కన్నడ అనువాదం ఆవిష్కరణ
శ్రీకృష్ణదేవరాయ రసజ్ఞసమాఖ్య, తెలుగు సాంస్కృతిక సమితి, సంయుక్త ఆధ్వర్యంలో మార్చి10న బెంగుళూరులో రుస్తుమ్‌చౌక్సీ హాలులో డా. అద్దేపల్లి రామమోహనరావు 'పొగచూరిన ఆకాశం' కవితా సంపుటికి, ఆచార్య శ్రీమతి డా. అణ్ణమ్మ చేసిన కన్నడ అనువాద గ్రంథం 'హెగెముసుకిద ఆకాశ' ఆవిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డా. తంగిరాల సుబ్బారావు మాట్లాడుతూ కవిత్వాన్ని సామాజిక చైతన్యంతో, సిద్ధాంత బలంతో రాస్తున్న కవి, విశ్లేషణాత్మక విమర్శకుడు అని అద్దేపల్లి రచనా పరిణామాన్ని వివరించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన డా. శాంతమ్మ మాట్లాడుతూ సామాజిక ప్రయోజనం గల కావ్యాల్లో ఉత్తమమైన 'పొగచూరిన ఆకాశం' కన్నడంలోకి అనువాదం కావడం చాలా అనందకరమని అన్నారు. అనువాదకురాలు బెంగుళూరు విశ్వవిద్యాలయ ఆచార్య శ్రీమతి డా. అణ్ణమ్మ కన్నడంలో ప్రసంగించారు. ఈ కవితాసంపుటి సమకాలీన ఆవేదనను గొప్ప భావచిత్రాలతో, కొత్త ప్రతీకలను ఆవిష్కరిస్తుందనీ, సాంస్కృతిక పతనంలోని ప్రతి అంశాన్నీ సూక్ష్మపరిశీలనతో రాసిన కవిత్వమనీ ప్రశంసించారు. డా. అంజనప్ప మాట్లాడుతూ 'అంబేద్కర్ మొదలుపెట్టిన వాక్యాన్ని పూర్తిచేద్దాం' అనే కవితను విశ్లేషించారు. 'మ్యూజ్‌ఇండియా' వెబ్‌పత్రిక సంపాదకురాలు శ్రీమతి అంబికా అనంత్ 'పొగచూరిన ఆకాశం' పుస్తకాన్ని ఆంగ్లంలోకి అనువదించిన రమణశొంఠి 'ఐ నీడ్ ఎ లెటర్ అండ్ అదర్ పోయెమ్స్' పుస్తకాన్ని విశ్లేషించారు. కవి, ప్రయోక్త వి.యస్.ఆర్.యస్. సోమయాజులు మాట్లాడుతూ ఈ కవితాసంపుటి ప్రపంచీకరణ వల్ల కోల్పోతున్న దేశ అస్తిత్వాన్ని ప్రతిభావంతంగా నిరూపిస్తుందని అన్నారు. కవి యస్.ఆర్. పృధ్వీ మాట్లాడుతూ నిరంతర కవితాచైతన్యంతో, భావనిబద్ధతతో ముందుకు సాగుతున్న అసాధారణ కవి అద్దేపల్లి అన్నారు. అందువల్లనే& ఈ కవితాసంపుటికి ప్రతిష్టాత్మక అంతర్రాష్ట్ర పురస్కారమైన 'చిన్నప్పభారతి' అవార్డు లభించిందని తెలిపారు. కవి శ్రీకాలనాధభట్ల వెంకట్రామశాస్త్రి, అద్దేపల్లిపై రాసిన కవిత చదివి ప్రశంసలు అందుకున్నారు. చివరలో అద్దేపల్లి స్పందిస్తూ ఈ ఆవిష్కరణ సభ తనకు జరిగిన అపూర్వ సత్కారమని అన్నారు.