తొలి అభ్యుదయ కవి శ్రీశ్రీ

తొలి అభ్యుదయ కవి శ్రీశ్రీ అని ప్రముఖ రచయిత, విమర్శకులు రాచపాళెం చంథ్రేఖర్‌రెడ్డి అన్నారు. ఆయన సాహిత్యం నేటికీ అవసరమన్నారు. జూన్‌ 15న కడప జనవిజ్ఞాన వేదిక కార్యాలయంలో సాహితీస్రవంతి ఆధ్వర్యంలో శ్రీశ్రీ వర్ధంతి సమావేశం కడపజిల్లా సాహితీ స్రవంతి కన్వీనర్‌ ఎస్‌.మస్తాన్‌పల్లి అధ్యక్షతన నిర్వహించారు. తొలుత శ్రీశ్రీ చిత్ర పటానికి పూల మాలవేసి నివాళి అర్పించారు. అనంతరం రాచపాళెం చంథ్రేఖర్‌రెడ్డి మాట్లాడుతూ శ్రీశ్రీ సాహిత్యం పౌరాణికంతో మొదలై విప్లవ సాహిత్యంతో ముగిసిందన్నారు. తన సాహిత్యానికి సమాజానికి ఎంత సంబంధం ఉంది? అని ప్రశ్నించుకొన్న శ్రీశ్రీ 1933 జయభేరి కవితలో 'నేను సైతం' రాసి సమాజాభివృద్ధి ప్రతిఒక్కరు కలసి రావాలన్న ఆలోచనను రేకెత్తించారన్నారు. భావ కవితల్ని పక్కనబెట్టి మనిషి, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలపై తన సాహిత్యానికి పదును పెట్టారన్నారు. ఆకాశంలో పయనిస్తున్న సాహిత్యాన్ని భూమార్గం పట్టించిన వ్యక్తి శ్రీశ్రీ అని కొనియాడారు. మతం, ప్రాంతీయం కాదు వర్గ దృష్టి తన దృష్టి మలచిన మహామనిషి అని అన్నారు. మహాప్రస్థానం, ఖడ్గసృష్టి, మరో  ప్రస్థానం ద్వారా జనచైతన్యం తెచ్చారన్నారు. తన శ్రామిక జన సాహిత్యంపై ప్రస్తావిస్తూ 'వాడు' కవిత్వాన్ని చదివి వినిపించారు. శ్రీశ్రీ కవిత్వం వర్గదృష్టి శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కష్టజీవికి అండగా ఉందన్నారు. సాహిత్యనేత్రం ఎడిటర్‌ శశిశ్రీ మాట్లాడుతూ సాహిత్య కారులకు వర్గదృష్టి ఉండాలన్నారు. కార్యక్రమంలో జెవివి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రఘునాథరెడ్డి, మొగిలిచెండు సురేష్‌, పాలగిరి విశ్వప్రసాద్‌, అవధానం శ్రీనివాస్‌, సావంత్‌సుధాకర్‌, సోఫియా, అనిత, సబ్బరాయుడు, పవన్‌, గోవిందు, ఇరగయ్య సుదర్శన్‌ పాల్గొన్నారు.