ఉగాది అంటే విప్లవమని, మార్పునకు సంకేతమని కవి, విమర్శకుడు సుధామ అన్నారు. సాహితీస్రవంతి హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఏప్రిల్ 10న సుందరయ్య విజ్ఞానకేంద్రంలో చిట్యాల ఐలమ్మ హాలులో ఉగాది జనకవనం లో ముఖ్య అతిథిగా పాల్గొని సుధామ ప్రసంగించారు. గతం నుండి ఉగాది సందర్భాన్ని పురస్కరించుకుని సమ్మేళనాలు జరిగాయని, వీటిలో శ్రీశ్రీ, ఆరుద్ర, అనిశెట్టి తదితర కవులు, రచయితలు వీటిలో పాల్గొనేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. నాటి కవుల రచనలను పరికిస్తే ఉగాదిలో చైతన్యస్ఫూర్తిని పట్టుకున్నారని అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో కాలుష్యపు కోరల్లో ఆయుపరిణామాన్ని కుదించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వేపచెట్టు పేటెంట్‌తో భవిష్యత్ తరాలు గూగుల్ వెబ్‌సైట్‌లో చూసి తరించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ప్రకృతిని సంరక్షించే స్థితిలో మనం లేమన్నారు. 1966లో శ్రీశ్రీ రాసిన ఉగాది దేవరా అన్న కవితలో నేటి పరిస్థితులు సాక్షాత్కరిస్తున్నాయన్నారు. అందుకే కవి దిశానిర్దేశం చేయగలడన్నారు. నేటి ఉగాదిని పురస్కరించుకుని విద్యుత్, విధ్వంసం, అవినీతి, నీరు వంటి అంశాలను కవితా వస్తువులుగా చేసుకోవాలన్నారు. చివరగా ఉగాదిపై తాను రాసిన కవిత చదివి వినిపించారు. ఈ కార్యక్రమానికి సాహితీస్రవంతి నగర కమిటీ సంయుక్త కార్యదర్శి తంగిరాల చక్రవర్తి అధ్యక్షత వహించారు. ఎ. మోహనకృష్ణ నిర్వాహణలో జనకవనం జరిగింది. నేడు విద్యుత్ లేక పల్లెలు గొల్లుమంటున్నాయంటూ 'నవ వసంతం' కవితను కందుకూరి రాజ్యలక్ష్మి చదివారు. బాంబు పేలుళ్ళు అంశంపై ఎస్. విజయలక్ష్మి కవిత చదివారు. మౌనశ్రీ మల్లిక్ 'మట్టి, చెట్టు, మనిషి' అని చదివిన కవిత అందరినీ ఆకట్టుకుంది. రత్నామహీధర్, సాహిత్యప్రకాశ్, శాంతిశ్రీ, కర్లపాలెం భాస్కరరావు, జి. యాదగిరి రావు, సైదులు, నరసింహారావు, వెంకటి, సుతారపు వెంకటనారాయణ, జంకె కృష్ణారెడ్డి, ఆచార్య నరేంద్ర, కేతవరపు రాజ్యశ్రీ, కె. రాధాకృష్ణ, ఆలువాల సురేష్, కొండపల్లి నీహారిణి, శిష్ట్లా మాధవి, చిత్తలూరి సత్యనారాయణ, కె. విల్సన్ రావు, డి. సైదులు, టి.వి భాస్కరాచార్య, మోపిదేవి రాధాకృష్ణ, ఆళహరి హనుమంతరావు, బొ.పా.రా, బిక్షపతి, (10టీవి) జి.ఎస్. రామకృష్ణ, వొరప్రసాద్ తదితర కవులు 44 మంది తమ కవితలను వినిపించారు. గేరా వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.