మధునాపంతుల సత్యనారాయణశాస్త్ర్రి 'ఆంధ్రా రచయితలు' పరిచయసభ

    సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో, ఏప్రిల్‌ 7న కాకినాడ, బ్రహ్మసమాజ మందిరంలో, మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి 'ఆంధ్ర రచయితలు' పునర్ముద్రిత గ్రంథం పరిచయసభ జరిగింది. సభకు అధ్యక్షత వహించిన ప్రసిద్ధ కవి, విమర్శకులు, డా. అద్దేపల్లి రామమోహన్‌రావు మాట్లాడుతూ, ''ఆంధ్ర రచయితలు గ్రంథం, ఈ తరం వారికి అత్యంత ఉపయోగకరమనీ, 20వ శతాబ్ధి ప్రథమార్థంలో అనేక ధోరణులకు మార్గ దర్శకులైన గొప్పకవుల, విమర్శకుల, గూర్చి విలువైన అంశాలపై అవగాహన కలిగిస్తుందని చెప్పారు. గురజాడ, చెళ్ళపిళ్ళ మొదలైన వారి నుండి ఆరుద్ర, దాశరధి, గుంటూరు శేషేంద్ర శర్మ వరకు, వారి వారి వ్యక్తిత్వ, రచనాతత్వాల్ని గూర్చి ముఖ్యమైన వివరాల్ని, 'ఆంధ్ర రచయితలు'లో మధునా పంతుల వారు అందించారనీ, చాలా ఆసక్తికరమైన సులభ గ్రాంథిక శైలి అనుసరించారనీ అన్నారు. సత్యనారాయణశాస్త్రి గారి తమ్ముని కుమారులు సత్యనారాయణమూర్తి, ఇతర కుటుంబ సభ్యులు ఈ గ్రంథాన్ని పునర్ముద్రించారు. సత్యనారాయణ మూర్తి ప్రధానవక్తగా పాల్గొని, సత్యనారాయణ శాస్త్రి  జీవిత రచనా నేపథ్యాలకు గురించి రాస్తూ ఐ. పోలవరంలో జన్మించి, పల్లిపాలెంలో 'ఆంధ్రీ కుటీరం' స్థాపించి, 'ఆంధ్రి' పత్రికను రెండేళ్ళపాటు నడిపారనీ, ఆప్రతులన్నీ ఒక సంపుటంగా ముద్రించే ప్రయత్నంలో ఉన్నామనీ చెప్పారు. అద్దేపల్లి, పల్లిపాలెం వెళ్ళినప్పుడు, మధునాపంతులవారు 'ఇది అద్దేపల్లిపాలెం' అని చమత్కరించారని చెప్తూ, వారి హాస్యోక్తులు కొన్ని ఉటంకించి, సభ్యుల్ని అలరించారు. ప్రముఖ కథకులు గ.నా.రా, దాట్ల దేవదానం రాజు కూడా ప్రసంగించారు.