విజయనగరం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో ఏప్రిల్ 10న విజయనగరంలోని గురజాడ స్వగృహంలో ఉగాది కవిగాయక సమ్మేళనం జరిగింది.వయోభేదం లేకుండా యాభైకి పైగా కవులు, కవయిత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోరుగుంట్ల రాజశేఖర్, రావాడ శ్యామల సంయుక్తంగా కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. వసంతఋతువు ఆగమనంతో ఉగాది ఆవేశిస్తుందని, ప్రకృతి అంతా పచ్చదనంతో చిగురుతొడిగి కళకళలాడుతూ శోభిల్లుతుందని కవులు తమ కవితల ద్వారా విన్పించారు. కవి రెడ్డి రామకృష్ణ వినూత్న రీతిలో ఆధునిక పంచాంగం వినిపించారు. ఉగాది పచ్చడి షడ్రుచుల కలయికయితే, మానవ జీవితం సుఖదుఃఖాల కలయికని ఇదే ఉగాది పరమార్థమని ఆయన తన పంచాంగ శ్రవణం ప్రారంభించారు. వార్షిక వాతావరణం, వ్యవసాయం, ఆర్థిక వ్యవహారాలు నాటి శాస్త్ర విజ్ఞాన ప్రతీకలుగా చెపుతారని, నాటి కాలంలో మానవసమాజంపైన, ఉత్పత్తిపైన ప్రకృతిదే ప్రధాన ప్రభావమని తెలిపారు. నేడు మానవ విజ్ఞానం పెరిగిందని, ఉత్పత్తి సంపద పెరిగిందని తద్వారా రాజ్యాంగ వ్యవస్థ బలపడిందన్నారు. కాని పాలకుల విధానాలే నేటి విధి రాతలుగా అభివర్ణించారు. ప్రజలు ఆర్థిక మాంద్యంలో సర్వత్రా ఆందోళన చెందుతున్నారని, వ్యవసాయానికి సాయం లేక ఫ్యూచర్ ఫార్వర్డ్ ట్రేడింగ్‌తో క్రాపు హాలిడేలు వచ్చాయన్నారు. ఉద్యోగాలు మూరెడని, నిరుద్యోగాలు బారెడని, ఉప్పైనా, పప్పైనా మంటేనని, కూరలతోనూ గాయాలేనని అన్నారు. విద్య, వైద్యం అందనంత ఎత్తులో ఉన్నాయని, గాలి, నీరు, కరెంటు, రెంటు ప్రియమేనని, సర్కారీ పన్నులు గన్నులేనని, చిల్లర వ్యాపారానికి చిల్లులని, ఉద్యోగుల ఫించనుకు ఉరి, మబ్బుల చాటున మహిళా బిల్లు, మద్యానికి మంచి గిరాకీ తదితర అంశాలతో చదివిన ఆధునిక పంచాంగం శ్రోతలను ఆకట్టుకుంది.
ప్రపంచీకరణ సృష్టించే విధ్వంసం,, దాని వికృతరూపాన్ని, మనకు కాకుండాపోతున్న పల్లెలు, ప్రకృతి వనరులు, ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్న మానవసంబంధాలు, కార్పోరేటీకరణ చెందుతున్న విద్య, వైద్యం, వ్యవసాయం, అగ్రదేశాల కబంధహస్తాల్లో నలిగిపోతున్న తృతీయ ప్రపంచదేశాలు, ప్రజా నిరసనలు, ఉద్యోమాలు తదితర అంశాలతో కవులు చదివిన కవితలు సభలో ఉత్తేజం నింపాయి. ఈ కవి సమ్మేళనంలో రెడ్డి శంకర్రావు, చెళ్ళపిళ్ళ శ్యామల, ఇనుగంటి జానకి, ఇనుపకుర్తి సత్యనారాయణ, మానాపురం రాజాచంద్రశేఖర్, బాలసుధాకర్ మౌళి, పి.ఎస్. శ్రీనివాస్ తదితరులు కవితలు చదివారు. చంద్రిక పాడిన పాటలు అందరినీ అలరించాయి. ఆదిలక్ష్మి వందన సమర్పణతో కవిగాయక సమ్మేళనం ముగిసింది.
ఏప్రిల్ 11న సాయికృష్ణ ఎన్‌క్లేవ్ (బడంగ్ పేట)లో ఉగాది కవి సమ్మేళనంలో అధ్యక్షోపన్యాసం చేస్తున్న తంగిరాల చక్రవర్తి వేదిక పై బడంగ్ పేట సర్పంచ్ కృష్ణారెడ్డి, గోపాలకృష్ణ, గజవెల్లి దశరథ రామయ్య, బాల్‌రాజ్ మాజీ.ఎం.పి.టి.సి, సినీ కవి మౌనశ్రీమల్లిక్
మల్లిపురం జగదీష్‌కు సుబ్బరావమ్మ గోపాలస్వామి ఫౌండేషన్ కథా పురస్కారాన్ని అందిస్తున్న వ్యవస్థాపకులు పి. శ్రీనివాస్ గౌడ్. చిత్రంలో వడలి రాధాకృష్ణ, బి. హనుమారెడ్డి, డా. వి.ఆర్. రాసాని, నూకతోటి రవికుమార్, కె.వి. రమణారెడ్డి ఉన్నారు.