ప్రజాస్వామ్య పరిరక్షణ అంటు నేతలు పలికే పలుకులు ప్రగల్భాలేనని, కాని ప్రజాస్వామ్యంలో అసలుసిసలైన ప్రజాస్వామ్యవాది సమసమాజ స్వాప్నికుడు పుచ్చలపల్లి సుందరయ్యేనని వక్తలు అభిప్రాయపడ్డారు. కర్నూలు నగరంలో ఏప్రిల్ 21న ఉదయం కార్మిక, కర్షక భవన్‌లో ప్రజా ఉద్యమ నిర్మాత, ఆదర్శ పార్లమెంటేరియన్ మహా నాయకుడు, స్వతంత్య్ర భారతదేశంలో మొదటి ప్రతిపక్షనేత సుందరయ్య శతజయంతి ఉత్సవాల్లో భాగంగా సాహితీ స్రవంతి యుటిఎఫ్ జిల్లా కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో వర్తమాన అంశాలపై కవితా గోష్ఠి నిర్వహించడమైనది. కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి సురేష్ కుమార్ వ్యవహరించగా కవితా గోష్ఠి సమన్వయకర్తగా సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి కెంగార మోహన్ వ్యవహరించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ కథ, నవల రచయిత ఎస్.డి.వి. అజీజ్ పాల్గొనగా వక్తలుగా సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి, యుటిఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎన్. నరసింహులు సాహితీ స్రవంతి నంద్యాల డివిజన్ కార్యదర్శి మాదాల శ్రీనివాసులు మాట్లాడారు. ఎస్.డి.వి. అజీజ్ మాట్లాడుతూ సామాజిక స్పృహ కలిగిన కవిత్వం ప్రజల్ని నడిపిస్తుందని కవులు సమకాలీన సమస్యలను ఆకళింపు చేసుకొని రచనలు చేయాలన్నారు. సురేష్ కుమార్ మాట్లాడుతూ సుందరయ్య శతజయంతి ఉత్సవాల్లో భాగంగా కవితా గోష్టి నిర్వహించడం ఆనందంగా ఉందని సుందరయ్య త్యాగాలను యువతరానికి అందించాల్సిన అవసరం ఉందన్నారు. కెంగార మోహన్ మాట్లాడుతూ ప్రజల జీవనంతో తన జీవితాన్ని మమేకం చేసుకొని ప్రజా ప్రగతే ధ్యేయంగా కడవరకు ప్రజా సంక్షేమం కోసం పరితపించిన సోషలిస్టు శ్రామికుడు సుందరయ్యని అన్నారు. సుందరయ్య ఆశయాలను ఈనాటి తరం ముఖ్యంగా యువతరం ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత ఉందన్నారు. మాదాల శ్రీనివాసులు మాట్లాడుతూ దేశానికి, దేశ ప్రగతికి సుందరయ్య చేసిన సూచనలు, ప్రణాళికలు అమూల్యమైనవని నేటి ఆర్థిక విధానాలను ఆనాడే గమనించి వ్యతిరేకించిన గొప్ప దూరదృష్టి కలిగిన వ్యక్తి సుందరయ్య అన్నారు. జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ సుందరయ్య శతజయంతి ఉత్సవాలను ఆదోని, నంద్యాల డివిజన్ కేంద్రాలలో నిర్వహిస్తామని అన్నారు. అనంతరం నిర్వహించిన కవితా గోష్టిలో నంద్యాల, డోన్, కర్నూలు, ఆదోని ప్రాంతాలకు చెందిన కవులు సామాజిక అంశాలపై కవితలు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు ప్రతాప్, జయరాజ్, నాగరాజ్, రఫీ, సాహితీ స్రవంతి జిల్లా నాయకులు షఫీ, మహేష్, యు. ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు.
కెంగార మోహన్