కమ్యూనిస్టు యోధుడు, మహానేత పుచ్చలపల్లి సుందరయ్య శతజయంతి ఉత్సవాల ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మే 19న నిర్వహించిన 'జనకవనం' స్ఫూర్తిదాయకంగా సాగింది. నాలుగు పుస్తకాల ఆవిష్కరణలు, మధ్యలో ప్రముఖుల ఆత్మీయ సందేశాలూ, ఔత్సాహిక కవులకు మార్గనిర్దేశనాలతో వైవిధ్య భరితంగా, ప్రయోజనకరంగా నడిచింది. వివిధ జిల్లాల నుంచి హాజరైన కవులు సమకాలీన సమస్యలపై అక్షరాస్త్రాలు సంధించి, సుందరయ్య స్మృతికి ఘన నివాళులు అర్పించారు. పలువురు సాహితీవేత్తలు ఈ సందర్భంగా మాట్లాడుతూ- సాహిత్యానికి, సమాజానికి ఉన్న సంబంధం గురించి, నేడు సమాజంలో లుప్తమవుతున్న విలువల గురించి వివరించారు. మానవీయ విలువలను విధ్వంసం చేస్తున్న మార్కెట్ శక్తులపైనా, విశాల ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న ప్రపంచీకరణపైనా కవులూ, రచయితలూ మరింత సమర్థవంతంగా, సమరశీలంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సుందరయ్య పోరాట స్ఫూర్తిని, ఆదర్శనీయమైన జీవన విధానాన్ని సాహిత్యకారులూ అలవర్చుకోవల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఆదర్శమూర్తికి అక్షర నివాళి
తొలుత ఈ జనకవనం ఏర్పాటైన ప్రత్యేక సందర్భం గురించి సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యకక్షులు, ఈ కార్యక్రమ సమన్వయకర్త తెలకపల్లి రవి వివరించారు. 'సద్గుణములెల్ల సంగములై వచ్చి... అన్న పోతనామాత్యుడి అక్షరాలకు అచ్చు పోసినట్టు సరిపోయే ఆదర్శమూర్తి పుచ్చలపల్లి సుందరయ్య. ఆ మహానీయుడి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని - దేశవ్యాప్తంగా ఏడాది పాటు వివిధ రూపాల్లో విస్తృతంగా, విస్తారంగా సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. దేశ సమకాలీన సమస్యలపైనా, పరిష్కార మార్గాలపైనా మేధోమథనాలూ జరిగాయి. ఉత్సవాల ముగింపులో భాగంగా సాహితీ స్రవంతి, సుందరయ్య విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా ఈ జనకవనాన్ని ఏర్పాటు చేశాయి'. అని చెప్పారు. ''సుందరయ్య సమాజ అభ్యున్నతి కోసం అహర్నిశలూ కృషి చేసిన ఆచరణశీలి. గొప్ప సిద్ధాంతాన్ని ఆచరించి, మహోన్నతంగా రూపుదిద్దుకున్న మహా మనీషి. సమాజ పురోగమనంలో సాహిత్య కళారంగాల పాత్ర గణనీయంగా ఉంటుందని గుర్తించి, తెలుగు గీతాల పోటీ నిర్వహించిన దార్శనికుడు. సుందరయ్య ప్రత్యేక కృషి కారణంగా 'పాడరా, ఓ తెలుగువాడా', 'చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా' వంటి ప్రఖ్యాత గీతాలు ఆవిర్భవించాయి. 'తెలుగు భాష అభివృద్ధి పట్ల, భాషా విధానం పట్లా స్పష్టమైన అవగాహనతో సుందరయ్య కృషి చేశారు. తెలుగు భాషా సాంస్కృతిక రంగాల్లో గొప్ప ప్రభావం చూపించారు.' అని వివరించారు. 'కవులూ రచయితలూ స్పష్టమైన సామాజిక అవగాహనతో అనువర్తించటమే సుందరయ్య ఆశయాలకు కొనసాగింపు. అలాంటి కవితలను పఠించి, కర్తవ్యాలను తలకెత్తుకోవటానికి ఈ జనకవనం ఏర్పాటు చేశాం'. అని పేర్కొన్నారు.
మాటలూ.. కవితలూ...
జనకవనాన్ని ప్రముఖ కవి కె. శివారెడ్డి ప్రారంభించారు. వ్యక్తిత్వాలు విధ్వంసమై, ద్వంద్వ స్వభావాలు విరాజిల్లుతున్న నేటి పరిస్థితుల్లో సుందరయ్య ఆశయం, ఆదర్శనీయ వ్యక్తిత్వం అందరికీ అనుసరణీయమని అన్నారు. ఈ దేశపు సాహిత్య, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో కమ్యూనిస్టులు గణనీయమైన, గొప్పదైన ప్రభావాన్ని చూపారని అన్నారు. అణగారిన తరగతులూ మహిళలూ ఒక ప్రవాహంలో కలగలిపి నడిపించటంలో వారి పాత్ర మహత్తరమైనదని అన్నారు. 'నేను నేరుగా సుందరయ్యను చూడలేదు. ఆయన మాటలు వినలేదు. చూడకుండానే, వినకుండానే అలాంటి అనుభవం ఇచ్చినవాడు గొప్పవాడు. సుందరయ్య అలాంటివాడు. ఆయన శత జయంతి సందర్భంలో ప్రతి ఒక్కరూ అత్మ విమర్శ చేసుకోవటం అవసరం'. అని అన్నారు. తరువాత - 'మాట కూడా మనిషే..' అన్న కవిత వినిపించి జనకవనానికి శ్రీకారం చుట్టారు.
కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, సాహిత్యవేత్తలు నిఖిలేశ్వర్, ద్వానా శాస్త్రి, సుధామ తమ సందేశాలు వినిపించారు. 'సుందరయ్య మీది అభిమానంతోనే నేను వరంగల్ నుంచి ప్రత్యేకంగా వచ్చాను. కమ్యూనిస్టు ఎలా ఉండాలి? అంటే- ఇలా ఉండాలి అని చూపగలిగిన ఆదర్శమూర్తి ఆయన. నేడు ప్రతి ఒక్కరూ అలాంటి లక్షణాలను అలవర్చుకోవడం చాలా అవసరం'. అని అంపశయ్య నవీన్ అన్నారు. 'కమ్యూనిస్టుగా ఉన్న వ్యక్తి సాహిత్యాన్ని, రాజకీయాన్ని సమన్వయం చేయాలి. సుందరయ్య ఆ పనిని విజయవంతంగా చేశారు. వివిధ సందర్భాల్లో ఆయన రాసిన సాహిత్య విమర్శలు, ఆ రంగంలో చేసిన కృషీ గొప్ప ఆదర్శవంతమైనవి.' అని నిఖిలేశ్వర్ పేర్కొన్నారు. భవిష్యత్తుపై గొప్ప ఆశా దృక్పథాన్ని పెంపొందిస్తూ- 'యుగస్వరం' అనే కవిత చదివి వినిపించారు. ద్వానా శాస్త్రి మాట్లాడుతూ- 'కవిని కన్న తల్లి కడుపు ధన్యంబు.' అన్న జాషువా పద్యోక్తిని ఉటంకించారు. 'నేడు కవిత్వం చాలా వస్తోంది. రాజకీయ కవిత్వం తగినంత రావటం లేదు. దానిపై కవులు దృష్టి కేంద్రీకరించాలి.' అని సూచించారు. సుధామ మాట్లాడుతూ, అలగానిపాడులో జన్మించిన సుందరయ్య అలవిగాని పాడు వ్యవస్థపై అనితర సాధ్యమైన పోరాటం చేశారని ప్రస్తుతించారు. 'సుందరయ్యను చూస్తేనే అప్పట్లో చాలామంది పాలక పెద్దలకు భయం. అంత నికరమైన, నిక్కచ్చి మనిషి ఆయన. చట్ట సభల్లో సూటిగా, సూత్రబద్ధంగా, వివరాలతో సహా మాట్లాడి, విపక్ష నేతలను సైతం ఆకట్టుకునేవారు. 1982లో ఆయన రేడియో ప్రసంగాన్ని రికార్డు చేసే అవకాశమూ, అదృష్టమూ నాకు దక్కాయి.' అని చెప్పారు. అప్పట్లో ఆయన సుందరయ్యపై రాసిన కవిత 'జీవనధార స్మృ తి' కవితను చదివి వినిపించారు.
జన యోధుడికి కవన నీరాజనం
అలరించిన జనకవనం
తరువాత- వివిధ జిల్లాల నుంచి వచ్చిన సుమారు 65 మంది కవులు తమ కవితలు చదివి వినిపించారు. లబ్ధప్రతిష్టులైన కవులతో పాటు 17 ఏళ్ల రౌతు కడలి (ఖమ్మం), 11 ఏళ్ల హాష్మిబాబు (హైదరాబాద్) వంటి వారూ కవితలు వినిపించటం జనకవనం స్ఫూర్తికి నిదర్శనం. సుందరయ్య ఆదర్శాన్ని, వ్యక్తిత్వాన్నీ ప్రస్తుతిస్తూ అనేకమంది కవులు అక్షరాంజలి ఘటించారు. ఆయన ఆశయాలను ఆచరిస్తామని, ఆయన నడిచిన బాటను అనుసరిస్తామని ప్రతిన పూనారు. రాజకీయాల్లో విలువల పతనం, మహిళలపై ఆరాచకం, అధిక ధరల దరువు, భారం అవుతున్న సామాన్యుల బతుకు తెరువు, అంతరిస్తున్న జీవవైవిధ్యం, పెచ్చు మీరుతున్న అసమానతలు.. తదితర అంశాలపై కవులు కవితలూ, పద్యాలూ ఆర్తితో, ఆవేదనతో వినిపించారు. ప్రశ్నించాల్సిన అవసరాన్ని, సంఘటితం కావల్సిన సందర్భాన్ని కొందరు నొక్కి వక్కాణించారు. ఈ సభలో సుమారు 130 మంది పాల్గొనగా, 65 మంది కవితలు చదివారు. ఆనందాచారి, వొరప్రసాద్, జంధ్యాల రఘుబాబు, సత్యాజీ, కుమారస్వామి, శాంతిశ్రీ, రౌతు రవి, కెంగార మోహన్ ఈ జనకవనాన్ని నిర్వహించారు. ఇటీవల మృతి చెందిన ప్రముఖ కవి కలేకూరి ప్రసాద్ స్మృతికి కవులూ, రచయితలూ సంతాప సూచకంగా కొద్దిసేపు మౌనం పాటించారు.
నాలుగు పుస్తకాల ఆవిష్కరణ
ఈ సాహిత్య కార్యక్రమంలో కవితాపఠనం మధ్య మధ్యలో మూడు పుస్తకాల ఆవిష్కరణ జరిగింది. ఈ నాలుగూ నాలుగు సాహిత్య ప్రక్రియలకు సంబంధించినవి కావడం విశేషం. తొలుత ప్రముఖ కవి అద్దేపల్లి రామ్మోహనరావు కవితా సంపుటి 'కాలం మీద సంతకం'ను ప్రముఖ సాహిత్యవేత్త అంపశయ్య నవీన్ ఆవిష్కరించారు. మేడిపల్లి రవికుమార్ పరిచయం చేశారు. 'అద్దేపల్లి కాలంతో పాటు సరికొత్తగా ప్రయాణించే కవి. సమకాలీన సంక్షోభాలపై ఆయన స్పందనల అక్షర సమ్మేళనమే ఈ కవిత్వం' అని చెప్పారు. 'సమకాలీన సంక్షోభాల నుంచి, అవసరాల్లోంచి ఆవిర్భవించిన కవులు నిత్యం సామాజిక బాధ్యతతో వ్యవహరించాలి. వైయక్తిక బలహీనతలను అధిగమించి, సామూహిక, సామాజిక ప్రయోజనాలకు కట్టుబడి ఉండాలి. సుందరయ్య జీవితం మనకు నేర్పే గొప్ప విషయం అదే!' అన్నారు. కవి అద్దేపల్లి మాట్లాడుతూ, ప్రపంచీకరణ ప్రభావం ప్రతి ఒక్కరిపైనా పడిందని, దానికి ప్రతిఘటన ప్రారంభమైందని అన్నారు. ఈ నేపథ్యంలో విస్తృత ప్రాతిపదికన ఉద్యమాలను నిర్మించాల్సి ఉందని అన్నారు. శిరంశెట్టి కాంతారావు నవల 'ఆకుపచ్చ విధ్వంసం' నవలను మండవ సుబ్బారావు ఆవిష్కరించారు. ముక్తవరం పార్థసారథి పరిచయం చేశారు. 'నల్గొండలో పుట్టి, ఉద్యోగరీత్యా ఖమ్మంలో ఉంటున్న ఈ రచయిత ఉత్తరాంధ్రలోని సమస్యపై నవల రాయడం అభినందనీయం. ఇలాంటి జీవన వైరుధ్యాలను పట్టుకొని, సాహిత్యీకరించటం నేడు ఎంతైనా అవసరం' అని పేర్కొన్నారు. పుస్తకావిష్కర్త మండవ సుబ్బారావు మాట్లాడుతూ, ఈ నవలలో కృష్ణారావు మాష్టారు, ఎండమ్మ పాత్రలు రెండూ కీలకంగా కనిపిస్తాయని, వాటిని రూపొందించిన తీరు అద్భుతంగా ఉందని అన్నారు. ఉద్యమాలు సామాన్యులు ఎలా సాహసవంతులను చేస్తాయో, త్యాగధనులుగా తీర్చిదిద్దుతాయో ఈ నవల విశదీకరిస్తుందని చెప్పారు. సాహితీ స్రవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఆనందాచారి సుందరయ్యపై రాసిన స్ఫూర్తి శిఖరం' దీర్ఘకవితను ప్రజాశక్తి సంపాదకులు తెలకపల్లి రవి ఆవిష్కరించారు. ప్రముఖ కవి సీతారాం పరిచయం చేశారు. బొమ్మరాత యల్లయ్య రాసిన 'నెమలీకలు' నానీల సంపుటిని అద్దేపల్లి రామమోహన్‌రావు ఆవిష్కరించారు.
సందేశాలూ... నిర్ధేశాలూ...
కవితాపఠనం మధ్యలో ప్రముఖ కవి యాకూబ్, ప్రజానాట్య మండలి ఉపాధ్యకక్షులు దేవేంద్ర, డా. పిల్లలమర్రి రాములు ఆత్మీయ సందేశాలు వినిపించారు. 'కవిత్వం చారిత్రక పాత్ర నిర్వహించే సాహిత్య సాధనం. దానిని విస్తృతంగా ప్రచారం చేయాలి. ప్రతి కవీ మరికొందరి కవిత్వాన్ని జనంలోకి తీసుకెళ్లాలి. కవిత్వపు స్థాయిని, ప్రయోజనాన్ని పెంచాలి. మనిషినికదిలించి, కర్తవ్యోన్ముఖున్ని చేయాలి. అలాంటి కవిత్వానికి ఎప్పుడూ ఆదరణ ఉంటుంది.' అని చెప్పారు. 'కవిత్వంతో మాటా ముచ్చటా' అన్న కవితను చదివి వినిపించారు. దేవేంద్ర తన సందేశంలో- సాహితీ స్రవంతి, ప్రజానాట్య మండలి ఒకే లక్ష్యంతో సాహిత్య కళారంగాల్లో పనిచేస్తున్నాయని చెప్పారు. పరాయీకరణ, మార్కెట్టీకరణా పెచ్చుమీరిన ఈ తరుణంలో మరింత బలమైన కవిత్వం రావాలని ఆకాంక్షించారు. 'నాకు వైద్యం కావాలి' అంటూ ఓ కవితను చదివి వినిపించారు. ఈ సభలో సాహితీస్రవంతి నగర బాధ్యులు గేరా, మోతుకూరి నరహరి, ఉదయ్‌శంకర్, వూసలరజనీ గంగాధర్, కె. విల్సన్‌రావు, కె. యాకూబ్, మౌనశ్రీమల్లిక్, తంగిరాల చక్రవర్తి, ఎ. మోహన్‌కృష్ణ, జి. యాదగిరిరావు, మోతుకూరి నరహరి,కె. రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నెమలీకలు (నానీలు) అనే బొమ్మరాతి ఎల్లయ్య రాసిన గ్రంధాన్ని చివర్లో అద్దేపల్లి రామ్‌మోహన్‌రావు ఆవిష్కరించారు.