నువ్వే ఓ మహాత్ముడివి

కవిత

- మాధవి పిన్నమనేని

వేకువనే నువ్వు స్వేచ్ఛగా ఎగిరే విహంగానివి

మధ్యాన్నం నువ్వు పంజరాన బంధించినట్లు

వ త్తిచట్రంలో బంధితుడివి..

సాయంత్రాలలో నీవు సీతాకోకల వర్ణమద్దుకున్న సుకుమారుడివి

రాత్రుళ్ళు రగిలే నిప్పువి, ఆంక్షలు విదుల్చుకున్న ఆనందానివి

ఎగసే అలవి,ఉబికే లావావి,నడిసంద్రంలో సునామీవి....

ఉదయ, మధ్యాన్న, సాయంత్రాలలో పడ్డ ఒత్తిడిని వదలలేక

వాటిలో ఒదగలేక ఒక్కసారే పేలే అగ్ని పర్వతానివి....

ఎవరంటే ఏం చెప్పాలి

ఉదయ, మధ్యాన్న, సాయంత్రాలలో ఒదిగిపోతే మామూలు మనిషివి

ఒదగలేక ఒత్తిడి పడి, ఆలోచనలు రగుల్చుకొని ముందడుగేస్తే

నువ్వే ఓ మహా మనిషివి,

ఉదయాలను రోజంతా చల్లుకుంటే ఓ కవివి

మధ్యాన్నాలను నీలోఒంపుకుంటే గానుగ చుట్టూ తిరిగే ఎద్దువి

సాయంత్రాలను ఆసాంతం పరచుకుంటే ఓ ప్రేమికుడివి

రాత్రుళ్ళు మాత్రం రాసుకుంటే ఓ కాముకుడివి

అన్నీ కలిసినా ఆలోచనా, ఆచరణ లేక రగిలితే ఈ లోకంలో

ఇమడలేక కుమిలే, మార్పు కోరుకున్నా మారలేని

దిశా రహిత నిశాచరివి....

ఎం కావాలని రాసుందో నా నుదుటన అని ఎదురుచూడకుండా

నిమిత్త మాత్రుడులా నిలవకుండా...

కాలం తీర్పు కోసం కలబడక

ఏది ఎంత పాళ్లలో కావాలో అలా రంగరించుకుని

నిన్ను నువ్వు మలుచుకుంటే..

నువ్వే ఓ మహాత్ముడివి... మదర్‌ థెరిస్సావి