ఖమ్మం సాహితీస్రవంతి ఆధ్వర్యంలో శ్రీశ్రీ వర్థంతి

జూన్‌ 15న సాహితీస్రవంతి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రీశ్రీ వర్థంతి సభ జరిగింది. డా. సిహెచ్‌. ఆంజనేయులు, సాహితీస్రవంతి ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి రౌతురవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఆనందాచారి, బోడేపూడి విజ్ఞానకేంద్రం నిర్వహించే ఆదివారం మీకోసం కార్యక్రమ నిర్వాహకులు జోసఫ్‌లు ఈ సందర్భంగా ప్రసంగించారు. ముందుగా ఖమ్మం నగర రింగ్‌ రోడ్‌ వద్దగల శ్రీశ్రీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కన్నెగంటి వెంకటయ్య, వురిమళ్ళ సునంద, కపిల రాంకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన జనకవనంలో తాళ్ళూరి లక్ష్మి, రాధ, బండారు రమేష్‌, తోట కృష్ణారావు, మహతి సునంద, దాసోజు శ్రీనివాస్‌, క్రాంతికార్‌, కపిల రాంకుమార్‌లు కవితలు చదివారు. ఎం. శేషగిరి శ్రీశ్రీ రాసిన గేయాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డా. కావూరి పాపయ్య శాస్త్రి మాట్లాడుతూ శ్రీశ్రీ స్పష్టమైన సాహితీ అవగాహన కలిగివుండి, సంస్కృత, ఆంగ్ల భాషల్లో గట్టి పట్టు సాధించారన్నారు. ఎన్నో అనువాదాలకు, అనుసృజనకు, కొత్తకొత్త ప్రయోగాలకు ఆద్యుడయ్యాడని అన్నారు. ఈ శతాబ్దం నాది అని ఆత్మవిశ్వాసంతో చెప్పకలిగినవాడు శ్రీశ్రీ అన్నారు. అప్పటిదాకా వున్న భావకవితా ధోరణికి భిన్నంగా అభ్యుదయ భావాలను రంగరించి, మొదట సంప్రదాయ సాహిత్యంలో వృత్తాలలో, కందాలతో ప్రారంభించి, క్రమేణా మాత్రాఛందస్సు పట్టుకుని గురజాడ వారసత్వాన్ని కొనసాగించారని తెలిపారు. వ్యాసం, సమీక్షలు, రేడియో నాటికలు, ఇతర భాషా చలన చిత్రాలకు తెలుగు అనువాదం చేయడం, పత్రికా రంగం ఇలా ఎన్నో ప్రక్రియలలో శ్రీశ్రీ ప్రతిభను ప్రదర్శించాడని అన్నారు. సాహితీ విస్తృతి పొందటానికి శ్రీశ్రీ కృషి అనిర్వచనీయమని, అమూల్యమని కె. ఆనందాచారి తన ప్రసంగంలో పేర్కొన్నారు. కె. హిమబిందు, జోసఫ్‌, చావా వీరభద్రయ్య, స్వామి, జి. నాగేశ్వరరావు, ప్రజాసంఘాల నాయకులు మచ్చా వెంకటేశ్వర్లు, ఎ.జె. రమేష్‌, నున్నా నాగేశ్వరరావు, వాసిరెడ్డి వీరభద్రం, బి.వి.కె. మేనేజింగ్‌ కమిటీ బాధ్యులు, ప్రసాద్‌, గోపాలరావు, బి.వి.కె. విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 
మే 28న సాహితీ కిరణం తుర్ధ వార్షికోత్సవ సందర్భంగా హైదరాబాద్‌ త్యాగరాయ కళావేదికలో పట్టాభికళా పీఠం వారు నిర్వహించిన కవితల పోటీల్లో విజేతగా గుర్రాల రమణయ్య, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరు భరద్వాజ చేతులమీదుగా బహుమతి నందుకుంటున్న దృశ్యం వేదికపై గుదిబండి వెంకటరెడ్డి, డా|| పోతుకూచి సాంబశివరావు, తూములూరి రాజేంద్రప్రసాద్‌ తదితరులు.
 
మే 26న మానస ఆర్ట్స్‌ అకాడమీ (విజయవాడ) సంస్థ నుండి ఉగాది 2013 సాహిత్య పురస్కార గ్రహీతల్లో తంగిరాల చక్రవర్తి, రఘుశ్రీ, సి.హెచ్‌.వి. బ్రహ్మానందరావు, ప్రసాద్‌, రమణమూర్తి తదితరులు.