరులు కవితలు చదివి మాతృభాషా చర్చలో పాల్గొన్నారు. చీకటి చంద్రికారాణి 'అక్షరాలు 5/ ఈ అచ్చ తెలుగు భాషకు/ అ, ఆ, ఇ, ఈలు తొలినక్షత్రాలు'' అంటూ పాడిన పాట అలరించింది. హృషీకేశ్, బొంతలకోటి లలిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విజయనగరంలో మాతృభాషా దినోత్సవం
- ఇల్ల ప్రసన్నలక్ష్మి