ఖమ్మంలో ఉగాది కవి సమ్మేళనం

  ఏప్రిల్‌ 13న ఖమ్మం సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో మంచికంటి భవన్‌లో సాదనాల వెంకటస్వామి నాయుడు అధ్యక్షతన ఉగాది కవి సమ్మేళనం జరిగింది. కందాడై శ్రీనివాసులు బోడేపూడి విజ్ఞానకేంద్ర డిప్యూటి జనరల్‌ మేనేజర్‌ తన కవిత 'అజ్యం పోద్దామనే' కవితతో సామాన్యుని కోపాగ్నికి కవితల ఆజ్యం పోదాం ఉద్యమాల ఉధృతిని యిబ్బడి ముబ్బడి చేదాం పీడిత తాడిత ప్రజలకు 'విజయం' చేకూర్చుదాం!'' అంటూ ప్రారంభం చేసారు. ''ఎప్పుడు పడతి బతుకున కన్నీటి వెతలు మాయమౌనో నాడే యుగాది'' అన్నారు టి. రాధ.'' నువ్వు పుట్టిన మట్టి, పెంచిన చెట్టు, పెరిగిన ప్రకృతి ఆఖరికి వూరు నీది కాదన్నారు'' డా| గిరినరసింహారావు''. అపజయాలు అనుభవమెట్లు చేసి, విజయ శిఖరాలు చేరాల్సిందే''' అంటూ ఆశించారు కొత్తా శంకరరెడ్డి. ''భానుడితో పాటు కలలుదయిస్తూనే వున్నాయి, గమ్యానికి ఆమడ దూరంలో అస్తమిస్తూనే వున్నాయ్‌'' అన్నారు నవ వసంత వెలుగు అనే కవితలో జిల్లా నరేష్‌.'' విలపించకు కలం పాళీ - కంప్యూటర్‌ యుగంలో నిన్ను చేస్తున్నారు ఎగతాళి'' అని వాపోయారు హలవత్‌ సీత్లా. ''సిక్స్‌ ఐటంస్‌ మిక్స్‌ డ్‌ జ్యూస్‌'' అనే వ్యంగ్య హాస్య కవితతో అందరిని అలరించారు కవి, గాయకుడు కన్నెగంటి వెంకటయ్య. ''రేపటి ఆశాకిరణంగా స్వాగతిద్దాం, సాదరంగా, విజయ నామ వసంతోదయానికి వినయంగా, వినమ్రంగా'' అని తన నాంది అనే కవితలో సునంద. ''వాడి ఆగమనానికి మంగీకార నగారా మోగింది, పచ్చని జీవన పచ్చికలో దుమ్ము సుడులు తిరుగుతోందని ''హెచ్చరికలు చేసారు ఆధారం చేజారిపోతున్న క్షణాన అనే కవితలో పోతగాని సత్యనారాయణ, రక్త నగరం' అనే కవితలో'' అల్లాఫో అక్బర్‌ అవాక్కయి, గుడి గంటలు గుండె బాదుకుని, చర్చిలో కుర్చీలు కొన్ని ప్రార్థనలు'' చేస్తున్నాయని విస్తుపోయారు గరికిపాటి మణీందర్‌. ''విద్యుత్‌ సంక్షోభం, అధిక ధరల పరుగుల ''ప్రస్థావనతెస్తూ'' నేనెందుకు కవిత రాయాలి' అనే కవితలో ప్రశ్నించారు. ''ఈ కొత్త సంవత్సరంలో నైనా, కలసి మెలసి వుండాలి, కల్లోలాలు తగ్గాలి, స్వార్థం తగ్గి పరోపకారం పురోగమించాలనీ'' శేషగిరి ఆశించారు. ''మూలిగే నక్క మీద తాటి పండు!'' అనే కవితలో ''ఈ పండక్కైనా పిండాకూడు పెడతావా''  అడుక్కునేవాడికీ లోకువయ్యాను! బతుకిట్టా తగలడిందేం'' అంటూ ఆగ్రహం, వెలుబుచ్చారు కపిల రాంకుమార్‌. కె. ఆనందాచారి 'సూరీడా ఒరిగిపోకు' అనే కవితలో ఓ నా చదువు కోసం బడికెళ్ళే పిల్లలారా!, నీళ్ళు లేకుండానే పంటలు పండె పరిశోధన చేయండర్రా! కరెంటు లేకుండానే నడిచే ఫ్యాక్టరీలు కనిపెట్టండర్రా లేదంటే ఉత్తుత్తి వాగ్దానాలిచ్చే నాయకులుండే ప్రభుత్వాలు లేకుండా చేయండర్రా'' అంటు తన కవితలో వేడుకున్నారు., సాదనాల వెంకటస్వామి నాయుడు, డా|| మాధురి, రౌతు రవి, డా|| కావూరి పాపయ్య శాస్త్రి, డా|| పి.వి. సుబ్బారావు, తదితరులు కవితలు వినిపించారు. బోడేపూడి విజ్ఞాన కేంద్రం సభ్యులు వి.డిి.ఎం.వి. ప్రసాద్‌ తన ఉద్యోగ ధర్మంలోని వ్యవహార పదాలతో చిన్న కవిత మొదటిసారి వినిపించి అందరిని ఆశ్చర్య చకితుల్ని చేశారు. లెనిన్‌ శ్రీనివాస్‌, తాళ్ళూరి లక్ష్మి, పలువురు కొత్త కవులతో చక్కటి సాహితీ వాతావరణం ఏర్పడిందని పలువురు అభిప్రాయబడ్డారు. రిటైర్డ్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, బి.వి.కె. విద్యార్థులు, స్థానిక ప్రజాసంఘాల నాయకులు, సాహితీ అభిమానులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో జరిగిన చక్కటి కవి సమ్మేళనం అని హాజరైన వారు ప్రశంసించటం గమనార్హం. బోడేపూడి విజ్ఞానకేంద్రం డిప్యూటి జనరల్‌ మేనేజర్‌ కందాడై శ్రీనివాసులు ఉగాది పచ్చడి, పులిహూర, చక్కెర పొంగలి, తేనీటితో అతిథ్యం అందచేసారు.
కపిల రాంకుమార్‌